Saturday, December 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిముగిసిపోతున్న 2025, ఆగమించే 2026

ముగిసిపోతున్న 2025, ఆగమించే 2026

- Advertisement -

ఇది ఏడాది ముగింపు సంచిక గనక…’పీపుల్స్‌ డెమోక్రసీ’ మా పాఠకులందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నది. గడచిపోయిన ఏడాదిని సమీక్షించడం మాకు చాలా ముఖ్యం. తద్వారానే మనం వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి మన మొత్తం శక్తితో ప్రయోజనపూర్వకంగా భవిష్యత్తులో కాలూనేందుకు కావలసిన పట్టు చిక్కుతుంది.
మున్ముందుగానే మేం మా మౌలిక వైఖరిని పునరుద్ఘాటిం చడం అవసరం. ముఖ్యంగా మన చుట్టూ వున్న ప్రధాన మీడియా కార్పొరేట్‌ యాజమాన్యాల వలయంలో చిక్కుకుపోయి వుంది. సోషల్‌ మీడియా పట్టు కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ఆ విషయంలో ఫేక్‌ వార్తలకు, తప్పు సమాచారాలకు భారతదేశం ప్రపంచ ప్రధాన కేంద్రంగా తయారైంది. ఈ ఆవరణంలోనూ పెట్టుబడితో నడిచే బీజేపీ ఐ.టి విభాగం కార్యకలాపాలు ప్రాబల్యం వహిస్తున్నాయని చెప్పడం చర్విత చరణమే అవుతుంది. పరస్పర ద్వేషాన్ని, శతృత్వాన్ని పెంచడమే దాని ప్రప్రధాన వ్యవహారంగా పని చేస్తుంటుంది.

ఇలాంటి విషపూరిత వాతావరణంలో మేము ఈ విషవలయాన్ని ఛేదించేందుకు భారత ప్రజానీకం ప్రయోజనాల రక్షణ కీలకాంశంగా కావలసిన నివేదికలు, విశ్లేషణలు అందించే కర్తవ్యానికి పునరంకితం అవు తానని ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ మా పాఠకులకు మరోసారి హామీనిస్తున్నది. అయితే భారత ప్రజా సముదాయమంటే ఎవరు అనే విషయాన్ని కూడా విశదీకరిం చాలి. ఆ మాటకు అర్థం శ్రమజీవులు-కార్మికవర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు-అలాగే కోట్ల మంది ప్రజాస్వామిక, లౌకిక భావాలుగల పౌరులు, విద్యార్థులు, యువత పక్కకు నెట్టివేయబడి సామాజిక అసమానతకు హింసకు గురవుతున్న మహిళలు, తమ మనుగడకోసం ఉనికి కోసం పోరాడుతున్న గిరిజనులు, దళితులు, మైనార్టీలేనన్నది నిస్సందేహం.

అసమానతల దెబ్బ
2025లో ప్రపంచ వ్యాపితంగా ప్రత్యేకించి భారతదేశంలో అసమానతలు ప్రమాదకరంగా పెరిగి పోయాయి. సంపదలూ ఆదాయంలో నలభై శాతం కేవలం ఒక్క శాతం మంది గుప్పిట్లో చిక్కింది. అయితే ఆర్థికవేత్తలు, పండి తులు, పరిశోధకులు అందరూ కలసి ఈ దుర్మార్గ ధోరణిని వికృత సంపదలూ విపరీత దారి ద్య్రాన్ని ఎండగట్టడం హర్షణీయమవుతున్నది. అసమానతలకు తోడు భారతీయులను వేధిస్తున్న మరో సమస్య నిరుద్యోగం అంతులేకుండా పెరిగిపోతున్నది. ఈ రెండు లక్షణాలూ కలసి ఆర్థిక వ్యవస్థలో సరుకుల మొత్తం గిరాకీని దెబ్బతీస్తున్నాయి. అందరికీ మేలు చేసేవిధంగా ఆర్థిక వికాసం జరగకుండా అడ్డుపడుతున్నాయి. అయితే దీనివల్ల ప్రజల జీవితాలపై పడే ప్రభావం మాత్రం ప్రజలు మోయవలసి వస్తున్నది. ఈ మధ్య ప్రకటిం చిన లేబర్‌ కోడ్‌లు, ఉపాధి హామీ పథకం హుళక్కి చేసేందుకు ‘జీ రామ్‌ జీ’ అనే ఆర్భాటపు పేరుతో తెచ్చిన శాసనం జీవనోపాధి సమస్యను ఇంకా జటిలం చేయడం తథ్యం. ప్రధాన మీడియా ఒకే వైపు నుంచి జిడిపి పెరుగుదల పైనే ఊదరగొడుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం పైనే గొప్ప చిత్రణలు ఇస్తున్నాయి. దాంతో మరోవైపున దేశ ప్రజానీకంలో అత్యధిక భాగం కడగండ్ల పాలవుతున్నారనే కఠోర వాస్తవం కప్పిపుచ్చ బడుతున్నది. మానవాళికి సంబంధించిన ఐదు తప్పనిసరి అవ సరాలైన కూడు, గూడు, బట్ట, చదువు, వైద్యం అనేవి అత్యంత దారుణమైన సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి.

విద్యారంగం, న్యాయం
విద్యారంగంలో ఏం జరుగుతున్నదనేది ప్రత్యేకించి చెప్పుకో వలసి వుంటుంది. ఎందుకంటే ప్రస్తుత పాలనా వ్యవస్థ అతి తీవ్రంగా దాడి చేస్తున్న రంగం ఇదే. విద్య వాణిజ్యీకరణకూ కార్పొరేటీకరణను గట్టిగా తెచ్చి పెడుతూ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలు భారీ ఎత్తున మూతపడుతున్నాయి. వికేంద్రీకరణ, రాష్ట్రాలకు న్యాయమైన హక్కులు అనే ప్రాతిపదికపై ఏర్పడిన మొత్తం విద్యా నిర్వహణ వ్యవస్థ చట్రం కూలగొట్టి విపరీతమైన కేంద్రీకరణను రుద్దడం జరుగుతున్నది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఇందుకోసం ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసే శాసనాన్ని ఆమోదించేందుకు బరితెగించి ప్రయత్నం జరి గింది. అదొక సర్వోన్నత సంస్థగా మారి అదివరకటి నిర్మాణాలన్నిటినీ కొరగాకుండా చేస్తుంది. మతతత్వాన్ని కూరడం, మొత్తం మతతత్వంతో నింపడం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలను ధ్వంసం చేసే దాడులకు బలం చేకూర్చ డం ఈ విధమైన కేంద్రీకరణకు రెండవ లక్ష్యం.

మన రాజ్యాంగంలో న్యాయం అనేది ఒక అవశ్యభాగం. 2025లో అది కూడా దాడికి గురైంది. కుల గణన చేయాలని పదేపదే కోర్కెలు వచ్చినా, ఈ విషయమై తీవ్ర ఒత్తిడి తర్వాత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ప్రకటించినా వాస్తవంలో జరిగింది మాత్రం ఏమీ లేదు. అందుకు మారుగా దళితులు, ఆదివాసులు ఈ ఏడాది తీవ్ర దాడులకు గురైనారు. జల్‌, జంగల్‌, జమీన్‌ కార్పొరేట్‌ దురాశలకు మరింతగా గురైనాయి. అటవీ భూముల ఆక్రమణ, మరీ ముఖ్యంగా గనుల తవ్వకం, గిరిజనులను తొలగించడం జరిగిపోయాయి. ఇప్పుడు ఈ సమస్య వాతావరణ న్యాయం తోనూ మొత్తం పర్యావరణ దిగజారుడుతోనూ ముడిపడిపోతున్నది. పట్టణ ప్రాంతాలలో కాలుష్యం తీవ్రత పెరగడం, ఆరావళిపై దాడి ఈ దారుణమైన విధ్వంసానికి అద్దం పడుతున్నాయి. దళితులు, ఆదివాసులు, మైనార్టీలు, మహిళలతో సహా దుర్బల వర్గాలకు న్యాయం, సమానత్వం కల్పించే సమస్య ఇప్పుడు వాతావరణ న్యాయంతో మిళితమైపోతున్నది. మరీ ముఖ్యంగా హిందూత్వ దాడి, మనువాద ఫర్మానాలతో జెండర్‌ సమస్య విపత్కర స్థాయికి చేరుతున్నది.

మూలాలపై ద్విముఖ దాడి
ఈ మొత్తం పరిణామాల పర్యవసానం, రాజకీయ ప్రజాస్వామ్యం, లౌకికవాదాలపై వాటి వినాశకర ప్రభావం అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకూ 2025లో చెప్పు కోవలి సిందేమంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు ముప్పు. అదీ రెండు విధాలుగా. ఎన్నికల బాండ్లను రద్దు చేసిన తర్వాత కూడా ఎన్నికల ట్రస్టులకు కార్పొరేట్‌ విరాళాలలో దాదాపు తొంభై శాతం బీజేపీ పొందింది. మరో తీవ్రమైన సమస్య భారత ఎన్నికల కమిషన్‌ బీజేపీ జేబు సంస్థగా దిగజారిపోవడం. ‘సర్‌’ విష యంలో ప్రజానీకం ఎదురు తిరిగి పోరాడటం సంతోషం కలిగిస్తుంది. అయితే ఈ విడ్డూరపు కార్యక్రమంలో ఎన్నికల కమిషన్‌ తన స్వంత నియమావళిని కూడా పాటించలేదని తాజా వాస్తవాలు చెబుతున్నాయి. ‘సర్‌’ అనేది అతి పెద్ద తొలగింపు కసరత్తుగా తయారైందని కూడా వివరాలు చెబుతున్నాయి. ఓటింగు హక్కుకు తోడు పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు కట్టబెట్టడమనే అంశం దీన్ని మరింత జటిలం చేసింది. ఏ చట్టం ఏ నిబంధన లేకుండా కేవలం అమిత్‌ షా రూపొందించిన ‘గాలింపు, తొలగింపు, తరలింపు’ అనే తారకమంత్రమే ఏకైక పద్ధతి (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌)గా మారింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక బూటకంగా మారిపోతున్నది.

ప్రపంచం, పొరుగు దేశాలు
మన చుట్టూ వున్న ప్రపంచాన్ని పరికిస్తే మూడు ప్రధాన ప్రకంపనలు గోచరిస్తాయి. 2025లో అమె రికా పూర్తి మద్దతుతో గాజాలో పాలస్తీనియన్లపై జాతి మారణకాండ సాగింది. వాస్తవానికి గాజా నుంచి అరబ్‌లను నిర్మూలిం చేందుకు పెద్ద ప్రయత్నమే జరిగింది. అయితే ప్రపంచ వ్యాపితంగా ప్రజానీకం దీన్ని వెనక్కు కొట్టేం దుకు పోరాడటం సంతోషం కలిగించే విషయం. చివరకు గతంలో యూదు జాత్యహంకార ఇజ్రాయిల్‌కు సానుభూతిగా వున్న ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణ కొసం ఒత్తిడి పెట్టే పరిస్థితి వచ్చింది. అయినా ఉల్లంఘనలు కొనసాగు తూనే వున్నాయి. మానవాళిపై జరిగిన ఈ నేరాలకుగాను నెతన్యాహును, ఆయన ముఠాను బాధ్యులను చేసి శిక్షించక పోతే ఇవి ఆగబోవు. వెనిజులాలో వలె ఇతరచోట్ల కూడా అమెరికా సరికొత్త దుస్సాహసాలకు పాల్పడు తూనే వుంది. అయితే ఇలాంటి చోట్ల కూడా బహుళ ధృవ ప్రపంచ సంకేతాల వల్ల, చైనా దృఢ వైఖరివల్ల అమెరికా ఏకపక్ష ధోరణి గతంలో వలె బలంగా చలామణి అయ్యే పరిస్థితి లేకుం డా పోయింది. ట్రంప్‌ టారిఫ్‌ టెర్రరిజంతో ఎలాంటి ప్రాబల్య మైతే కోరుకున్నాడో దాన్ని సాధించడంలో విఫలమయ్యాడు.

పొరుగునే వున్న బంగ్లాదేశ్‌లో ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. కేవలం మైనార్టీలకు వ్యతిరేకంగానే గాక-1971 విమోచన పోరాటం తర్వాత రూపొందిన వివేకవంతమైన సంకేతాలన్నిటిపైనా మత చాందసం దురాక్రమణ చేస్తున్న సూచనలు స్పష్టంగా కనపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోనే గాక ఇండియాలోనూ ముందుకొస్తున్నది ఒకటే. కేవలం మత చాందస, మతతత్వ శక్తులు తీవ్రం కావడం మాత్రమేగాక మొత్తం జాతీయ గుర్తింపు అన్నదాన్నే పూర్తిగా తిరగదోడే ప్రయత్నం. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలను తిరోగమింపచేసి మతపరమైన గుర్తింపుతో ముడిపడిన ఒంటెత్తువాద చాందస జాతీయతగా మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నది.

సువిశాల ఐక్యత దిశలో..
అందువల్ల 2026 చాలా బలమైన మార్పులను నొక్కి చెబుతున్నది. డికెన్స్‌ భాషలో చెప్పాలంటే ఇది నిరాశా భరిత శీతాకాలం పోయి ఆశావహ వసంతానికి దారితీసే అవకాశం కల్పిస్తుంది. ప్రజల సువిశాల ఐక్యత, చైతన్యం, పట్టు వదలని పోరాటాలు ఆ లక్ష్యాన్ని సాద్యం చేస్తాయి. దీంతోపాటే ప్రత్యామ్నాయం పట్ల స్పష్టత, ఆ లక్ష్యసాధన కోసం ఐక్యతను నిలబెట్టే మార్గాన్ని ఎంచుకోవడం జరగాలి. ఈ మొత్తం మార్గంలో కీలక సంధానకర్తలు ప్రజలే. 2025తో పాటు వదలి పెట్టాల్సినవన్నీ వదలిపెట్టి 2026లో నూతన ఆశాభావాన్ని, సంతోషాన్ని తప్పక ఉదయింప జేయాలి. 2026 ఫిబ్రవరి 12న ట్రేడ్‌ యూనియన్ల ఉమ్మడి వేదిక ఇచ్చిన పిలు పునకు సంయుక్త కిసాన్‌ మోర్చా పూర్తి మద్దతు ప్రకటించింది. లేబర్‌కోడ్‌లు అలాగే ప్రభుత్వం అనుసరించే అన్ని రకాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి ఇదొక నిర్దిష్ట అవకాశం కల్పిస్తుంది. అత్యధిక విశాల ఐక్యతను పెంపొందించడం ద్వారా మరింత శక్తివంతమైన పోరాటాలకు అవసరమైన భూమికను సృష్టించేందుకు వీలేర్పడుతుంది.
(డిసెంబర్‌ 24 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -