Sunday, December 28, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్మారని గుణం

మారని గుణం

- Advertisement -

ఒక అడవిలో విశాలమైన చెట్టు కింద ఒక ఎలుక తన కలుగులో నివసిస్తూ ఉండేది. అదే చెట్టుపై ఉన్న గూటిలో ఒక పిల్లి కూడా నివసించేది. సహజంగానే, ఎలుకకు పిల్లి అంటే భయం, పిల్లికి ఎలుక అంటే వేట. పిల్లి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎలుక తెలివిగా తప్పించుకుంటూ, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది. వాటి మధ్య బద్ధ శత్రుత్వం ఉండేది.
ఒక రోజు రాత్రి ఆహారం వేటలో పడిన పిల్లి, వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. తెల్లవారితే వేటగాడు వచ్చి తనను పట్టుకుపోతాడనే భయంతో అది ప్రాణాపాయ స్థితిలో సహాయం కోసం దీనంగా అరిచింది.
ఈ సమయంలో, తన కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుక, పిల్లి వలలో చిక్కుకోవడం చూసి మొదట సంతోషించింది. తన శత్రువు కష్టాల్లో ఉందని తెలిసి, ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో దాని దగ్గరకు నడిచింది. అయితే, పిల్లి దగ్గరకు వెళ్లేలోపే, ఎలుక దూరంగా పొదల చాటున ముంగిసను, చెట్టు కొమ్మపై గుడ్లగూబను చూసింది. అవి రెండూ తనను ఎప్పుడైనా పట్టుకోవడానికి పొంచి ఉన్నాయని గ్రహించిన ఎలుకకు ఒక్కసారిగా ప్రాణభయం పట్టుకుంది. పిల్లి వలలో చిక్కుకుంది కాబట్టే అవి తమను తాము సురక్షితంగా భావించి అక్కడికి వచ్చాయని ఎలుక గ్రహించింది. ఇప్పుడు తనను కాపాడుకోడానికి ఉన్న ఏకైక మార్గం తన శత్రువైన పిల్లికి సాయం చేయడం!

ఎలుక ధైర్యం చేసి పిల్లి దగ్గరకు వెళ్లి, ”పిల్లీ, మనమిద్దరం సహజ శత్రువులం. అయినప్పటికీ, నేను నీకు సాయం చేయగలను. కానీ, నువ్వు ఈ వలలోంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను తిననని, నా జోలికి రానని ప్రమాణం చేస్తేనే ఈ వలను కొరుకుతాను” అని షరతు పెట్టింది. పిల్లి ప్రాణభయంతో వణికిపోతూ, వెంటనే అంగీకరించింది.
”నిస్సందేహంగా! నువ్వు నా ప్రాణాలు కాపాడితే, నిన్ను నా తోబుట్టువులా చూసుకుంటాను. నిన్ను తిననని ప్రమాణం చేస్తున్నాను!” అని బతిమాలింది.
ఎలుక ఆ మాటలు విని, ముంగిస, గుడ్లగూబలు ఇంకా పొంచి ఉండటం గమనించి, వలను కొరుకుతున్నట్లుగా నటించింది. వల కొద్దిగా వదులైంది కానీ, పిల్లి పూర్తిగా బయటకు వచ్చేంత రంధ్రం కాలేదు. ఇది కేవలం ఆ ముంగిస, గుడ్లగూబలను భయపెట్టడానికి, తన రక్షణ కోసం ఎలుక చేసిన ఉపాయం. ఇంతలో వేటగాడు వచ్చే అలికిడి వినిపించింది.

”త్వరగా! వేటగాడు వస్తున్నాడు! త్వరగా వలను కొరుకు!”
అని పిల్లి భయంతో అరిచింది. అప్పుడు ఎలుక చటుక్కున వలను పూర్తిగా కొరికింది. వల తెగిపోగానే పిల్లి ఒక్క ఉదుటున వేటగాడి నుంచి తప్పించుకుని ఒక దిక్కుకు పరుగు తీసింది. ఎలుక కూడా వేగంగా తన బొరియలోకి దూరింది. పిల్లి విముక్తిని చూసిన ముంగిస, గుడ్లగూబలు కూడా భయంతో పారిపోయాయి.
మరుసటి రోజు ఉదయం, పిల్లి ఎలుక ఉండే కలుగు దగ్గరకు వచ్చి, ”ఎలుకా! నీవు నా ప్రాణాలు కాపాడావు. మనమిద్దరం ఇప్పుడు స్నేహితులం. రా, నేను నీకోసం ఒక విందు ఏర్పాటు చేశాను” అని ఆప్యాయంగా ఆహ్వానించింది.

దానికి ఎలుక తన బొరియలోంచే ఇలా సమాధానం ఇచ్చింది..
”పిల్లీ! నువ్వూ నేనూ సహజ శత్రువులం. నిన్నటి ప్రమాదం మనల్ని తాత్కాలికంగా ఒక్కటి చేసింది. అప్పుడు నేను నీకు సాయం చేశాను, నువ్వు నన్ను తినలేదు. కానీ ఇప్పుడు ఆ ఆపద లేదు. ఇప్పుడు నేను నీ ఎదుటికి వస్తే, నువ్వు ఇచ్చిన మాట మర్చిపోకపోయినా, నీ సహజమైన మారని మాంసాహార గుణాన్ని మర్చిపోలేవు. నేను నీ ఎదుటికి రాలేను. ఎందుకంటే, నువ్వు నాకు ఎప్పటికీ శత్రువే అనే సత్యం నాకు గుర్తుంది” అని చెప్పి లోపలికి జారుకుంది. ఆ పిల్లి ఎలుకను తినాలనే తన పాచిక పారిపోయేందుకు నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

– డా.పోతగాని సత్యనారాయణ, 9182531202

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -