కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉదయం కమ్ముకుంటున్న పొగ మంచు
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 7.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
ఎనిమిది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోగా.. మరో 20 జిల్లాల్లో 14 డిగ్రీల లోపల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఏజెన్సీ గ్రామాలు చలికి గజ గజ వణికిపోతున్నాయి. 10 రోజులుగా గిరిజనులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. చలికాలంలో సాధారణంగా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ గత పది రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి.
దీంతో ఉదయం 10 గంటలైనా పొగ మంచు కమ్మేసుకునే ఉంటోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతోపాటు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలల సమయాలను మార్చాల్సి వచ్చింది. ఉదయం 9:45 గంటల నుంచి పాఠశాలలు తెరవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర చలి నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈశాన్యం నుంచి శీతల పవనాలు
దక్కన్ పీఠ భూమికి ఎత్తైన ప్రాంతం కావడంతో హిమాలయాల నుంచి వీచే శీతల పవనాలు మొదటగా ఆదిలాబాద్‌ను తాకుతాయి. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండాకాలంలో పగటి పూట నమోదయ్యే 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం, శీతాకాలంలో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోంది. రోజంతా చల్లటి వాతావరణం ఉండటం తో వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.
కష్ట జీవుల ఇబ్బందులు
చలి తీవ్రత అధికమవ్వడంతో కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట ఎముకలు కొరికే చలితో పాలు అమ్మేవారు, పేపర్ బాయ్ లు, కూరగాయలు అమ్మేవారు, టీ క్యాంటీన్లు నడిపేవారు వణికిపోతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యులు విద్యార్థులను పాఠశాల ఆవరణలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి: వైద్యుల సూచన
కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు వైద్యులు సూచిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న చలిని తట్టుకునేందుకు శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు తప్పనిసరిగా నూలు దుస్తులు ధరించడంతో పాటు చెవులను, ముక్కును కప్పి ఉంచేలా జాగ్రతలు పాటించాలంటున్నారు. చిన్నారులకూ చలిగాలి తగలకుండా చూడాలని, జలుబు వేసిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆస్తమా రోగులు తప్పనిసరిగా ఉదయం పూట వ్యాయామంతో పాటు వేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.




