మహిళా సర్పంచ్ల విధుల్లో జోక్యం కుదరదు
మండలంలో 6 మహిళా సర్పంచ్లు
57 మంది వార్డు సభ్యులు
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామపంచాయతీ పరిపాలన వ్యవహారాల్లో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్పంచులుగా సతుల విధుల్లో పతులతో పాటు కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. గ్రామాల్లో గెలిచిన మహిళా సర్పంచులకు బదులుగా భర్తలు, కొడుకులు, కుటుంబస భ్యులు అధికారం చెలాయించడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 22న జరిగిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో సైతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో భార్యలకు బదులుగా భర్తలు ప్రమాణం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం మెమో నంబరు-3,292 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది.గ్రామపంచాయతీతో పాటు మండల పరిషత్, జెడ్పీలకు సైతం ఈ ఉత్వర్వులు వర్తింపచేయాలని సూచించింది.
స్థానికసంస్థల్లో సగం సీట్లు మహిళలకే..
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. మండలంలో 15 సర్పంచు స్థానాలకు మహిళలకు 6, మొత్తం 128 వార్డు స్థానాలకు 57,పురుషులకు 71 కేటాయించారు.
రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 5 సర్పంచ్ స్థానాలు కేటాయిస్తే, బీసీలకు 6 స్థానాలు, 3 ఎస్టీలకు,ఒకటి జనరల్ కేటాయించారు.128 వార్డు సభ్యుల్లో ఓసి 7,బిసి 54,ఎస్సి 39,ఎస్టీ 28 కేటాయించారు.
ఆచరణలో అమలయ్యేనా?
మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబస భ్యుల పెత్తనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలుకాలేదు. గత పాలకవర్గంలో మండలంలోని పలు గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో భర్తలు పాలన సాగించిన ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు సైతం భార్యలకు బదులుగా భర్తలకే ప్రాధాన్యత ఇవ్వడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వుతో మార్పు వస్తుందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల మార్కు కనిపిస్తుందని అంటున్నారు.



