Sunday, December 28, 2025
E-PAPER
Homeసోపతిమహారాష్ట్ర ప్రజా గ్రంథాలయాల సంక్షోభం : గ్రామీణ విద్యపై తీవ్రమైన ప్రభావం

మహారాష్ట్ర ప్రజా గ్రంథాలయాల సంక్షోభం : గ్రామీణ విద్యపై తీవ్రమైన ప్రభావం

- Advertisement -

విద్య, సమాజ అభివద్ధికి ఆధారం అయిన ప్రజా గ్రంథాలయాలు ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక వనరులు లభించకపోవడం వల్ల పాఠక సంస్కతి క్రమంగా చెరిగిపోతూ, విద్యాసంస్కరణల దిశ తారుమారవుతోంది. సమాచారం హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా కార్యకర్త అభరు కొలార్కర్‌ సేకరించిన అధికారిక సమాచారం ఈ సంక్షోభం లోతును స్పష్టంగా వెలికి తెచ్చింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 44,738 గ్రామాలలో కనీసం 33,588 గ్రామాలకు ఒక్క ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రజా గ్రంథాలయం కూడా లేదు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు, ఇవి గ్రామీణ మహారాష్ట్రలో అక్షరాస్యత, విద్యా అవకాశాల పరిమితిని ప్రతిబింబిస్తున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ”గవ్‌ తిథే గ్రంథాలయం” (ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం) అనే మంచి సంకల్పంతో కూడిన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో జ్ఞాన వనరులను పెంపొందించడం, పుస్తక సంస్కతిని స్థిరపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రభుత్వ పథకాల అమలులో వ్యవస్థాత్మక లోపాలు, ధనకేటాయింపులో అసమానతలు, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ప్రయత్నాలు కొత్త ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కొలార్కర్‌ అభిప్రాయం ప్రకారం, ప్రజా గ్రంథాలయాలు పుస్తకాలను మాత్రమే కాక, వార్తాపత్రికలు, డిజిటల్‌ వనరులను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి విద్యార్థులకు విశాల దష్టిని ఇవ్వడమే కాక, గ్రామ సమాజానికి స్థితి,గతిని మార్చగల శక్తిగా కూడా నిలుస్తాయి.
తగ్గుతున్న గ్రంథాలయాల సంఖ్య: గత మూడు సంవత్సరాల గణాంకాలు చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 12,149 ప్రజా గ్రంథాలయాలు ఉన్నప్పటికీ, 2024 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 11,150కి పడిపోయింది. అంటే 993 గ్రంథాలయాలు మూతపడ్డాయి లేదా గుర్తింపును కోల్పోయాయి. రాష్ట్రంలోని 27,951 గ్రామపంచాయతీలలో కేవలం 127 పంచాయతీల్లో మాత్రమే స్వంత గ్రంథాలయ సౌకర్యం ఉంది. మిగిలిన 27,824 పంచాయతీలలో పుస్తకాల ప్రాథమిక వనరులే లేవు. ఈ పరిస్థితి గ్రామీణ విద్యారంగంలో ఏర్పడిన గ్యాప్‌ను మరింత విస్తరంగా చేస్తోంది.
గ్రంథాలయాల ప్రమాణాలు, వర్గీకరణ: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న 11,150 గ్రంథాలయాలను నాణ్యత ఆధారంగా ఎ, బి, సి, డి అని నాలుగు వర్గాలకు విభజించారు. ఇందులో క్లాస్‌ ‘ఎ’లో కేవలం 329 గ్రంథాలయాలే ఉన్నాయి. అంటే తగిన భవనం, పఠన గది, సరైన పుస్తకాల సేకరణ, ఇంటర్నెట్‌ యాక్సెస్‌, చందాలు ఉన్నావి. క్లాస్‌ ‘బి’ లో 2,072, క్లాస్‌ ‘సి’ లో 3,972, క్లాస్‌ ‘డి’లో 4,777 గ్రంథాలయాలు ఉన్నాయి. క్లాస్‌ ‘డి’ వర్గం మౌలిక సదుపాయాల లోపంతో బాధపడుతున్నది. పలు గ్రామాలలో ఉన్న గ్రంథాలయాలు కొద్దిపాటి పుస్తకాలతో మాత్రమే నడుస్తున్నాయి, సిబ్బందీ లేకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.



భౌగోళిక అసమానతలు: మహారాష్ట్రలోని ప్రతి ప్రాంతంలో గ్రంథాలయాల పంపిణీ సమానంగా లేదు. మరాఠ్వాడా ప్రాంతంలో అత్యధికంగా 3,813 గ్రంథాలయాలు ఉన్నప్పటికీ, పుణే విభాగంలో 2,675 మాత్రమే ఉన్నాయి. నాగ్‌పూర్‌ డివిజన్‌లో కేవలం 958 గ్రంథాలయాలు, రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కేవలం 517 మాత్రమే ఉండటం విస్మయకర విషయం. ఈ వ్యత్యాసం కారణంగా విద్యా అవకాశాలు అసమానంగా మారాయి. గ్రామీణ పిల్లలు, యువత నగర విద్యార్థులతో పోటీ పడే సామర్ధ్యాన్ని కోల్పోతున్నారు.
ఆర్థిక, పరిపాలనా లోపాలు: గ్రంథాలయాల అభివద్ధికి అవసరమైన నిధుల కేటాయింపుల్లో అసమతుల్యతలు కూడా ప్రధాన కారణంగా ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, తాలూకా గ్రంథాలయాలు, గ్రామపంచాయతీ స్థాయిలో నిధుల ప్రవాహం సమానంగా లేకపోవడం, పథకాలు కాగితాల మీదే మిగిలిపోవడానికి దారి తీస్తోంది. పేలవమైన మౌలిక సదుపాయాలు, పాతబడి పుస్తకాల సేకరణలు, శిక్షణ పొందని సిబ్బంది, తగినంత డిజిటల్‌ వనరుల కొరతతో చాలా గ్రంథాలయాలు ఆధునిక అవసరాలకు సరిపోకపోతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఈ పరిస్థితి మరింత దిగజారింది. విద్యా మౌలిక వసతుల కంటే తక్షణ ఉపశమన చర్యలకు నిధులు మళ్లించడంతో దాని దుష్పరిణామాలు స్పష్టమవుతున్నాయి.

పౌర సమాజం, గ్రంథాలయ ఉద్యమం: ఈ సంక్షోభ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు ముందుకొచ్చి ప్రజా నిధులతో చిన్న స్థాయి గ్రంథాలయాల ప్రాజెక్టులు ప్రారంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,148 ప్రజలచే నడపబడే స్వచ్ఛంద గ్రంథాలయాలు ఉన్నాయి. ఇవి చాలా చోట్ల గ్రామస్థుల సహకారంతో మాత్రమే సాగుతున్నాయి. ఈ పథకాలు గొప్ప స్ఫూర్తి ఉన్నప్పటికీ, పరిమిత వనరులు, ప్రభుత్వ సహకారం లేకపోవడం వీటి ప్రభావాన్ని తగ్గిస్తోంది.
విమర్శలు, ప్రజా వాదనలు: కార్యకర్త అభరు కొలార్కర్‌, రచయిత శ్రీపాద భాలచంద్ర జోషి రాష్ట్ర ప్రభుత్వంపై కఠినమైన విమర్శలు చేశారు. వారు పేర్కొన్నట్లుగా, ప్రభుత్వం సాహిత్య సదస్సులు, సాంస్కతిక కార్యక్రమాలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే గ్రంథాలయాల అభివద్ధిని నిర్లక్ష్యం చేస్తోంది. కొలార్కర్‌ వ్యాఖ్యానంలో, ”గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వలు కావు. అవి విమర్శనాత్మక ఆలోచన, సజనాత్మక అభివ్యక్తి పెంపొందించే వేదికలు” అన్నారు. జోషి సూచన ప్రకారం, ప్రభుత్వ ఖర్చులను కొత్త పుస్తకాల కొనుగోలుకు, సిబ్బంది జీతాల చెల్లింపులకు, పాతపుస్తక సేకరణలను ఆధునికీకరించడానికి మళ్లించాలి. అదనంగా, పుస్తకాలపై 18% చెల్లించాల్సిన జిఎస్టీను తొలగించడం పుస్తక ప్రచారానికి మేలు చేస్తుంది.

విద్యాపరమైన ప్రభావం: గ్రంథాలయాల కొరత వల్ల సుదూర గ్రామాల విద్యార్థులకు పాఠ్యాంశాలకు మించి పుస్తకాల ప్రాప్తి తగ్గిపోతోంది. ఈ అసమానత వల్ల గ్రామీణ విద్యార్థులలో పఠన అలవాటు, విశ్లేషణాత్మక ఆలోచన శక్తి, డిజిటల్‌ అవగాహన పెరగడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇది సమాజంలో జ్ఞాన అంతరాన్ని పెంచుతోంది. ప్రభుత్వ పాలసీ జోక్యం లేకపోతే, భవిష్యత్తులో విద్యావేదికలు పూర్తిగా నశించే ప్రమాదం ఉంది.
మార్గదర్శక పరిష్కారాలు: ఈ సంక్షోభానికి పరిష్కారం కేవలం ప్రభుత్వ నిధుల పెంపే కాదు, స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యం కూడా అవసరం. ప్రతి గ్రామ పంచాయతీ తన స్థాయిలో స్థిర నిధి ఏర్పాటు చేసి, స్థిరమైన పఠన కేంద్రాలను నెలకొల్పాలి. డిజిటల్‌ లైబ్రరీల రూపంలో సులభమైన యాక్సెస్‌ ఇవ్వడం ద్వారా యువతను ఆకర్షించవచ్చు. ప్రభుత్వం ”ఒక గ్రామం – ఒక డిజిటల్‌ లైబ్రరీ” వంటి మోడల్‌ను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముగింపు: మహారాష్ట్ర ప్రజా గ్రంథాలయాల సంక్షోభం కేవలం పుస్తకాల కొరత కాదు, ఇది గ్రామీణ భవిష్యత్తుపై పడిన నీడ. పుస్తక సంస్కతి లేని సమాజం లోతైన అంధకారంలోకి జారిపోతుంది. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి ప్రభుత్వం, పౌరసమాజం, విద్యావేత్తలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాలి. ప్రతి గ్రామం పుస్తకాలతో నిండిన జ్ఞాన సాగరంగా మారినప్పుడు మాత్రమే మహారాష్ట్ర అభివద్ధి సమతుల్యంగా సాకారం అవుతుంది.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -