సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా..

– అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు..
– వేములవాడ పట్టణ సిఐ పి కరుణాకర్..
నవతెలంగాణ – వేములవాడ
శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సిఐ పి కరుణాకర్ హెచ్చరించారు. గురువారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ప్రత్యర్థి రాజకీయ పక్షాలను లక్ష్యంగా చేసుకొని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫాములపై ఏ రకమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా తక్షణమే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల సందర్భంగా తప్పుడు ప్రచారాలను చేయవద్దని, శాంతి భద్రతలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసే వారి పైన కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించి సహకరించాలని సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.
Spread the love