Sunday, December 28, 2025
E-PAPER
Homeకథబలి పశువులు

బలి పశువులు

- Advertisement -

గడిచిన వారం రోజులుగా మరియ ను ఇబ్బంది పెట్టిన జ్వరం కొద్దిగా తగ్గినా నీరసం మాత్రం అలాగే ఉంది, ఒక్క రోజు జ్వరం ఆరు నెలల బలం తీస్తుంది అంటారు కదా ! మరియ కు ఇప్పుడు అది నిజమే అనిపించింది. పక్కనే దివాన్‌ బల్లా పైన మరియ కూతురు క్లారా నిండా దుప్పటి కప్పుకొని నిద్ర పోతుంది. మరియ వాష్‌ రూం కు వెళ్ళటానికి తోడుగా క్లారా ను లేపు దామని అనుకుంది, కానీ పాపం వారం రోజులుగా కాలేజీ మానేసి సపర్యలు చేస్తున్న కూతురును ఇబ్బంది పెట్టొద్దని ఓపిక తెచ్చుకొని లేచి లైట్‌ వేసింది. బైట సన్నగా వర్షం పడుతుంది, గడియారం వైపు చూసింది సమయం తెల్లవారుఝామున నాలుగు దాటింది, బైట ఏదో అలికిడిలా వినిపించి కొంచం నడిచి వరండాలో లైట్‌ వేసి బైటికి చూసింది. దూరంగా పెద్ద పెద్ద బుల్డోజర్లు, ఏవో పెద్ద పెద్ద వాహనాలు వాళ్ళు ఉండే కాలనీ వైపుకు వస్తున్నాయి. గబ గబా వెళ్ళి ”క్లారా… క్లారా, పాప లేమ్మా” అంటూ అమ్మాయిని లేపింది. ”కొంచం సేపు పడుకుంటానమ్మా! ఈ రోజు మార్నింగ్‌ ప్రేయర్‌ చేయలేను” అంది నిద్ర కళ్ళతో అటు వత్తిగిలి తిరిగి పడుకుంటూ. ”అది కాదు పాపా! బైట పెద్ద పెద్ద వెహికిల్స్‌ మన కాలనీ వైపు వస్తున్నాయి! నాకేదో భయంగా ఉంది” అంటూ క్లారా ను లేపి, చేయి పట్టుకొని బైటికి తీసుకు వచ్చింది. పెద్ద పెద్ద రాక్షసాకార వెహికిల్స్‌ ముందుకు దూసుక వస్తున్నాయి, వాటి చప్పుళ్లకు కాలనీలో చాలా మంది లేచినట్లున్నారు, అంతా బైటికి వచ్చి గోల గోలగా మాట్లాడుకుంటున్నారు.

మరియా గుండెలదురుతున్నాయి, రెండు రోజులుగా ఏవేవో వార్తలు గుబులు పుట్టిస్తున్నా….తేలికగా కొట్టి పారేసింది. కానీ బహుశా తను విన్నవన్నీ నిజాలేనా? ఈ బుల్డోజర్లు అందుకే వస్తు న్నాయా!? మరియ వణికి పోయింది. కానీ ఆమె ధైర్యం సన్నగిల్లలేదు, కారణం వాళ్ళ కుటుంబం అక్కడికి వచ్చి ఇరవై ఏళ్లు దాటింది. అన్నీ గవర్నమెంట్‌ అప్రూవల్స్‌, పర్మీషన్‌ లు ఉన్నాయని, అందుకే బ్యాంక్‌ లోన్లు కూడా ఇస్తున్నారని, ప్రక్కన ఎవరో పెద్ద మననుషులు ఇక్కడ ఫామ్‌ హౌస్‌, ఫంక్షన్‌ హాలు, కాలేజి కడుతున్నారని, ముందు ముందు కొనాలన్నా ఇక్కడ ఇండ్లు కొన లేరని ఇంకా ఏవేవో బిల్డర్‌ చెప్పి ఈ ఇల్లు కొనమని మరియా వాళ్ళకు చూపించాడు.

మరియా భర్త గవర్నమెంట్‌ హాస్పిటల్‌ లో అటెండర్‌ గా చేసి రిటైర్‌ అయ్యాడు, ఆ వచ్చిన డబ్బులతో ఆ మహా నగరంలో ఇల్లు కొనలేమని, తక్కువకు వస్తుంది కదా అని ఇంత దూరం వచ్చి ఈ ఇల్లు కొనుక్కున్నారు. అలాగే చాలా మంది దిగువ మధ్యతరగతి వారు ఇక్కడ ఇండ్లు కొనుక్కున్నారు. ఈ కాలనీ ఏర్పడ్డాక రోడ్లు, మంచి నీళ్ళు, కాలువలు అన్నీ వచ్చాయి. క్రమం తప్పకుండా హౌస్‌ టాక్స్‌, వాటర్‌ టాక్స్‌ అన్ని కట్టించుకుంటున్నారు.
ఆ తరువాత ఇక్కడికి ఫామ్‌ హౌస్‌ ఫంక్షన్‌ హాల్‌, కాలేజి వచ్చాయి. ఆ ప్రాంతం చాలా అభివద్ది చెందింది. ఇక్కడ ఇల్లు కొనుక్కున్న వాళ్లంతా చాలా సంతోష పడ్డారు. కొందరు అయ్యో ఇక్కడ ఇల్లు కొనలేక పోయామని బాధ పడ్డారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, పైగా అన్ని ఆధారాలు ఉన్నందున ఆ పుకార్లను నమ్మి మరియా భయపడలేదు.

వర్షం కొంచం పెరిగింది, ఆ కాలనీ ఎంట్రెన్స్‌ లో మొదటి ఇల్లు మరియా వాళ్ళదే, వాహనాల హెడ్‌ లైట్ల వెలుతురు వర్షపు ధారలను ఛేధిస్తూ కాలనీ రోడ్డు మీద, మరియా వాళ్ళ ఇంటి గోడల మీద పరావర్తనం చెందుతూ దగ్గరవుతుంది. ఈ హడావిడి చూసి మరి కొందరు వెనుక కాలనీలో ఉన్నవారు, ఆ చుట్టుపక్కల వాళ్ళంతా గొడుగులు, రెయిన్‌ కోట్లు వేసుకొని మరియా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. మరియా కూడా బైటికి వచ్చింది, గాలి వేగానికి వర్షం భలంగా శరీరాన్ని చురుక్కుమనేలా తాకుతుంది. తెల్లవారుతున్నా నల్లని మేఘాలు కమ్మిన కారణంగా అంతా చీకటిగానే ఉంది.
”మరియమ్మా భయపడకు! ఈ ఇండ్లకు ఏమికాదట, ఆ ఫంక్షన్‌ హాల్‌, ఫామ్‌ హౌస్‌ చెరువును ఆక్రమించి కట్టారని వాటిని ప్రభుత్వం వారు కూల్చమని ఆదేశించారట.” అన్నాడు మరియా ఇంటి ప్రక్కన వుండే గుడి పూజారి వెంకట రమణాచార్యులు.
”ఏసయ్యా నీకు శ్రోత్తములు తండ్రి, నీ బిడ్డలను తప్పిపోయిన గొర్రె పిల్లల్లా కాచే నీ మహిమ తండ్రి” అని ప్రభువును మనః పూర్తిగా ప్రార్ధించి గుండెలనిండా గాలి పీల్చుకుంది మరియా.

ఐనా ఇది న్యాయమేనా! ప్రభుత్వంలోని పెద్ద పెద్ద అధికారులు, వారి క్రింద అధికార గణాలు, ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా ఇంతపెద్ద కాలనీ కట్టడానికి ఒకరేమో పర్మీషన్లు ఇస్తారు, సంవత్సరాలు గడిచి పోయాక, ప్రభుత్వాలు మారిపోయాక, ఎప్పోడో ఎవరికో ఏదో గుర్తొస్తుంది, ఇలా చేసే ముందు పేదల బ్రతుకుల గురించి ఎవరూ పట్టించుకోరా? ఒక చిన్న పక్షి గూటిని తొలగించటానికి ఎంతో ఆలోచిస్తాము కదా! అలాంటిది ఉన్న పళంగా ఇళ్లను కూల గొట్టడం ఎంతవరకు న్యాయం. ఇంతకాలం గుర్తురానివి ఇప్పుడెందుకు చేస్తున్నారు?. ఈ స్థలాలు ప్రభుత్వ ఆస్తులైతే అప్పుడే ఆక్రమణలను ఎందుకు ఆపలేదు?. ఇక్కడ కట్టిన ఇండ్లకు పర్మీషన్లు, కరెంటు, నీళ్ళు ఎలా ఇచ్చారు?. టాక్సీ ఎందుకు కట్టించుకున్నారు.? ఇంతకాలం తమ జీవిత కాలపు పొదుపుతో కట్టుకున్న ఇల్లుపోతే మా పెదాల జీవితాలు ఏమైపోతాయి. అటు తిరిగి ఇటు తిరిగి అధికారం పంచుకునే పార్టీలు అవే కదా!? ముందుగా వారిని శిక్షించాలి.? మరియా ఏవేవో ఆలోచిస్తుంది.
కానీ తన ఇంటికి ప్రమాదమేమీ రాలేదు కదా! అని సంతోషించింది. మరోసారి చల్లని మాట చెప్పి ఉపశమనం కలిగించిన పూజారికి, ఎల్లప్పుడూ తన బిడ్డల వెన్నంటి ఉండి కాచిన పరిశుద్ధాత్మకు వందనాలు చెల్లించింది. నిజంగా ఒక వేళ ఈ ఇల్లు కూల్చి వేస్తే మా బ్రతుకులు ఏమయ్యేవో కదా! అనుకుంది మరియ. ఇప్పుడు మాకు ఉన్న ఆదారం ఈ ఇల్లు, చని పోయిన భర్త ఇమ్మనియల్‌ తాలూకా పెన్షన్‌ మాత్రమే. అది కూడా చాలా తక్కువ పిల్ల చదువు ఇల్లు గడవటానికి బొటా బొటీగా సరిపోతుంది. మునుపటిలా ప్రయివేట్‌ స్కూల్లో టీచర్‌ గా చేసే ఓపిక ఇప్పుడు తనకు లేనందుకు బాధపడింది. క్లారా చదువు పూర్తి ఐతే ఏదో ఒక ఉద్యోగం రాక పోదు, దాన్ని ఓ ఇంటి దాన్ని చేసి, ఈ ఇంట్లోనే ఉండమంటే తను బ్రతికినన్ని నాళ్లు వాళ్ళతోనే వుండొచ్చు, ఆ తరువాత ఈ ఇల్లు వారికే చెందుతుంది, ఐనా అంతకు మించి ఇవ్వడానికి మాత్రం తన దగ్గర ఏముంది అనుకుంది. ”క్లారా కాస్తా టీ పెట్టి ఇస్తావా ”ఈ రోజు కొంచం ఓపిక వచ్చింది, ఈ లోగా నేను ఉదయపు ప్రార్ధనను ముగిస్తాను” అంది మరియ. ఓపిక సరిపోనీ కారణంగా రోజు గంటకు పైగా సాగే ఆమె ప్రార్ధన త్వరగానే ముగించింది. మళ్ళీ ఇంటిముందు అరుపులు పెరిగాయి. ప్రత్యేక ఆయుధాలు, లాఠీలు పట్టుకున్న పోలీసులు జనాన్ని చెల్లా చెదురు చేస్తున్నారు. వారి వెనక వాహనాలు దూసుకొని వస్తున్నాయి. జనంలో హాహా కారాలు పెరిగాయి.

”మరియక్కా జల్ది బైటికి రాన్రి ఇండ్లు కూల గొడ్తరట” అరిచిండు ఇంటి పక్కనుండే తాహెరుల్లా. మరియ గుండెలు అదిరి పోయాయి కాళ్ళకింద భూకంపం వచ్చినట్లు అనిపించి ఒళ్ళు తూళింది. అలాగే గోడను అనుకోని కళ్ళు మూసుకొని నిలబడింది. క్లారా ఏడుస్తూ వచ్చి మరియను చుట్టేసుకొని ఏడుస్తుంది. ”ఏసయ్యా! ఏంటీ పరీక్ష గూడూ లేని పక్షులను చేస్తున్నావా తండ్రి” అని మరియ రోధిస్తూ కూలబడింది. మరియా ఇంటి ఎదురుగా ఉండే జానికి ఉక్రోశాన్ని ఆపుకోలేక పోయింది, కోపంతో ఊగిపోతూ. ”రండి అందరం వెళ్ళి అడ్డుకుందాం, జీవితాలే నాశనం అయ్యాక మనకీ ప్రాణం ఎందుకు? అని గట్టిగా అరుస్తూ వెళ్ళి రోడ్డుమీద పడుకుంది. కర్తవ్యం గుర్తొచ్చి కళ్ళు తుడుచుకొని, లేని ధైర్యాన్ని, ఒంట్లోని సత్తువను కూడగట్టుకొని బైటికి వచ్చి తను కూడా రోడ్డుకు అడ్డంగా పడుకుంది మరియ. క్లారా ఏడుస్తూ మరియా పక్కనే కూర్చుంది. కాలనీ ఆడ మగ అంతా వచ్చి రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు.
ఎవరో అధికారి వచ్చి మీరు చట్టాన్ని గౌరవించాలి, ఇది పద్దతి కాదు? అని ఏదో చెప్పబోయాడు. ఏది పద్ధతి కాదు? ఇక్కడ ఇండ్లు కడుతుంటే పర్మీషన్‌ ఇచ్చింది ఆ చట్టమే కదా! ముందు దాని సంగతి చెప్పండి? గట్టిగా అరుస్తున్నట్లు అడిగింది మరియ. ఇక్కడ చెరువు ఉన్నది వాస్తవం, ఈ ఆక్రమణలు వాస్తవం… ఈ తప్పిదాల వల్ల నగరం వానొచ్చినా, వరదొచ్చినా మునిగిపోతుంది. మంచి నీళ్లు కూడా దొరకని పరిస్తితి వచ్చింది ఇప్పుడైనా బాగు చేసుకోవద్దా!? అన్నాడు మరో అధికారి. ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది…

”మీరన్నవన్నీ నిజాలే అయినప్పుడు ఇక్కడ భూములు ఆక్రమిస్తుంటే ఏంచేశారు? ఇక్కడ కాలనీలు వెలుస్తుంటే ఏంచేశారు?. ఈ కాలనీకి కరెంటు నీళ్ళు రోడ్ల వంటి సౌకర్యాలు కల్పించింది మీ ప్రభుత్వాలే కదా? ఇక్కడ ప్రభుత్వ పాఠశాల, హెల్త్‌ సెంటర్‌ కట్టించింది ప్రభుత్వమే కదా?. అప్పుడు ఇవి ఆక్రమణలని ప్రభుత్వాలకు తెలియదా? ఇప్పుడొచ్చి కూల్చేస్తే మా బ్రతుకులు ఎమైపోతాయి..? జానకి అధికారులను నిలదీసి ప్రశ్నల వర్షం కురిపింవింది.
ఇవన్నీ వినటానికి మేము రాలేదు, అధికారుల ఆదేశానుసారం మా పనిని మేము చేస్తున్నాము, ఒక గంటలో ఇండ్లు కాళి చేయండి, అదిగో అక్కడ ఫామ్‌ హౌస్‌, స్కూలు, ఫంక్షన్‌ హాలు అన్నీ కూల్చేస్తాము, వాటి కన్నా మీ కొంపలు ఎక్కువా అన్నాడో అధికారి.

”అవును ఎక్కువే, వాళ్ళు శ్రీమంతులు అలాంటివి వారికి చాలా ఉంటాయి, కానీ మాకు ఈ ఇల్లు తప్ప వేరే ఏముంది, ఇది పోతే మా జీవితమే పోతుంది. ఇక్కడే పడి చస్తాము కానీ ఇక్కడినుండి కదలం” అంది ఆ కాలనీ నివాసి ఫాతిమా. ఆ అధికారి ఫోన్‌ లో ఎవరితోనో మాట్లాడాడు. చివరిసారిగా చెపుతున్నాము ”మర్యాదగా కాళీ చేయండి” అన్నాడు కటువుగా హెచ్చరిస్తున్నట్లు. మరియ, ఫాతిమా, జానకి ఇతర కాలనీ వాసులు ససేమిరా అన్నారు.
అంతే…. ఫట్‌ మని మరియ మీద లాఠీ దెబ్బ పడింది. జొన్న చేను మీద పందుల గుంపు పడ్డట్లు, అరటి తోట మీద ఏనుగుల గుంపు దాడి చేసినట్లు పోలీసులు లాఠీలతో జనం మీద విరుచుక పడ్డారు, బూటు కాళ్ళతో తన్నుతూ, నీళ్ళ గొట్టాలతో అందరినీ చెల్లా చెదురు చేశారు. పది నిముషాల్లో ఆ ప్రాంతం రక్త సిక్తమయ్యింది, ఎమకలు విరిగాయి, తలలు పగిలాయి..ఆర్తనాధాలు హాహాకారాలతో ఆ ప్రదేశం భీతవహకంగా మారింది. ప్రభుత్వాల రాజకీయ ఆటలో పేదల జీవితాలు కరమైన రాక్షస యంత్రాల క్రింద నలిగి నుజ్జు నుజ్జై పోతున్నాయి, చూస్తుండగానే ఇండ్లు నేల కూలుతున్నాయి. ఒక జీవితకాలం కష్టపడి, చెమటోడ్చి కట్టుకున్న పేదల ఆశల సౌధాలు పేక మేడల్లా కూలి పోతున్నాయి. కానీ అక్కడ కూలి పోతున్నవి ఇటుకలు, సిమెంటు కాదు అవి పేద ప్రజల రక్త మాంసాలు అని ప్రభుత్వాలు గ్రహిస్తాయా?

ఒక కప్పుకు ఏ కష్టమొచ్చినా రామా అని దైవాన్ని తలచుకునేదట, అలాంటిది ఒక రోజు ఆ కప్ప మీద తన దైవం రాముని కాలే పడింది, అప్పుడు ఆ కప్ప అనుకుంది కష్టంలో ఆదుకునే నీవల్లే నాకు కష్టం కలిగితే, ఇక నాకు దిక్కెవరు రామా! అని విలపించిందట. అలా ఉంది ప్రజల పరిస్థితి కష్టమొస్తే ప్రజలను కాపాడటానికే కదా ప్రభుత్వాలు ఉండేది, కానీ ఆ ప్రభుత్వమే ప్రజలను కష్టాల పాలు చేస్తే ఇక కాపాడే వారెవరు?. ఎన్నికలలో నాయకులు ఈ కాలనీకి వచ్చినప్పుడు కానీ, ఓట్లు అడిగినప్పుడు కానీ ఈ ఆక్రమణలు వారికి గుర్తుకు రాలేదా!? ఎన్నో అలవికాని తియ్యని వాగ్దానాలు చేసి గద్దెలనెక్కే పెద్దలు, ఇవిగో మా ప్రభుత్వం గెలిస్తే ఇలా చెరువులను రక్షించడానికి ఇండ్లను కూల గొడతామని కూడా చెప్పలి కాదా! పేదలపై ఇంత కఠినంగా వ్యవహిరించే ముందు, వారి జీవితాలను నాశనం చేసే ముందు ఎన్నికలలో వారి మ్యానిఫెస్టోలో ఇంత ముఖ్యమైన విషయం చెప్పాల్సిన బాధ్యత పార్టీలకు లేదా! ఇండ్లును కడతామని చెప్పిన పార్టీలే ఇండ్లును కూలగొట్టడం ఎంతవరకు న్యాయం?.

ఒక సామాన్యుడు కనీసం చిన్న ఇల్లు కట్టుకోలేని ఈ మహానగరంలో, కొంతమందికే ఇన్నిన్ని ఎకరాలు ఎలా వచ్చాయి? వాళ్ళ తండ్రులు తాతలు రాజులు మహారాజులు కాదు కదా? ముందు వాళ్ళ అక్రమ కట్టడాలను కూల్చండి మీరనుకున్నట్లు వందల ఎకరాల చెరువులు విముక్తి చెందుతాయి. ప్రజలు కూడా సంతోషిస్తారు ఇలా ప్రశ్నల వర్షం జడివానలా పిడుగులు కురిపించింది. కానీ సామాన్యుల వేదన వినేవాళ్ళేవారు? వారికి సమాధానం చెప్పేవారెవరు?
మరియ నీరసం, వాన తడుపు, పోలీసుల దెబ్బలు ముఖ్యంగా కళ్ళముందు కూలిపోతున్న ఇంటిని చూసి గుండె పగిలి ప్రాణాలు విడిచింది. అనాధగ మిగిలిన క్లారా దుఃఖాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. గూడు గుండె చెదిరిన కాలనీ వాసులంతా మరియా మతదేహాన్ని కూలిన ఇండ్ల ముందు పెట్టుకొని గుండెలు పిండిలా రోధిస్తున్నారు. కనీసం మత దేహం కూడా తడవకుండా ఉండే రవ్వంత చోటు మిగలలేదక్కడ. కానీ ఎవరో వస్తారనే ఆశతో అంతా అక్కడే కూర్చున్నారు.
గూడు చెదిరి గుండెపగిలి చనిపోయిన మరియా మతికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది సహజ మరణమా? హత్యా? శిధిలమైన వారి దేహాలను వాటి శకలాలను మళ్ళీ పేర్చేదెవరు? ఆ నిర్భాగ్యులకు న్యాయం చేసేదెవరు?
బుల్డోజర్లు ఫంక్షన్‌ హాల్‌ ను కొద్దిగా కూల్చగానే హైకోర్టు స్టే ఇచ్చింది, ఫాం హౌస్‌, కాలేజీలు సేఫ్‌ వాహనాలన్నీ వెనుకకు తిరిగాయి. కానీ ఈ పేదల జీవితాలను మళ్ళీ వెనక్కు ఎవరు తీసుకొస్తారు. వీరికి న్యాయం జరిగేదెట్లా? కూలి పోని ధనవంతుల భవనాలు నిటారుగా నిలబడి, పేద వాళ్లను చూసి విరగబడి నవ్వుతున్నాయి. అంతిమ విజయం ధనవంతులదే అన్నట్లు.

– ఎస్‌.రంగనాథ్‌, 9866265630

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -