ఈ మధ్యన ఒక సీనియర్ నటుడు మహిళల వస్త్రాల గురించి, శరీరాల గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. తన మాటలపై స్త్రీ స్వాతంత్రవాదులు దాడి చేసినా చేయొచ్చనీ ఆయన ముందే సెటైరు వేశారు. ఆ తర్వాత మాత్రం తను వాడిన రెండు పదాలకు మాత్రం క్షమాపణ చెబుతున్నాననీ, అయితే తన ఉద్దేశం మొత్తం భావం సరైనవేననీ ఇంకా సమర్థించుకున్నారు. అంతేగాక తనపై విమర్శ చేసిన నటీమణి పేరు తీసి మరిన్ని సవాళ్లు విసిరారు. ఆయన ప్రస్తావించిన ఉదాహరణలతో ముడిపడివున్న మహిళలు ముఖ్యంగా నటీమణులు గట్టిగానే సమాధానమిస్తున్నారు.
ఇవన్నీ సంచలనం కోసం కూడా చేస్తుంటారనే వాదన కూడా వుంది. అయితే సరిగ్గా ఈ సమయంలోనే మరికొన్ని పరిణామాలు కూడా దుమారం రేపడం గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో పదమూడేండ్ల మైనర్ బాలికపై ఘోర లైంగికదాడికి పాల్పడటమే గాక ప్రశ్నించిన ఆమె కుటుంబంపైనా హత్యాకాండకు దిగిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగాల్‌పై శిక్షను నిలిపేసి బెయిల్‌పై విడుదల చేశారు.రాజస్థాన్‌లో జాట్ కులస్తులలో ఒక శాఖకు చెందిన వివాహిత మహిళలు మొబైల్ ఫోన్ వినియోగించరాదనీ, చదువుకునే అమ్మాయిలు కూడా చదువులు పరీక్షలకు మాత్రమే దాన్ని వాడుకోవాలనీ ఒక కులపంచాయితీ హుకుం జారీ చేసింది.
అసభ్యతల పరంపర
ఇవి గత రెండు మూడు రోజుల సంగతులు మాత్రమే. కాస్త వెనక్కువెళితే కొద్దిరోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఉద్యోగ నియామకం కోసం వచ్చిన యువతి బురఖా లాగారు. ‘ఈ వయసులో మీరు ఇలాంటి బట్టలు వేసుకోవడం సరైందా?’ అని నటిని ప్రశ్నించిన మరో సీనియర్ పాత్రికేయుడు తర్వాత క్షమాపణలు చెప్పారు. ఓ ప్రముఖ బహుభాషా నాయికకూ, రాజకీయ నేతకూ సంబంధించి అసభ్య ఆరోపణ చేసిన ఒక రాష్ట్రమంత్రిని బాగా ఆలస్యంగా క్షమాపణ చెప్పి బయటపడ్డారు. ఇంకా కొంచెం వెనక్కు వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ‘అమ్మాయి పుట్టాలని ఎవరూ కోరుకోరని’ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల కారణంగా కుటుంబాల్లో మహిళలు అదృశ్యం అవుతున్నారని అప్పట్లో ఆరోపించారు. సినిమా హీరోలు, నటులు వేడుకల్లో ఉపయోగించిన అవాకులు, చవాకులు సరేసరి.అమరావతి వేశ్యల రాజధానిగా మారిందని, అలాంటి లెక్కలనే ఉటంకిస్తూ ఒక పాత్రికేయుడు కల్లోల కారకులయ్యారు. మంచి మనిషిగా ప్రచారంలో వున్న ఒక మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు బికినీలు వేసుకోవద్దని ప్రకటించారు.
శాసన సభల్లోనే పెద్ద నేతల భార్యల గురించి వెకిలిగా మాట్లాడిన మంత్రులున్నారు. ఇప్పటికీ భార్యలను, కుటుంబ సభ్యులనూ అనవసరంగా చర్చలోకి తెచ్చే ధోరణులు సాగుతూనే వున్నాయి. అసలు కుటుంబాలలో మహిళలే వ్యతిరేకిస్తే ఒక్కసారిగా ఇష్టానుసారం వ్యక్తిగత నిందలు గుమ్మరిస్తున్నారు. కీలక పదవుల్లో వున్న మహిళలనూ, అగ్రతారలనూ కూడా అవమాన కరంగా మాట్లాడిన ఉదంతాలున్నాయి. ఈ వ్యాఖ్యలూ, చేసిన వారి నేపథ్యాలూ, ముగింపులూ అన్నీ ఒకే తరహాకు చెందినవి కావనేది నిజమే. ఇలాంటివి వివాదాలు జరిగినప్పుడల్లా వ్యక్తులు, సంస్థలు, వారివారి రాజకీయాలనూ, అభిమానదురభి మానాలను బట్టి స్సందించడం వ్యాఖ్యానించడం జరిగిపోతుంటుంది. కానీ, వీటి వెనక వున్న ఘోరమైన కుసంస్కారం,మహిళా వివక్ష మరుగుపడి పోతుంటాయి. స్త్రీల శరీరాలతో సహా వారి జీవితాలపైన, నైతికతపైన, అసలు వారి పుట్టుకల పైన వారి పిల్లల పుట్టుకలపైనా ఇష్టానుసారం మాట్లాడ్డం, బాధితులైన వారినే నిందితులుగా, కారకులుగా చూపించడం వీటిలో ఉమ్మడి లక్షణం.
ప్రభుత్వాధినేతల మౌనం
తాజాగా ఈ నటుడు కూడా తను మాట్లాడిన దాంట్లో కేవలం రెండు పదాలు మాత్రమే పొరబాటనీ, మొత్తం భావం మంచిదేననీ ఆయన ఇంకా వాదిస్తున్నారు. నిధి అగర్వాల్ అనే నటి ఒక సినిమా వేడుకకు వెళ్లిన సమయంలో ఒక మూక ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టిన కారణంగానే అలా హితబోధ చేశానంటున్నారు. (నిధి అగర్వాల్ ఇటీవలనే పవన్‌కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో నాయికగా నటించారు. ఆమె సినిమాను బాగా ప్రమోట్ చేశారని, ఆమెను చూసి సిగ్గుపడి తనూ ప్రమోషన్‌కు వచ్చానని ఆయన అప్పట్లో చెప్పుకున్నారు.ఇప్పుడు ఆమె పాల్గొన్న వేడుక కూడా గ్లోబల్‌స్థాయి కలెక్షన్లు తెచ్చుకున్న ఒక హీరోకు సంబంధించింది) అయితే, ‘బాధితులనే నిందితులను చేయడం’ అన్న వాక్యంతో ఆమె ఆయనపౖౖె స్పందించారు. వస్త్రాల్లేవనే దాంతో నిమిత్తం లేకుండానే అబ్బాయిలతో సహా చిన్నపిల్లలపై లైంగికదాడులు, జంతువులపై హింస ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు.
ఇక సవాళ్లకు గురైన నటి అనసూయ భరద్వాజ్‌తో సహా పరిశ్రమలో క్రియాశీలంగా వున్న అనేకమంది దీటైన సమాధానాలిచ్చారు. పైగా ఆయన అరకొర క్షమాపణను అర్జంటుగా ఆమోదించవలసిన అవసరమేమిటని నటీనటుల సంఘమైన ‘మా’ను ప్రశ్నించారు. గతంలో నిధిని మెచ్చుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్న కూడా వచ్చింది. మహిళా సంఘాలు శివాజీ మాటలను ఖండించడం తప్ప పాలకకూటమి నుంచి ఎవరూ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?అలాగే ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు తమవారి అసభ్య వ్యాఖ్యల తరుణంలో ఎందుకు మాట్లాడలేదు? మహిళలపై కరుడుగట్టిన ద్వంద్వనీతి, మగవాదం, మనువాదం తప్ప ఇందుకు మరో కారణం లేదు.ఇలాంటి విషయాలపై చర్చ అనవసరమనే వాదన కూడా చాలా తప్పు. అనేక ఖండనలు నిరసనల తర్వాతనే పరిస్థితి ఇలా వుంది. ఇవీ లేకపోతే మనువాదులు మరెంత దారుణంగా వ్యవహరించేవారో ఊహించడం అసాధ్యం.
దొందూదొందే
మనువాదం, మార్కెట్ వాదం, మగవాదం మహిళలను ఓకేలా చూస్తాయి. కానీ ఒకదాన్ని ఒకదానికి పోటీ నిలిపి మాట్లాడుతూ గందరగోళ పరుస్తుంటాయి, మరీ ఇలా మరీ అలా అనే మాటలు ప్రయోగిస్తుంటాయి. ఉదాహరణకు వస్త్రధారణనే తీసుకుంటే నీతులన్నీ మహిళలకే ఎందుకు చెప్పడం? దేశ ప్రధానమంత్రి నగసాధువుకు సాష్టాంగ పడినప్పుడు,మహిళలను కూడా సమాజం మోకరిల్ల జేసినపుడు వీరికి సభ్యత గుర్తుకురాదే? కుంభ మేళాలో నగసాధువులు ప్రదర్శనలే చేసినప్పుడు నోరెత్తరే? ఇవన్నీ మాట్లాడేవారే సినిమాలు తీసినప్పుడు వారిని ఎలా చూపిస్తుంటారు? కనుక రెండుచోట్ల బలవుతున్నది మహిళలే. సామాజిక సమస్యగా చూడవలసిన ఈ అంశాన్ని కేవలం రాజకీయ కళ్లద్దాలతో చూడటం కూడా తప్పే. ఈ మధ్య కేరళలో ఎమ్మెల్యే ఒకరు తప్పుగా మాట్లాడితే ఆ ప్రభుత్వం వెంటనే కేసు పెట్టింది తప్ప వదిలేయలేదని గమనించాలి.
మహిళల విషయంలో తప్పుడు మాటలు నాలుగు రకాలుగా వస్తుంటాయి. మొదటిది- వారి వస్త్రాల వల్లనే లేక వారు బయటకు రావడం వల్లనే తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం. ప్రొవోక్ చేసే అంటే రెచ్చగొట్టే బట్టలు వేసుకోవద్దనే మాట ఇందులో సర్వసాధారణం, ఒకరి వస్త్రధారణ బట్టి మరొకరు రెచ్చిపోవడం ఏమిటనే ప్రశ్నకు వీరు జవాబివ్వరు. ఆ మాటకొస్తే నిక్కర్లు వేసుకుని లేదా అంతకంటే తక్కువ పీలికతో యాడ్స్ కొందరు హీరోల మాటేంటి? రెండవది-స్త్రీలకు ఎవరైనా నీతులు చెప్పే హక్కు వుందని భావించడం. వారిపై ఇష్టానుసారం మాట్లాడితే సరదాగా తీసుకోవాలని సలహాలివ్వడం, వయసు మళ్లిన హీరోలు కూడా చిన్న చిన్న అమ్మాయిలతో అసభ్యమైన పదాలతో స్టెప్పులతో నటిస్తే కేకలేయడం. నిజానికి సంఘ సంస్కరణోద్యమాలే లేకపోతే మేజువాణిలు సాగుతూనే వుండేవి. ఇప్పటికీ రికార్డింగు డాన్సులు, ఐటం సాంగులు అగింది లేదు. దర్టీ పిక్చర్స్ అంటూ వాటినీ సొమ్ము చేసుకుంటున్నారు. మూడు-మహిళలను వస్తువులుగా పరిగణించి నోరు పారేసుకోవడం. సామానులు సరుకులు అనే పాటలూ మాటలూ అలా వచ్చేవే. ఇక ఆచారం కోసం ఏం చేసినా నోరెత్తకూడదని శాసించడం.
స్త్రీని మార్కెట్ వస్తువుగా చూపడమంటే ఇదే, కొంతకాలం కిందట ఒక యాడ్‌లో ఇల్లు కారుతో స్త్రీని పోలుస్తూ మాట్లాడటం పెద్ద దుమారమైంది.నాల్గవది- సనాతన ఆచారం ప్రకారం ఫలానా విధంగా ఉండాలంటూ చరిత్రకు తోచిన నిర్వచనాలు చెప్పడం, మరి అలాగైతే లోదుస్తులే ఆచారానికి విరుద్ధం కదా? కొన్ని ప్రాంతాల్లో అసలుపై దుస్తులు ఉండవు కదా? పేదలు ఆదివాసులు వేసుకోవడానికి కూడా శక్తిలేని పరిస్థితి ఇప్పటికీ పూర్తిగా పోలేదు కదా అంటే జవాబుండదు. లైంగికదాడుల పెరుగుదలను, ప్రేమోన్మా దులనే కొత్త తరహా హత్యలనూ గురించి మాట్లాడరు. ఇంత మీడియా ఉన్నా ఈ పరిస్థితి ఉందంటే ఒకప్పటి భూస్వామ్య వ్యవస్థలో మరెంత రాక్షసంగా వుండివుండాలి? ఎన్ని పోరాటాలు చేస్తే ఈ మాత్రం హక్కులైనా వచ్చాయి? ఇప్పుడు పునరుద్ధరణ వాదం, మత ఛాందసం వాటిని కూడా హరించి వేస్తున్న ఫలితమే కదా ఈ అవాకుల అమానుషాలు? మహిళా స్వాతంత్య్రం అంటూ వచ్చేస్తారని ఎగతాళి చేసేప్పుడు ఇవన్నీ గుర్తుకు రావద్దా? మత మార్కెట్‌తత్వాల గుప్పిట్లో మహిళ పుస్తకం చదివితే ఇలాంటి చాలా వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. ఆడంగి మాటలు,గాజులు తొడుక్కొ వడం, ప్రత్యర్థులకు సారె పంపించడం వంటివి ఇప్పటికీ వాడుక నుంచి పోలేదని తాజాగా అనేకసార్లు చూస్తున్నాం.
ముదిరితే ముప్పే
తమాషా ఏమంటే ఇవన్నీ సభ్యత, నీతి, మర్యాద వంటి గొప్ప పేర్లతో చలామణి అవుతుంటాయి. వీటిని వ్యతిరేకించే వాళ్లనూ ముందే అపహాస్యం చేస్తుంటారు. మహిళను ఆయుధంగా ప్రయోగించి రాజకీయం చేయడం, వ్యాపారాలు చేయడం తప్ప నిజంగా వారి విముక్తి కోరేవారెవరూ ఈ పోకడలను ఎంతమాత్రం సహించరు. మహిళా కమిషన్లకు నియమితులైనవారు కూడా వారివారి రాజకీయ అనుబంధాలను బట్టి వ్యవహరించడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుంటుంది. సభ్యసమాజంలో సమానత, సంస్కారం, భద్రత, అభివృద్ధి కోణంలో తప్పవీటిపై మరో రకంగా స్పందించడానికి ఆస్కారమే లేదు.పై తరగతుల మహిళలంటూ వారిని చులకన చేసేవారు కిందివర్గాల కోసం పోరాడతారా? అంటే అదీ లేదు. కనుక మూలకారణాన్ని చక్కదిద్దు కోవడం, అవమానాలకు, లైంగికదాడులకు చట్టబద్దంగా సామాజిక రాజకీయ పరంగా సమాధానం చెప్పడం అనివార్యం, అవసరం కూడా. సందర్భాన్ని బట్టి ఇంతకన్నా తీవ్రంగా స్పందించే సమయం రావచ్చు.
తెలకపల్లి రవి



