Friday, December 26, 2025
E-PAPER
Homeజాతీయంఏదిపడితే అది టీ కాదు

ఏదిపడితే అది టీ కాదు

- Advertisement -

తేయాకులున్నదే తేనీరు
ఎఫ్‌బీఓలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరిక

న్యూఢిల్లీ : ఏదిపడితే అది టీ కాదని, తేయాకులున్నదే తేనీరని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. కామెల్లియా సినెన్సిస్‌ ప్లాంట్‌ (తేయాకు చెట్టు) నుంచి తీసుకోకుండా మూలిక లేదా మొక్కల ఆధారిత కషాయాల ప్యాకేజింగ్‌లు, లేబులింగ్‌లపై ‘టీ’ అనే పదాన్ని ఉపయోగించకూడదని పేర్కొంది. ఈ మేరకు ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లు (ఎఫ్‌బీఓ)లకు ఈ నెల 24న హెచ్చరికలు జారీ చేసింది. తేయాకులు లేని ప్యాకేజింగ్‌లకు, ఉత్పత్తులకు రూయిబోస్‌ టీ, హెర్బల్‌ టీ, ప్లవర్‌ టీ వంటి పేర్లు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం నకిలీ బ్రాండింగ్‌కు సమానమని హెచ్చరించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు ప్రకారం కామెల్లియా సినెన్సిస్‌ ప్లాంట్‌ నుంచి తయారైన పానీయాలు మాత్రమే టీగా విక్రయించడానికి అర్హత పొందుతాయని తెలిపింది.

ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ రెగ్యలేషన్స్‌ 2011 ప్రకారం కాంగ్రా టీ, గ్రీన్‌ టీ, ఘనరూపంలో ఇన్‌స్టంట్‌ టీతో సహా అన్ని టీలను తేయాకు చెట్టు నుంచి పొందాలని అథారిటీ స్పష్టం చేసింది. అలాగే, ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ రెగ్యలేషన్స్‌ 2020లోని ఉప నియంత్రణ (1)ను ప్రస్తావిస్తూ ప్రతీ ప్యాకేజీ ముందు భాగంలో ఆహారం యొక్క వాస్తవస్వభావాన్ని స్పష్టంగా సూచించాలని గుర్తు చేసింది. ఈ నిబంధనలు అన్ని ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, దిగుమతి, అమ్మకం, ఈ-కామర్స్‌ సంస్థలకు వర్తిస్తాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆహార భద్రతా కమిషనర్లు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాంతీయ డైరెక్టర్లు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, పాటించని వ్యాపారాలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అథారిటీ ఆదేశించింది.టీ పరిశ్రమ సంస్థలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలను స్వాగతించాయి. టీకి ఇచ్చిన ఈ నిర్వచనం వినియోగదారుల మనస్సుల్లోని అనేక అస్పష్టతలు, గందరగోళాలను తొలగించడానికి సహాయపడుతుందని తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -