వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్
నవతెలంగాణ – కాటారం
కాటారం సబ్ డివిజన్ సమగ్ర అభివృద్ధికై రూ.500 కోట్లు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాటారం కేంద్రంగా వంద పడకల ఆస్పత్రి, మినీ స్టేడియం, అంబేద్కర్ పేరు మీద విజ్ఞాన కేంద్రం, కమ్యూనిటీ హాలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అలాగే ఎడ్యుకేషనల్ హాబ్, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అన్ని మండలాలలో డిజిటల్ లైబ్రరీసు ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా వినతి పత్రాలు అధికారులకు అందజేశామని తెలిపారు.
కడుపులో పెట్టుకున్న తల్లిని మర్చిపోయి పాలన కొనసాగిస్తున్నట్టుగా వారి వ్యవహార శైలి ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. కోటి యాభై లక్షల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశామని ప్రకటించుకుంటున్నారని, ఇది సరైంది కాదని, వారిని వారి కుటుంబాన్ని నిత్యం కాటారం సబ్ డివిజన్ ప్రజలు ఆదరిస్తున్నారని మరోసారి గుర్తుచేశారు. కానీ ఏండ్లుగా వాళ్ళ వెనుకబాటు తనానికి వారి కుటుంబమే భాగస్వామ్యం అవుతున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. ఎన్నో ఏండ్లుగా వారి కుటుంబం పదవులను అనుభవిస్తునే ఉన్నా.. అభివృద్ది కనిపించడం లేదన్నారు. 78వ స్వాతంత్రం తర్వాత కూడా గుడిసెల్లో నివసించే పేదలు ఇంకా ఉన్నారని అన్నారు. మంత్రి క్షేత్ర స్థాయిలో కాటారం సబ్ డివిజన్ పరిధిని పరిశీలించి, రూ. 500 కోట్లు నిధులు మంజూరు చేసి, అభివృద్దికి బాటలు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్, సందీప్, గణేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.



