జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణతో సులభతరంగా పౌర సేవలు
12 మంది జోనల్ కమిషనర్లు బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులు వెంటనే జరుగుతాయన్న అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 పురపాలికలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) విలీనం చేయడంతో హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) నగర పురపాలన నూతన దశ సంతరించుకుంది. విలీనంతో జీహెచ్‌ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించగా, విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ అవతరించిందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రకటన విడుదల చేసింది.
వార్డుల పునర్వ్యవస్థీకరణ.. 150 నుంచి 300కు పెంపు
జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నగర విస్తరణకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రజాప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం తద్వారా విస్తరించిన పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం తెలిపింది.
జోన్లు, సర్కిళ్ల పునర్నిర్మాణం
పెరిగిన పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీని 6 జోన్ల నుంచి 12 జోన్లు, 30 సర్కిళ్ల నుంచి 60 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుతం 1.34 కోట్లకు పైగా జనాభా ఉన్న నగరానికి ఈ మార్పులు వికేంద్రీకృత పాలనను మరింత బలోపేతం చేయనున్నాయి.
జోనల్ కమిషనర్ల నియామకం
నూతన పరిపాలనా నిర్మాణానికి అనుగుణంగా, జీహెచ్‌ఎంసీకి 12 మంది జోనల్ కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. వీరు శుక్రవారం బాధ్యతలు స్వీకరించడంతో, పునర్వ్యవస్థీకరించిన జోన్లలో పరిపాలన తక్షణమే అమల్లోకి వచ్చింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పాలన మరింత బలోపేతం కానుంది.
సమతుల్య, సుస్థిర పట్టణ అభివృద్ధి దిశగా
పన్నులు, సరళీకృత పరిపాలనతో జీహెచ్‌ఎంసీ ఆర్థిక, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ పునర్వ్యవస్థీకరణతో సమతుల్య పట్టణ అభివృద్ధి, మెరుగైన విపత్తుల, వరదల నిర్వహణ, నగర కేంద్రం నుంచి చివరి ప్రాంతాల వరకూ సమాన మౌలిక వసతుల కల్పన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. విస్తరించిన, పునర్వ్యవస్థీకరించిన జీహెచ్‌ఎంసీ సమర్థ పాలన, సమగ్ర, సుస్థిర పట్టణ వృద్ధి అనే లక్ష్యాలతో హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక ఏకీకృత విధానాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నట్టు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.



