సుమారు 2300 వందల సంవత్సరాల క్రితం ప్రపంచంలో చాల మంది రాజులు తమ రాజ్యకాంక్షను తీర్చుకోవడానికి ప్రపంచ చరిత్రను రక్త సిక్తం చేశారు. ఆ సమయంలోనే భారతదేశంలో ఒక అమూల్యమైన అధ్యాయం మొదలైంది. ఈ కథ ప్రపంచ చరిత్రలో చాలామంది రాజులకు, పాలకులకు కనువిప్పు కల్గించి నూతన శకానికి నాంది పలికింది.
క్రీ.పూ.304 లో మౌర్య సామ్రాజ్యపు రాజధాని పాటలీపుత్రంలో (ప్రస్తుతం ఇది బిహార్ రాజధాని పాట్నగా పిలవబడుతోంది). రాణిమహల్‌లో ఒక పిల్లవాడి జననం ఐనది. ఆ పిల్లవాడు సామ్రాట్ బిందుసారుడు, సుభద్రాంగికి జన్మించాడు. అతడి పేరు సామ్రాట్ అశోకుడు. అతడి తాత పేరు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు ప్రపంచ చరిత్రకు కొత్త భాష్యం చెప్తాడని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ బిందుసారుడు మాత్రం అశోకుడి కన్నా మరొక పుత్రుడైన ‘సుశీమ్’ను అమితంగా ఇష్టపడేవాడు. ఇతడు యువరాజులలో పెద్దవాడు. ఒక రాజుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండటంతో బిందుసారుడు సహజంగా యువరాజు సుశీమ్‌ను అమితంగా ప్రేమించేవాడు. కానీ అశోకుడు మాత్రం అంతర్వర్తనుడిగానే (Introvert) పెరిగాడు. అశోకుడు ప్రజలకు అంతఃపురంలోని వారి అంచనాలకు అందకుండా పెరిగాడు. అతడి తల్లి ఐన సుభద్రాంగి సాధారణ కుటుంబ నేపధ్యం నుండి రావడం వల్ల అశోకుడు సింహాసనం అదిష్టంచడానికి దాదాపు సాధ్యం కాకపోవచ్చని భావించేది. తల్లిగా మాత్రం అశోకుడికి రాజనీతి, కుటిల నీతి, ధర్మనీతి వేద పారాయణం, చారిత్రక కథలు చెప్పి ప్రేరణ కల్గించేది. ఇలా అశోకుడు రహస్యంగానే యుద్ధతంత్రం తప్ప అన్ని అంశాలపై తల్లి ద్వారా పట్టు సంపాదించాడు.
అదే అశోకుడి మొదటి స్వీయ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలకు సంబంధించిన శిక్షణ. క్రమక్రమంగా అశోకుడి గురించి రాజ్యంలో అంతట చర్చ మొదలైంది. తక్షశిలలో అంతర్గత కుటుంబ తగాదాలను పరిష్కరించడం తండ్రి బిందుసారుడికి తలకు మించిన భారం అయింది. అలాగే పొరుగు రాజ్యాల నుండి ఏదైనా హానివుందని భావిస్తే బిందుసారుడు యువరాజు సుశీమ్‌ను వెళ్లి వాటిని పరిష్కరించమని సూచించేవాడు. అయితే సుశీమ్ వెళ్ళేవాడు కాదు. ఈ అవకాశాన్ని అశోకుడు చక్కగా వినియోగించుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అశోకుడి వయస్సు 18 సంవత్సరాలు. పాటలి పుత్రంపై తిరుగుబాటును అణచడానికి వెళ్ళిన అశోకుడు అక్కడి ప్రజలు తన తండ్రి పాలనపట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని ఆ సమయంలోనే గ్రహించాడు. అప్పుడు యుద్ధం చేయడం సమంజసం కాదని భావించి వారితో చర్చలు జరిపి వారందర్ని రాజ్య పరిపాలనలో భాగస్వామ్యులను చేశాడు. అలాగే స్థానిక వ్యాపారులను సరళీకరణ చేసి గొప్ప మార్పుకు నాంది పలికాడు. ఇది అశోకుడు సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చు. ఈ సంఘటనతో అశోకుడి పేరు రాజ్యమంతటా పాకింది. క్రమక్రమంగా ఇది మరో యువరాజైన సుశీమ్‌కు కంటగింపుగా మారి, అసూయ, అభద్రతా భావంతో అశోకుడికి వ్యతిరేకంగా పావులు కదిపాడు.
ఇందులో భాగంగానే అశోకుడిని రాజ్యానికి దూరంగా వుండే ఉజ్జయిని ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. తన పాలనా కాలంలో అశోకుడు గవర్నర్‌గా విధులు మాత్రమే నిర్వర్తించకుండా అక్కడి వ్యాపారస్తుల మనసు దోచుకునే విధంగా సంస్కరణలు చేపట్టి ఓ వ్యాపారస్తుడి కుమార్తె ఐన దేవిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ సమయంలో ఉజ్జయిని మంచి వర్తక, వ్యాపార రాష్ట్రంగా వుండేది. పాటలీ పుత్ర రాజ్యానికి అక్కడి నుండి బంగారం, సుగంధ ద్రవ్యాలు, వస్త్ర వ్యాపారం తూర్పు, దక్షిణ ఆగేసియా ప్రాంతానికి వర్తక వాణిజ్యాలు జరిగేవి. అశోకుడు వ్యాపారాన్ని సురక్షితం చేసి దేశ ఆర్ధిక వ్యవస్థకు పటిష్టమైన బీజాలు వేస్తాడు. ఆ సమయంలోనే తండ్రి బిందుసారుడి ఆరోగ్యం క్షీణించి, మరణించాడు. అదే సందర్భంలో రాజ్యంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సుశీమ్‌కు వంతపాడే మంత్రులు తనను తప్పించడానికి చేసే ప్రయత్నాలను గమనించి, వెంటనే తన మిలటరీ నైపుణ్యంతో రాజ దర్భారుపై పట్టు సాధించాడు అశోకుడు. పాటలీపుత్రానికి వచ్చే అన్ని దారులను మూసివేసి, నమ్మకమైన సైన్యాన్ని సింహద్వారానికి దగ్గరగా మోహరించి, శత్రువులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య సంఘర్ణ నాలుగేళ్లు నడిచిది.
తండ్రి మరణంతో వచ్చిన అవకాశాన్ని అశోకుడు చక్కగా ఉపయోగించుకొని, రాజనీతిని ప్రదర్శించాడు అశోకుడు. తిరుగుబాటుకు సాహసించకూడదని తన తొంబై తొమ్మిది మంది సోదరులను ఒక్కొక్కరిని చేసి, సంహరించి తనని బాగా ఇష్టపడే సోదరుడు తిస్సను మాత్రం చేరదీశాడు.
చరిత్ర ప్రకారం అశోకుడు చివరి సోదరుడిని సంహరించిన తరువాత అతడి శిరస్సు వేరుచేసి పళ్ళెంలో అశోకుడి దగ్గరకు తెస్తారు. అది చూసిన అశోకుడు ఇక మీదట మౌర్య సామ్రాజ్యంలో తనకు వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపరని అంటాడు. ఆ మాటలు విన్న ఓ వద్ధమంత్రి వచ్చి మహా రాజా ఈ రోజు నుండి మీరు పాటలీపుత్ర రాజుగా పిలువబడతారు. కానీ నిర్దయతో తమ వంశాన్ని స్వయంగా నాశనం చేసి సింహాసనం అధిష్టించిన కారణంగా మీరు చండ అశోకుడు అని కీర్తించడబతారు అన్నాడు.
అశోకుడి కళ్ళలో వెలుగుతో బాటు మనస్సు నిండా అహంకార వుండేది. దర్బారులో వుండే మంత్రులు ఆయన క్రూర స్వభావం, అంతమంది సోదరులను చంపి సింహాసనం అధిష్టించడం పట్ల వారికి ఇష్టం వుండేది కాదు. కానీ అశోకుడికి మాత్రం తన అస్తిత్వం కాపాడుకోవటం కోసం, దయా, జాలి చూపించేవాడు కాదు. అశోకుడి పట్టాభిషేకం తర్వాతే పాటలీపుత్రలో రక్త ప్రవాహం ఆగిపోయింది.
అనంతరం తన శక్తి సామర్ధ్యాలను రాజనీతిని, యుద్ధతంత్రాలను ఉపయోగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంగా మార్చాడు. ప్రజలలో ఆయనపై గౌరవం పెరిగింది. హిమాలయాలు మొదలుకొని ప్రయాగ్దీప్ వరకు ఏకచత్రాధిపత్యంగా పాలన సాగించాడు.
కానీ ఒక రాజ్యం అశోకుడికి కంట గింపుగా వుండేది. అదే కళింగ (నేటి ఒరిస్సా/ ఒడిస్సా) రాజ్యం. కళింగ రాజ్యం స్వయం సమద్ధి, స్వేచ్చ వాణిజ్యం వల్ల అమితమైన అభివద్ధి సాధించింది. అశోకుడు ఎన్నోసార్లు కళింగ రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం కావాలని ఆదేశించినా ఒప్పుకోకపోవడం వల్ల ఇది అతడి అస్తిత్వానికి, నాయకత్వానికి, సమర్ధతకు పరీక్షలా భావించి, ఆ దేశంపై యుద్ధం ప్రకటించాడు. తన లక్షల అశ్వదళం, గజదళం, పదాతిదళం మొదలైన సైన్యంతో లక్షల మందిని సంహరించాడు. కానీ కళింగ సైన్యం, ప్రజలు ఓటమిని అంగీకరించక పోవడం వల్ల రక్తం ఏరులై పారింది. ఆ యుద్ధంలో లక్షమంది వికలాంగులుగా మారారు. ఈ విధ్వంసకర యుద్ధ భూమిని అశోకుడు పరిశీలించాడు. శవాల వాసన, కాలుతున్న రథాలు… ఓ తల్లి తన కుమారుడిని ఒడిలో పడుకోబెట్టుకొని రోదించడాన్ని చూసి దగ్గరకు వెళ్లాడు. ఆ తల్లి ”మహారాజా మీరు గెలిచారు. కానీ ఎవరి మీద గెలిచారు? ఎవరిని గెలిచారు? మీరు నా వంశాన్ని పూర్తిగా నాశనం చేశారు” అంది. ఆ మాటలకు అశోకుడి మనస్సు ద్రవించిపోయింది. మరికొద్ది దూరంలో అప్పుడే జన్మించిన శిశువు తల్లి శవంపై పాలకోసం ఏడవడం గమనించాడు. ఇదంతా చూసిన అశోకుడు ఇది గెలుపు కాదు, విధ్వంసమని దిగులుపడ్డాడు. ఇంతటి విధ్వంసానికి కారణమైన యుద్ధం జోలికి ఇక వెళ్లబోనని శపథం చేశాడు.
యుద్ధ దశ్యాలు మనస్సును కలిచివేయడంతో క్రమంలో బౌద్ధ సన్యాసి ‘నిగ్రోదాసే’ (తన సోదరుడైన సుశీమ్ కుమారుడు) ” ‘మహారాజా జీవితం దుఃఖంతో నిండి వుంటుంది. దానికి మన ‘కోరికలు’ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఫలితంగా మనిషి కోపం ప్రదర్శిస్తాడు. వాటిని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. కోరికలపై ఎవరైతే పట్టు సాధిస్తారో వారి జీవితంలో శాంతి ప్రజ్వరిల్లుతుంది, లేనిపక్షంలో అశాంతి, అలజడులకు కారణమవుతుంది” అని అన్నాడు. ఈ మాటలు అశోకుడిలో ఇంకా పరివర్తన కలిగించాయి. అనంతరం ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసిని గురువుగా భావించి తన ఖడ్గాన్ని పక్కనపెట్టి, ఇక మీదట తను సరిహద్దులు విస్తరించడం కాదు. ప్రజల మనసులు గెలవాలని, తన వారసులైన మహేంద్రుడు, (కుమారుడు) సంఘమిత్ర (కుమార్తె) లను బౌద్ధ మత ప్రచారం కోసం శ్రీలంక, జపాన్, నేపాల్ మొదలైన దేశాలకు పంపించాడు. అంతే కాకుండా ‘దమ్మ’ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. రోడ్లవెంట చెట్లను నాటించడం, బావులు తవ్వించటం లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులను గెలుసుకున్నాడు. మానవత్వానికి మించిన ఆయుధం లేదని భౌద్ధ మతం ప్రచారం చేశాడు అశోకుడు.
ఆ కాలంలోనే జంతువులకు ఆస్పత్రులు కట్టించిన ఘనత అశోకుడిదే. మంచి బోధన, విలువలతో కూడిన జీవితం మొదలైన వాటి పట్ల ప్రత్యేక పాఠ్య ప్రణాళికలో చేర్చి గురువుల ద్వారా బోధన గావించాడు. ఈజిప్టు, సిరియా మొదలైన దేశాలలో బౌద్ధమత ప్రచారం చేయించాడు. సామ్రాజ్యంలో శిలాశాసనాలు వేయించి నా ప్రజలు నా పిల్లల లాంటివారని, విశ్వమానవ కళ్యాణం కోసం కషి చేశాడు. ఈ కాలంలోనే బౌద్ధం పునర్జీవనం పొందింది. అతడు పాలించిన 37 సంవత్సరాల కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు చరిత్రకారులు. ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని లిఖించుకొని, నేటి పాలకులకూ ఆదర్శంగా నిలిచాడు అశోకుడు. మన జాతీయ జెండాలోని అశోక చక్రం ఆయన పాలనకు నిదర్శనంగా తీసుకోబడిందే.
– డా||మహ్మద్ హసన్,9908059234



