Saturday, December 27, 2025
E-PAPER
Homeఆటలుదేశవాళీ జోష్‌

దేశవాళీ జోష్‌

- Advertisement -

రాణించిన కోహ్లి, పంత్‌
హైదరాబాద్‌కు మరో ఓటమి
విజయ్ హజారే ట్రోఫీ 2025

నవతెలంగాణ-బెంగళూరు : దేశవాళీ 50 ఓవర్ల ఫార్మాట్‌ విజయ్ హజారే ట్రోఫీ ఇటు క్రికెటర్లతో పాటు అభిమానుల్లో జోష్‌ తీసుకొచ్చింది. తొలి రౌండ్లో స్టార్‌ క్రికెటర్ల పరుగుల వరదతో రికార్డు పుస్తకాలు తిరగరాయాల్సి రాగా.. రెండో రౌండ్లోనూ అదే దూకుడు కనిపించింది. శుక్రవారం బెంగళూర్‌లోని సీఓఈలో జరిగిన ఢిల్లీ, గుజరాత్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ..98/3తో కష్టాల్లో పడింది. ప్రియాన్షు ఆర్య (1), ఆర్పిత్‌ రానా (10), నితీశ్‌ రానా (12) విఫలమయ్యారు. కానీ విరాట్‌ కోహ్లి (77, 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) ఓ ఎండ్‌లో దంచికొట్టాడు. టాప్‌-4 బ్యాటర్లలో ముగ్గురు విఫలమైనా విరాట్‌ మేనియాతో ఢిల్లీ స్కోరు బోర్డుకు ముందుకు కదిలింది.

కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (70, 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహజశైలికి భిన్నమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ధనాధన్‌ దూకుడుతో ప్రత్యర్థిపై విరుచుకుపడే పంత్‌… సహనంతో పరుగులు రాబట్టుకున్నాడు. సీఓఈ పిచ్‌ బౌలర్లకు అనుకూలించటంతో ఢిల్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులే చేసింది. హర్ష్‌ త్యాగి (40) ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. గుజరాత్‌ బౌలర్లలో విశాల్‌ జైస్వాల్‌ (4/42) నాలుగు వికెట్లతో రాణించాడు. ఛేదనలో గుజరాత్‌ 47.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటైంది. ఆర్య దేశారు (57), సౌరవ్‌ చౌహన్‌ (49) రాణించినా ఆ జట్టు విజయానికి చేరువలో బొల్తా పడింది. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ (3/37), ఇషాంత్‌ శర్మ (2/28), ఆర్పిత్‌ రానా (2/39) రాణించారు. 7 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

హైదరాబాద్‌కు రెండో ఓటమి
ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్‌..విజయ్ హజారే ట్రోఫీలో తేలిపోతుంది. ఎలైట్‌ గ్రూప్‌-బిలో హైదరాబాద్‌ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్బ 89 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ద్రువ్‌ సోరె (109 నాటౌట్‌, 77 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీకి తోడు ఆమన్‌ (82), యవ్‌ రాథోడ్‌ (68) రవికాంత్‌ (63) మెరవటంతో తొలుత విదర్బ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది.

ఛేదనలో హైదరాబాద్‌ 49.2 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. అభిరాత్‌ రెడ్డి (43), రాహుల్‌ సింగ్‌ (37), వరుణ్‌ గౌడ్‌ (85) రాణించారు. విదర్బ బ్యాటర్‌ ద్రువ్‌ సోరె లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుస శతకాల రికార్డులో తమిళనాడు బ్యాటర్‌ ఎన్‌ జగదీశన్‌ను సమం చేశాడు. గత ఏడాది విజయ్ హజారే నాకౌట్‌ దశలో హ్యాట్రిక్‌ సెంచరీలు బాదిన ద్రువ్‌.. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో బెంగాల్‌పై 136, హైదరాబాద్‌పై 109 బాదాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధిస్తే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుసగా ఆరు శతకాలు కొట్టిన బ్యాటర్‌గా ద్రువ్‌ చరిత్ర సృష్టించనున్నాడు.

రోహిత్‌ డకౌట్‌
తొలి మ్యాచ్‌లో శతకబాదిన రోహిత్‌ శర్మ (0) ఉత్తరాఖాండ్‌తో మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. ఎలైట్‌ గ్రూప్‌-సిలో శుక్రవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖాండ్‌పై ముంబయి 51 పరుగుల తేడాతో గెలుపొందింది. రఘువంశీ (11), రోహిత్‌ శర్మ (0) నిరాశపరిచినా.. ముషీర్‌ ఖాన్‌ (55), సర్పరాజ్ ఖాన్ (55), హార్దిక్‌ తమోరె (93 నాటౌట్‌), శామ్స్‌ ములాని (48) మెరిశారు. దీంతో ముంబయి 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ఛేదనలో ఉత్తరాఖాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులే చేసింది. ఓపెనర్‌ యువరాజ్‌ చౌదరి (96), జగదీశ సుచిత్‌ (51) రాణించినా.. ముంబయి ముందు ఉత్తరాఖాండ్‌ నిలువలేదు.

గ్రూప్‌-డిలో రైల్వేస్‌పై ఆంధ్ర జట్టు 6 వికెట్లతో గెలుపొందింది. తొలుత రైల్వేస్‌ 50 ఓవర్లలో 266/9 పరుగులు చేయగా.. ఆంధ్ర మరో 32 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అదే గ్రూప్‌లో సర్వీసెస్‌పై ఒడిషా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రపై హర్యానా 6 వికెట్ల తేడాతో పైచేయి సాధించగా.. చత్తీస్‌గఢ్‌పై పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌పై గోవా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చంఢగీడ్‌పై ఉత్తరప్రదేశ్‌ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యూపీ తొలుత 367/4 పరుగులు చేయగా.. చంఢగీడ్‌ 29.3 ఓవర్లో 140 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -