నవతెలంగాణ – ఆర్మూర్
హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది, రచయిత, మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి ఈ నెల 28న జరిగే స్మారకోపన్యాసం సభను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కోరారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో ఐ.ఎఫ్.టీ.యూ కార్యాలయంలో ఈనెల 28న ఎల్లమ్మ గుట్టలో జరిగే గొర్రెపాటి మాధవరావు స్మారకోపన్యాస సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించినారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్య వక్తలుగా నల్సార్ న్యాయ శాస్త్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ *ప్రొఫెసర్ శ్రీ కృష్ణ దేవరాజు, మానవ హక్కుల వేదిక (HRF) ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు యం.రాజేందర్ రెడ్డి, జంపాలా చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి హాజరవుతారని తెలిపారు. మాధవరావు గారు హక్కులు లేని అణిచివేతకు గురయ్యే వర్గాల పట్ల ఆరాటాన్ని తన జీవిత ఆచరణలో భాగం చేసుకున్నారు.
ఎన్నో ఎన్కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలను పరిశీలించి అవి ఎట్లా చట్ట వ్యతిరేకమో విశ్లేషించాడు. కోర్టుల్లో వాటిని సవాల్ చేసి దేశంలో అర్దుగా నమోదయ్యే ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అదేవిధంగా కార్మిక సంఘాలకు అండగా ఉంటూ కార్మికుల పక్షాన వేతన ఒప్పందాలు కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న తప్పుడు విధానాలను వ్యతిరేకించారు. కార్మికుల సంక్షేమం గురించి కార్మిక చట్టాలు అనే పుస్తకాన్ని రచించారు అనేక కార్మిక సంఘాలకు న్యాయ సలహాదారుడుగా ఉంటూ కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేశారు కార్మికుల వేతన ఒప్పందాలలో సౌకర్యాల్లో కల్పనలు కీలక భూమికను పోషించారు తన జీవితాంతం కార్మికుల ప్రజల హక్కుల కోసం కృషి చేశారు. కావున ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీ.పీ.టీ.ఎఫ్ జిల్లా నాయకులు ఎర్గట్ల పోచయ్య, ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ఉపాధక్షులు సూర్య శివాజీ, పీ.డి.ఎస్.యూ రాష్ట్ర నాయకులు ప్రిన్స్, డివిజన్ నాయకులు హన్మంత్ రెడ్డి, అనిల్, ఐ.ఎఫ్.టీ.యూ నాయకులు నరేందర్ తదితరులు పాల్గున్నారు.



