Sunday, December 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివంద ఏ మాత్రం?!

వంద ఏ మాత్రం?!

- Advertisement -

చిన్నప్పుడు మా ట్యూషన్‌ సారు రోజూ జోకులు చెబుతూ ఉండేవాడు మధ్య మధ్యలో. అందులో ఒకటి. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న రోజులు. నిజంగా పోరాటం చేసినోళ్లెవరో, దొంగ దేశ భక్తులు ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. అలాంటి దొంగ దేశభక్తుడికి సంబంధించినదే ఇది. పోలీసులు పహారా కాస్తున్నారు. వందేమాతరం, వందేమాతరం అంటూ నినాదాలిచ్చుకుంటూ జనాలు సాగుతున్నారు. వాళ్లందరినీ అరెస్టు చేశారు. ఒక్కొక్కరినీ విచారిస్తున్నారు. ఓ తెలివైన వ్యాపారి కూడా ఉన్నాడందులో. ఎందుకు వందేమాతరం అన్నావని అడిగాడు పోలీసాఫీసరు. అబ్బే అలాంటిదేమీ లేదండి, ఎవో పళ్లు వచ్చింటే వంద ఏమాత్రం అనడిగానంతే. అది విని మీవాళ్లు నేనేదో వందేమాతరం అన్నాననుకున్నారంతే. నేను వంద ఏమాత్రం అనే అన్నాను అని చెప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని బయటపడ్డాడు.

వందేమాతరం గేయంపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్న వారికి తామే దేశభక్తులమనుకుంటే అనుకొండి కాని ఇతరుల దేశభక్తిని వివాదం చేయవద్దని మనవి. ఇప్పుడు ట్వెంటీ ట్వెంటీ మ్యాచుల మాదిరి వందరోజులు, వంద మార్కులు అన్న ఉద్యమం నడుస్తోంది. ఇంకొన్ని చోట్ల అలాంటి పేరు ప్రకటించకుండానే వందశాతం వెనక దౌడు తీస్తున్నారు. ఏ రాష్ట్రమేగినా ఎందుకాలిడినా అన్నిచోట్లా ఇదే తంతు. ఎందుకంటే ఇదంతా సమాచార యుగం కాబట్టి. అన్నీ పేపరు మీద, మీడియాలో రావాలి. అప్పుడే అన్నీ చేసేసినట్టు లెక్క. ఎవరైనా మీటింగుకుపోయి మాట్లాడినా, లేదా పెద్దోళ్లను కలిసినా ఆ ఫొటో ముఖపుస్తకంలోనో, ఇంకో మాధ్యమంలోనో పోస్టు పెట్టకపోతే మాట్లాడనట్టే, కలవనట్టే లెక్క. ఇది ప్రభుత్వాలకు, పార్టీలకూ వర్తిస్తుంది అధ్యక్షా!! కాబట్టి ఉదయం లేచినప్పటినుండీ పరుగో పరుగు. మీడియాలో ఉరుకులు.

ఫలితాలు నూటికి నూరు అన్నారు గాని ప్రతి సబ్జెక్టులో వందకు వంద అనలేదు కాబట్టి బతికిపోయాం. ఒక లెక్కల పేపరులో తప్ప మొత్తంగా నూటికి నూరు రావడం ఇంతకుముందు కష్టంగా ఉండేది. మార్కులు ఎలా ఇవ్వాలో దానికి సంబంధించి నిబంధనలు ఎలా మారాయో ఒక పెద్దాయన, తెలుగు ఉపాధ్యాయుడు చెప్పిన మాటల్లో చూద్దాం. కీచకుడిని చంపింది ఎవరన్నది మూడు మార్కుల ప్రశ్న. ఒకమ్మాయి భీముడు అని రాసింది. మూడు మార్కులొచ్చాయి. ఇంకో పోరడు రాముడు అని సమాధానం రాశాడు. సారు రెండు మార్కులిచ్చాడు. ఎందుకంటే మొదటి అక్షరం మాత్రమే తప్పు, తరువాతి రెండక్షరాలు కరెక్టుగా ఉన్నాయి కదా అని అన్నాడట. అలాగే జాతిపిత ఎవరు అన్న ప్రశ్నకి గాంధి అని రాస్తే రెండు మార్కులు, గాడ్సే అని రాస్తే ఒక మార్కు ఇచ్చే రోజులకు అతి దగ్గరగా ఉన్నామని గమనించాలి.

ఇక ఎల్బీ శ్రీరామ్‌ ఒక సినిమాలో ప్రిన్సిపాలుగా అధ్యాపకుడికి చెబుతాడు విద్యార్థి రాసిన సమాధానం కరెక్టు నీ ప్రశ్ననే తప్పు అని. నిజంగానే అంతగా మారిపోయాయి రోజులు. మార్కులు ఎలా తగ్గించాలో రాసే కాలం నుండి ఎలారాసినా మార్కులు వేసే కాలానికి వచ్చాము. పిల్లల తెలివి, మానసిక వికాసం అనే మాటలు ఎక్కడా వినిపించవు, వినిపించినా చేతల్లో కనిపించవు. ఎంతసేపూ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఫలితాల పందేరాలు. ఇవే నేడు మనల్ని నడిపిస్తున్నవి. భయం కలిగించడంలో ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలు వందకు వంద మార్కులు కొట్టేస్తాయి కాని పిల్లల మనోవికాసం మాత్రం హళ్లికి హళ్లి అంటే సున్నకు సున్నా మార్కులు తెచ్చుకుంటాయి.

అసలు విద్య సాధించవలసినదేమిటి ఈ భయం ఎక్కడికి తీసుకుపోతుంది అన్నది ప్రధానం. పిల్లలను పావులుగా, వస్తువులుగా వాడుకోవడం బాధ తెప్పిస్తుంది. ఇక ప్రయివేటు విద్యా సంస్థల విషయంలో వాళ్లు బట్టలు, నగలు, ఇతర వస్తువులు అమ్ముకునే వ్యాపారస్తులలాగే ఒకటి, ఒకటి, ఒకటి, రెండు, రెండు, రెండు అని అరిచే ప్రకటనల్లో తమ విద్యాసంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులు ఈ విద్యార్థులు. ఉపాధ్యాయుల పని చదువు చెప్పడం. అలాకాదని వాళ్లతో తమ ప్రచార కార్యక్రమాలకు, రాజకీయాలకు ఉపయోగపడే పనులకు వాడుకుంటే మధ్యలో దెబ్బతినేది పిల్లలే. మళ్లీ నూటికి నూరని వత్తిడి చేయడం మానుకుంటే మంచిది. ఆర్ధికశాస్త్రంలో చెప్పే క్షీణోపాంత సూత్రంలాగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతియేడూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దానిపై దృష్టి పెట్టాలి. అప్పుడు సమాజం మీకు నూటికి నూరు మార్కులేస్తుంది. వందకు వంద ఫలితాలంటే అవేమరి.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -