Saturday, December 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅల్లకల్లోల ప్రపంచంలో అద్వితీయమైన చైనా

అల్లకల్లోల ప్రపంచంలో అద్వితీయమైన చైనా

- Advertisement -

సోవిట్‌ సోషలిస్ట్‌ నమూనా పతనం అనేది చైనా కమ్యూనిస్టు పార్టీ(సిపిసి)లో పెద్ద చర్చకు దారితీసింది. సిపిసి నాయకత్వం సోవియట్‌ మోడల్‌ని అనుసరించ కుండా మార్క్సిస్ట్‌ సిద్ధాంతాన్ని, చైనాస్థానిక పరిస్థితులకు వర్తింపజేసే సోషలిస్టు నమూనాను ఎంచుకుంది. ”చైనా లక్షణాలతో కూడిన సోషలిజం” అనే విధానాన్ని ఎంచుకుంది. అంటే మార్క్సిజం- లెనినిజం సిద్ధాంతం వెలుగులో చైనా దేశీయ లక్షణాలతో కూడిన సోషలిజం నమూనాను అమలు చేయాలని సిపిసి నిర్ణయించు కుంది.

భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా 1, అక్టోబర్‌ 1949లో ఏర్పడింది. మన స్వాతంత్రం తర్వాత రెండు సంవత్సరాల 35 రోజులకు చైనా ప్రజా రిపబ్లిక్‌ ఏర్పడింది. రెండు దేశాలకు అనేక పోలికలు ఉన్నాయి. కానీ చైనా అమెరికాను సవాలు చేస్తుంది. ప్రపంచ జీవన వ్యయ పోలిక (పిపిపి)ని అనుసరించి అమెరికాను చైనా అధిగమించింది. అనేక రంగాలలో అమెరికాను చైనా దాటిపోయింది. కానీ భారత్‌లో దారిద్య్రం, ఆకలి, అన్నదాతల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, కాలుష్యం, పౌష్టికాహార లోపం, వెనక బాటుతం, విద్యారంగ దుస్థితి, పెచ్చరిల్లుతున్న నేరాలు, అనేక అసమానతలు తాండవిస్తున్నాయి.

చైనా అత్యున్నత నాయకుడు డెంగ్‌ సియావో పింగ్‌ 1978లో ప్రారంభించిన ”ఓపెనింగ్‌ అప్‌” కీలకమైన సంస్కరణలు చైనా సమగ్ర స్వరూపాన్ని సమూలంగా మార్చి వేశాయి. చైనా 85 కోట్ల మంది ప్రజల దారిద్య్రాన్ని రూపుమాపింది. వారి ఆర్థిక సమగ్ర జీవన పరిస్థితులని సమూలంగా మార్చింది. ఇది ప్రపంచ మానవ అభివృద్ధిలో అసాధారణమైనది. 30 ఏండ్ల క్రితం ఆదేశ జనాభాలో 66శాతం ప్రజలు అత్యంత పేదరికంలో జీవించారు. అలాంటిది 2020 నాటికి చైనా ఆ దేశంలోని దారిద్య్రాన్ని సంపూర్ణంగా నిర్మూలిం చింది. మొత్తం ప్రపంచ మానవాళి చరిత్రలో చైనా ప్రజల పేదరిక నిర్మూలన చారిత్రాత్మకమైన ఘట్టం. ఆశ్చర్యకరమైనదనీ ప్రపంచ ప్రముఖులు వర్ణిస్తున్నారు.అనేక దశాబ్దాలుగా ఆటోమొబైల్‌ను ఏలిన అమెరికా పచ్చిమయూరప్‌ ఆటో ఇండిస్టీ చైనా పోటీకి బీటలు బారుతోంది.

మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో..స్టీల్‌ ఉత్పత్తిలో 53.9శాతం, సిమెంట్‌ ఉత్పత్తిలో 51.1శాతం, ఫెర్టిలైజర్స్‌, కెమికల్స్‌ లో 20- 30శాతం ఒక్క చైనాయే ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలోనీ హై స్పీడ్‌ రైల్‌ లైన్‌ మొత్తంలో ఒక్క చైనా 66శాతం కలిగి ఉంది. ప్రపంచ భారీ ఓడల నిర్మాణంలో చైనా ఒకటే 51శాతం నిర్మిస్తోంది. ప్రపంచ సముద్ర జలాల్లోకి వెళ్లే కొత్త భారీ ఓడల్లో సగం చైనా నిర్మించినవే. అవి కూడా ఏ దేశం నిర్మించనంత చౌకగా, నాణ్యంగా, గొప్ప సాంకేతికతతో చైనా నిర్మిస్తున్నది. రెండు దశాబ్దాల క్రితం ఓడల నిర్మాణంలో చిరునామాలేని చైనా దెబ్బకు అమెరికా పశ్చిమ యూరప్‌ షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమ కూలిపోగా, సౌత్‌ కొరియా జపాన్‌లు ఎదురీదుతున్నాయి. ఇండియా ఎక్కడో అడుగున ఉంది. సముద్ర జల రవాణాను వ్యూహాత్మకంగా విప్లవాత్మకంగా మార్చింది చైనా. అమెరికాను చైనా అనేక రంగాల్లో అధిగమించింది. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 30 శాతం కేవలం చైనాదే అంటే ఆ దేశ ప్రగతి ఎంత వేగంతో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలో ఆధిపత్యంలేని, అందరికీ సమానమైన న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కొరకు, మంచి మార్పుల కోసం ఒక ప్రభల శక్తిగా చైనా నిలబడింది. అమెరికా ఇంగ్లాండ్‌ పశ్చిమ యూరోప్‌, జపాన్‌ లాంటి ఆధిపత్య వలసవాదానికి పూర్తి వ్యతిరేకమైన ఒక బలమైన మృదువైన శక్తిగా దక్షిణ ఆఫ్రికా ఖండ, దక్షిణ అమెరికా, ఆసియా, పశ్చిమ ఆసియా, సెంట్రల్‌ ఆసియా దేశాలతో కలిసి నిలబడింది. మానవీయ జీవన విలువల ప్రమాణాన్ని నిర్ణయించడం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని ”సోషల్‌ క్రెడిట్‌ సిస్టం(ఎస్‌సిఎస్‌)” ను చైనా నెలకొల్పింది. 700 మిలియన్ల ఫేషియల్‌ రికగ్నిషన్‌ను గుర్తించే శక్తివంతమైన కెమెరాలు దేశ ప్రజలతో పాటు, ఇతర దేశాల పర్యాటకులను పర్యవేక్షించి నియంత్రిస్తున్నాయి. చైనా తన ప్రజల్లో సామాజిక సామరస్యాన్ని నెలకొల్పుతున్నది. నేరాల రేటు గణనీయంగా పడిపోయింది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో సురక్షితమైన దేశంగా గత రెండు దశాబ్దాల్లో చైనా మొదటి శ్రేణిలో నిలుస్తున్నది.

1990లో చైనా 170 పట్టణాలను కలిగి ఉండేది. నేడు అవి 700లకు పెరిగాయి. 17 మెగా సిటీలున్నాయి. షేన్జెన్‌ అనే ఒక చిన్న చేపలు పట్టే పట్టణం నేడు ప్రపంచానికి సిలికాన్‌ వాలీగా మారింది. డెంగ్‌ సియాఓ పింగ్‌ ‘ఓపెనింగ్‌ అప్‌’ చేసిన నాలుగు దశాబ్దాలలోనే చైనాలో ప్రపంచ మానవాళిని సమ్మోహన పరిచేలా, కండ్లు మిరుమిట్లు గొలిపేలా, అద్భుతమైన అభివృద్ధి జరిగింది. వీటన్నింటికీ ఒక్కటే సమాధానం. చైనాను అన్ని రంగాలలో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలనే దృఢమైన సంకల్పం గల విప్లవాత్మక నాయకత్వానికి ఆ కీర్తి దక్కుతుంది. డెంగ్‌ సియాఓ పింగ్‌ ”ఓపెనింగ్‌ అప్‌”తో, అమెరికా, పశ్చిమ, వివిధ దేశాల పెట్టుబడి దారులు చౌకైన శ్రమను కొల్లగొట్టడంకై తమ పరిశ్రమలన్నీ చైనాకు తరలించాయి. షరతు ప్రకారం కీలక సాంకేతికతలన్నీ చైనా గుప్పిట్లోకి వచ్చాయి. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచ ప్రజలు వినియోగించే 30శాతం పైగా వస్తువులు చైనా దేశానివే అంటే అతిశయోక్తి కాదు. చైనా విద్యుత్‌ వినియోగం చూస్తే కండ్లు తిరిగిపోతాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఇండియా, రష్యా, జపాన్‌ అన్నీ కలిసి ఎంత వినియోగిస్తాయో అంతకంటే ఎక్కువ కరెంటును చైనా వినియోగిస్తుంది.

చైనా హైడ్రో పవర్‌ దాని పరిశ్రమకు వెన్నెముకగా ఉంది. 436 గిగా వాట్‌ కెపాసిటీ ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉంది. త్రీ గార్జెస్‌ డ్యామ్‌ ఒకటే 22,500 మె.వా. కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద, తన రికార్డును తానే తిరగరాస్తున్న చైనా త్రీ గార్జెస్‌ కంటే రెండింతల పెద్ద ”మెడోగ్‌ హైడ్రో పవర్‌ స్టేషన్‌” (60 వేల మె.వా.)నిర్మాణం ప్రారంభించింది. ప్రకృతి హితమైన ”నూతన ఉత్పత్తి శక్తులను నిర్మించడమే చైనా ఏకైక లక్ష్యంగా ఉంది”. బొగ్గు విద్యుత్‌ వినియోగం ఇప్పటికీ గణనీయమైన 58శాతం అయినప్పటికీ, వేగంగా బొగ్గు ఆధారిత విద్యుత్తును తగ్గిస్తున్నది. న్యూక్లియర్‌ ఫ్యూజన్‌(కేంద్రక సంలీనం)తో సూర్యుడిలోని స్వచ్ఛమైన విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియను ఒక ఫ్యాక్టరీ రూపంలో చైనాలో నిర్మిస్తోంది. అది పూర్తయితే ప్రకృతికి హానిలేని అనంతమైన విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. ఇలా చైనా నూతన ఉత్పత్తి శక్తులను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తోంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భవిష్యత్తు అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయడం చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2025కు 200 టెర్రావాట్‌ హవర్‌, 2030 కల్లా 600 టెర్రవాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యం. ఒక్క 2024 లోనే చైనా 429 గిగా వాట్‌ విద్యుత్తును కొత్తగా చైనా ఉత్పత్తి చేసింది. కానీ ఇదే సమయంలో అమెరికా 51 గిగా వాట్‌ విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేసింది. ఆర్టిఫిషియల్‌ఇంటలిజెన్స్‌(ఎఐ)డేటా సెంటర్లు, సూపర్‌ కంప్యూటర్లకు నిరంతర విద్యుత్తు భారీ ఎత్తున అవసరం. ఏఐ రేసులో అమెరికా కంటే అన్ని దేశాల కంటే ముందున్న చైనా, గెలుపు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. 2024లో చైనా 9,852 టిడబ్ల్యూహెచ్‌ విద్యుత్తును వినియోగించింది. అంటే.. ఆసియా ఖండంలోని మొత్తం దేశాల విద్యుత్‌ డిమాండ్‌లో సగానికి పైగా ఒక్క చైనానే వినియోగించింది. 2025 చివరి నాటికి 10,498 టిడబ్ల్యూహెచ్‌కి చేరుకుం టుంది.

సాంకేతిక రంగంలో అత్యున్నత స్థాయి ఇన్నోవేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాతిపదికగా 2024లో చైనా ప్రభుత్వం పరిశోధనలకు 570 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. సాప్ట్‌వేర్‌ నుండి హార్డ్‌వేర్‌తో రోబోట్ల ద్వారా అన్ని రంగాలలో మార్కెట్‌కు అనుగుణమైన బిజినెస్‌ మోడల్‌ తయారీ కొరకు కొత్త భాగస్వాములు, పెట్టుబడిదారులతో కూడిన ఉత్పత్తి కార్యకలాపాలను చైనా ప్రారంభించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో రెండువందల కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీలు చైనాలో ఐదు వేలు ఉన్నాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. చైనా అభివృద్ధి నమూనా అనేది ఇతర దేశాలకు గుడ్డిగా ఎగుమతి చేసే సార్వత్రిక నమూనా కాదని సిపిసి నాయకత్వం కుండబద్దలు కొట్టినట్టు చెపున్నది. ప్రతి దేశం తన దేశీయ (శీతోష్ణస్థితి, భౌగోళిక, సాంస్కఅతిక, జీవవైవిద్య, వాతావరణ, చరిత్ర) అనేక పరిస్థితు లకు అనువైన వైవిద్యపూరితమైన విధంగా నిర్ణయించుకోవాలని, గుడ్డిగా అనుసరించవద్దని సిపిసి పేర్కొంటున్నది.

చైనా ప్రతియేటా ఏడు మిలియన్ల కాలేజీ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది. చైనాలో ఎస్‌టిఈఎం (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీ రింగ్‌, మ్యాథ్స్‌) విద్యార్థులు ప్రతియేటా ఐదు మిలియన్ల మంది బయటికి వస్తున్నారు. అమెరికాలో కేవలం ఎనిమిది లక్షల మంది ఎస్‌టిఈఎం విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. ఒక మిలియన్‌ విద్యార్థులు చైనా కమ్యూనిస్టు పార్టీలో చేరుతున్నారు. పార్టీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ అత్యంత పోటీతో కూడుకుని ఉంటుంది. మార్క్సిజం పట్ల సైద్ధాంతిక నిబద్ధత, అత్యంత ప్రతిభ, కష్టపడి పని చేసే విలువలతో కూడిన మచ్చలేని వారిని సిపిసి ఎన్నుకుంటుంది.
చైనా వ్యవసాయ పరిశ్రమలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఆధునీకరణ (మోడ్రనైజేషన్‌) 2012లో 57 శాతం అయితే, 2021లో 72 శాతానికి చేరింది. ఎరువులు, పురుగుమందులు చల్లడం, ట్రాక్టర్లు దున్నడం, నాట్లు వేయడం మనుషులు లేకుండా స్వయం చాలిత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అత్యాధునిక సాంకేతిక యంత్రాలతో జరుగుతున్నది. శిలాజ ఇంధనాలు లేని, స్వచ్ఛమైన బ్యాటరీ విద్యుత్తుతో నడిచే స్వయం చాలిత యంత్రాల ఉత్పత్తి మమ్మరంగా జరుగుతుంది. డ్రైవర్‌ లేకుండా వరి నాటు పెట్టే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యంత్రం రోజుకు 17 ఎకరాలకు పైగా ఖచ్చితమైన కొలతతో నాటు వేస్తుంది. డ్రైవర్‌ లేకుండా ”బైడు సాటిలైట్‌”తో నడిచే ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లు పూర్తి ఆటోమేటెడ్‌ (స్వయం చాలితమైన)వి సాధారణ ట్రాక్టర్ల కంటే 50శాతం అధిక సామర్థ్యం కలవి. నిపుణులైన మనుషుల కంటే కూడా దీని వ్యవసాయ పని నిర్వహణ కచ్చితత్వంతో కూడుకొని ఉంటుంది. చైనాలో నేడు ధాన్యం తలసరి ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిని దాటింది.

తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ”ప్రపంచాన్ని మార్చడం అనే ఏకైక లక్ష్యంతో”, భారీ పరిశోధనతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నది. నూతన ఉత్పత్తి శక్తులతో కూడిన పరిశ్రమనంతటిని అత్యాధునిక పర్యావరణహితమైన(ఎకలాజికల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌) అభివృద్ధి క్రమంలోకి పరివర్తన తీసుకొస్తున్నది. అందులో కీలకమైన పరిశ్రమలు న్యూ ఎనర్జీ వెహికల్స్‌ కొత్త శక్తి వాహనాలు (ఎన్‌ఈవి). బ్యాటరీస్‌, ఫోర్త్‌ జనరేషన్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీ, గ్రీన్‌ డీకార్బో నైసింగ్‌ టెక్నాలజీస్‌, ఫోటో వోల్టాయిక్‌ సోలార్‌ ప్యానల్స్‌, విండ్‌ పవర్‌, కేంద్రిక సంలీన (కృత్రిమ సూర్యుడి సృష్టి) ఫ్యాక్టరీ, క్లీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్‌ ఎకానమీ, అత్యాధునిక ఉన్నతశ్రేణి పరికరాలు, ఇలా అనేక రకాల ప్రకృతి వ్యతిరేక శిలాజ ఇంధన వ్యవస్థకు పూర్తి భిన్నమైన, పర్యావరణ హితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నది. అమెరికా, పశ్చిమ ప్రపంచాన్ని తలదన్నే మెషిన్‌ లెర్నింగ్‌ లాంటి నూతన ఉత్పత్తి శక్తులను ప్రాథమిక కర్తవ్యంగా అభివృద్ధి చేస్తున్నది చైనా. ఈ స్థాయికి పరిశ్రమను పరివర్తన చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ లక్ష్యసాధనకు, మొత్తం ఆదేశ రాజకీయ వ్యవస్థకు ఎంతో క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంకల్పం, దృఢమైన దీక్ష కావాలి. అవన్నింటినీ చైనా కమ్యూనిస్టు పార్టీ కలిగి ఉంది.

నైనాల గోవర్ధన్‌
9701381799

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -