దేశం మరో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 31 రాత్రి నగరాల వీధులు పండుగ కాంతులతో మెరవబోతున్నాయి. వీధులు, చౌరస్తాలు కేరింతలతో మార్మోగబోతున్నాయి. యువత డీజే బీట్‌లతో ఉత్సాహాన్ని పంచుకోనుంది. అర్ధరాత్రి 12 గంటల కౌంట్‌డౌన్… కేవలం సంవత్సరం మార్పు మాత్రమే కాదు, ప్రజలలో కొత్త జీవనోపాధి, కొత్త అవకాశాలపై ఆశలను రగిలించనుంది. తెల్లవారుజామున ఇళ్ల ముందర మెరవబోయే రంగుల ముగ్గుల్లో కనిపించే ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ అక్షరాలు, ప్రజల మనసుల్లో కొత్త సంకల్పాలకు రంగులు అద్దనున్నాయి.
క్యాలెండర్ ఒక్కరోజు ముందుకు జారిపోవడం వల్ల సమాజం మారదు. నిజమైన మార్పు మన ఆలోచనల్లో, విలువల్లో, తీసుకునే నిర్ణయాల్లోనే మొదలవ్వాలి. గత సంవత్సరంలో ఎదురైన కష్టాలు, నేర్చుకున్న పాఠాలు, సాధించిన విజయాలు… అన్నీ 2026లో వ్యక్తిగతం నుంచి సామాజికం వరకు ప్రతి రంగానికి మార్గదర్శకాలుగా నిలవాలి.
కొత్త సంవత్సరం సందర్భం మరో కీలక వాస్తవాన్ని గుర్తుచేస్తోంది. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థాయి అనే గీతలు మనమే గీసుకున్నవి. కానీ ఆనందం, శుభాకాంక్షలు, మానవత్వం మాత్రం ఆ గీతలను దాటి ప్రవహిస్తాయి. డిసెంబర్ 31 రాత్రి ఈ గీతలు కొంతసేపు మసకబారుతాయి. హోటళ్లలో వేడుకలు జరుపుకునే యువకుడైనా, వీధి మూలన చిన్న కేక్ కట్ చేసే కూలీ కుటుంబమైనా… ”హ్యాపీ న్యూ ఇయర్” అనే పలకరింపు ఒకే భావాన్ని ప్రతిబింబిస్తుంది. విభిన్నతల్లో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.
2026 ఉదయం మరొక ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. అదే ఆర్థిక అసమానతలు ఎప్పటికి తగ్గుతాయి? ధరల పెరుగుదల, నిరుద్యోగం, మధ్యతరగతి భారం, రైతు సంక్షోభం, చిన్న వ్యాపారాల కష్టాలు… ఇవన్నీ కొత్త సంవత్సరంలో ప్రభుత్వం, పాలకులు ఎదుర్కోవాల్సిన అసలైన సవాళ్లు. ప్రజలు కేవలం హామీలు కాదు, స్పష్టమైన ఉపశమనాన్ని ఆశిస్తున్నారు.
2026పై సమాజం పెట్టుకున్న మూడు ప్రధాన ఆశలు…
1 . మానవ సంబంధాల పునరుజ్జీవనం :
డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ మానవ సంబంధాలు సంకుచితమవుతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఆపద వచ్చినప్పుడు అందరూ అండగా నిలిచేవారు. నేడు అదే సమాజం అపార్ట్మెంట్‌లో పక్కింటి వాళ్ల పేరూ తెలియని స్థితికి చేరింది. ప్రత్యక్ష సంభాషణ తగ్గి, సంబంధాలు స్క్రీన్‌లకు పరిమితమయ్యాయి. ప్రేమ పేరుతో హింస, ఆస్తుల కోసం హత్యలు, అక్రమ సంబంధాలు, కుటుంబ ఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబ బంధాలు, స్నేహాలు, సామాజిక అనుబంధాలు మళ్లీ బలపడాల్సిన అవసరం అత్యవసరం.
2. మానవ విలువల బలపాటు :
పరస్పర గౌరవం, సహానుభూతి, సమానత్వం… ఇవే సామాజిక స్థిరత్వానికి పునాదులు. డబ్బు శాశ్వతం కాదు, కానీ మనిషి గౌరవం, ఆత్మీయత, నమ్మకం శాశ్వతం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కతి మళ్లీ బలపడాలి.
3 . ఆర్థిక అసమానతల తగ్గుదల :
పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడు, ధనికుడు కోటీశ్వరుడి నుంచి శతకోటీశ్వరుడిగా ఎదుగుతున్నాడు. అభివద్ధి ఫలాలు కొద్దిమందికే చేరుతున్న పరిస్థితి సమాజంలో అసంతప్తిని పెంచుతోంది. అవకాశాలు అందరికీ సమానంగా లభించేలా, ప్రభుత్వ విధానాలు మరింత సమగ్రంగా మారాలని ప్రజలు ఆశిస్తున్నారు.
రైతులు, కార్మికులు – మారని జీవితాలు
క్యాలెండర్‌లో తేదీలు, సంవత్సరాలు మారుతున్నాయి గానీ రైతుల, కార్మికుల జీవితాలు మారడం లేదు. దేశానికి వెన్నెముక అయిన రైతును ఆదుకునే నాథుడు నేటికీ కరువయ్యాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. అకాల వర్షాలు, ప్రకతి విపత్తులు రైతును అతలాకుతలం చేస్తున్నా సరైన భరోసా కనిపించడం లేదు.
కార్మికుల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. శ్రమ దోపిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు… ఇవే వారి రోజువారీ వాస్తవాలు. పనిచేయకపోతే పస్తులు తప్పవు. సామాన్య ప్రజలు ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ అన్న చందంగా జీవితం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు పేదవాడి వైపా? లేక ధనికులు, పెట్టుబడిదారుల వైపా? అనే ప్రశ్న ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తోంది. పాలకుల విధానాలు మారిన రోజే పేదవాడి జీవితం మారుతుంది.
యువతపై దేశ ఆశలు :
యువత ఉత్సవాల్లో మాత్రమే కాదు, ఉద్యమాల్లో, ఆలోచనల్లో, బాధ్యతల్లో ముందుండాలి. ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాభివద్ధి, నైతిక విలువలు… ఈ నాలుగు దిశల్లో యువతను బలపరిస్తేనే దేశ భవిష్యత్ సురక్షితం. ప్రశ్నించే తత్వం, సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావన యువతలో పెరగాలి.
బాణసంచాల వెలుగులు క్షణకాలమే. సంగీతం ఒక రాత్రికే పరిమితం. కానీ సంకల్పాలు, బాధ్యతలు, నిర్ణయాలే 2026ను నిజమైన మార్పు దిశగా నడిపించగలవు.
2026 సంవత్సరం కేవలం మారాలని కాదు, మార్పు తప్పనిసరిగా రావాల్సిన సమయం ఇది.
మనసుల్లో మార్పు, విధానాల్లో సమానత్వం, సమాజంలో ఐక్యతే రాబోయే సంవత్సరానికి మార్గదర్శకాలు కావాలి.
ఈ ఆశయాలతో, ఈ సంకల్పాలతో దేశం మొత్తం 2026ను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది.
ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026.
– గడగోజు రవీంద్ర చారి, 9848772232



