నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా తెలంగాణలో కోడి గుడ్డు, చికెన్ ధరలు భారీగా పెరుగుతుండగా, గుడ్డు ధర ఏకంగా రూ. 8కి చేరుకుంది, కొన్ని దుకాణాల్లో రూ. 10కి కూడా విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం (పీఎం పోషణ్ పథకం)పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ. 6 మాత్రమే చెల్లిస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరగడంతో, మధ్యాహ్న భోజనం వంట కార్మికులు గుడ్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు వారానికి మూడుసార్లు ఇవ్వాల్సిన గుడ్లను రెండుసార్లు మాత్రమే అందిస్తున్నారు, ఈ విషయం ప్రధానోపాధ్యాయులకు తెలిసినా ప్రయోజనం ఉండటం లేదు.
రెండు నెలల క్రితం రూ. 6 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ. 8కి పెరగడంతో, ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో వారానికి మూడుసార్లు గుడ్లు ఇవ్వడం కష్టమవుతోంది..కొన్ని చోట్ల గుడ్లకు బదులుగా అరటిపండు ఇస్తున్నారు. దీనికి బదులుగా ఏపీ తరహాలో ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేస్తే బాగుంటుందని, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇస్తున్న విధంగానే పాఠశాలలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 24 వేల పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు, ఇందుకు 46 వేల మంది వంట ఏజెన్సీ మహిళలు పనిచేస్తున్నారు, వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం బియ్యం అందించినా, మిగతా వంట సరుకులు కొనడానికి 1-5 తరగతుల పిల్లలకు రూ. 6.78, 6-10 తరగతులకు రూ. 10.17 మాత్రమే చెల్లిస్తోంది, కోడిగుడ్డుకు రూ. 6 చెల్లిస్తోంది.
అయితే ప్రస్తుతం వంట నూనె, పప్పులు, కూరగాయలు వంటి వాటి ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కూడా సకాలంలో రాకపోవడంతో వంట కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది, అదే సమయంలో మెనులో మార్పులతో పాటు వంట కార్మికులకు చెల్లించే మొత్తాన్ని పెంచడంపై కూడా దృష్టి సారించింది.



