పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు
గడువులోగా వివరాలు అందించాలని ఆదేశాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన ప్రతి ఒక్కరూ తమ ఎన్నికల ఖర్చు లెక్కలను అప్పగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల తంతు ముగిసిన 45 రోజులలోగా అభ్యర్థులు తమ తమ ఖర్చుల వివరాలను లెడ్జర్లో రాసి పంచాయతీరాజ్ అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. మండలంలోని 15 గ్రామాల సర్పంచ్ లకు 42మంది,128 వార్డు స్థానాలకు 230 మంది బరిలో నీలిశారు. ఏకగీవ్రంగా ఎన్నికైన అభ్యర్థులతోపాటు ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన, ఓడిన వారందరూ ఎన్నికల సంఘం నియామావళి ప్రకారం ఖర్చుల లెక్కలను అప్పగించాల్సి ఉంది. 5 వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసిన వారు రూ.2.50లక్షల వరకు,వార్డు సభ్యులు రూ.50వేల వరకు ఖర్చు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్య ర్థులు రూ.1.50లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకు ఖర్చు చేయొచ్చు.నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు ఎన్నికల్లో పోటీ చేసిన వారు అన్ని రకాల ఖర్చులకు లెక్కలు రాసి ఎన్నికల సంఘానికి అప్ప గించాల్సి ఉంది. పరిమితికి మించి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం వేటు వేస్తుంది. ఖర్చుల వివరాలు అందించని వారిపైనా వేటు పడనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించకపోతే అలాంటి అభ్యర్థుల వివరాలను సంఘానికి అందించాలనే ఆదే శాలు ఉన్నాయని తెలుస్తోంది.ప్రతి అభ్యర్థి తమ తమ ఖర్చుల వివరాలను అందించి ఎన్నికల సంఘానికి సహకరించాలని అధికారులు సూచించారు.



