Sunday, December 28, 2025
E-PAPER
Homeసోపతిఎ.ఐ. కి జవాబు షార్ట్‌ ఫిల్మ్‌

ఎ.ఐ. కి జవాబు షార్ట్‌ ఫిల్మ్‌

- Advertisement -

షార్ట్‌ ఫిల్మ్‌ – లఘుచిత్రం అనేది ఓ దృశ్య విస్ఫోటనం. పంక్తుల మధ్య (బిట్వీన్‌ ద లైన్స్‌) కవితాత్మ ఎలా వుంటుందో షాట్‌ల మధ్యనూ అలాగే దృశ్య కవితాత్మ వుంటుంది. కనుకనే దృశ్యకావ్యమై చిరకాలం అలరిస్తూ ఆలోచింప చేస్తూనే వుంటుంది.

ఈ నెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఇరాన్‌, ఇరాక్‌, స్పెయిన్‌, ఈజిప్ట్‌, అమెరికా, ఇంగ్లాండ్‌, కెనడా, శ్రీలంక, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా దేశాలతో పాటు మన దేశంలోని హిందీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, తమిళం, తెలుగు, మళయాళం మొదలగు భాషల చిత్రాలు పాల్గొనడం గమనార్హం. మొత్తం 705 ఎంట్రీలు వస్తే విభిన్న దశల్లో దాదాపు 25 మంది జ్యూరీ సభ్యులు కలసి 60 చిత్రాలను ఎంపిక చేసి ఆ మూడ్రోజులు ప్రదర్శించారు.

ఏ చిత్రాననికదే ప్రత్యేకత
ఏది కళా స్వేచ్ఛ? ఏది సామాజిక బాధ్యత అన్న చర్చకు మరోసారి రంగభూమి అయింది ఈ ఉత్సవం. కేవలం 10 – 15 నిముషాలు గల చిత్రాలు సైతం విశ్వజనీన సత్యాలు చాటాయి. ఏ చిత్రమూ నలభై నిముషాలకు మించదు. నవరసాల అనుభూతితో పాటు ప్రాపంచిక వాస్తవితను కళ్లకు కట్టాయి.
కళాసృష్టి మానవ సహజ లక్షణమే కావచ్చు. అభివ్యక్తి పరిథిని, లేదా విస్తృతిని ఆయా స్థలకాలాదులకు అనుగుణంగా చిత్ర నిర్దేశకుని (ఫిల్మ్‌ మేకర్‌) ప్రతిభే నిర్ణయిస్తుందనటానికి ప్రతి చిత్రం ఓ తార్కాణం.

కృత్రిమ మేధస్సు – ఆర్టిఫిషియల్‌ ఇంటలిజన్స్‌ (ఎ.ఐ), డిజిటల్‌ ఎరా (శకం)లో మనం జీవిస్తున్నాం. ఏది కావాలంటే అది చాట్‌ జిపిటి క్షణాల్లో రూపొందిస్తున్నప్పుడు మనవ మేధస్సుతో పనేముంది? అన్న ప్రశ్నకు జవాబే ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఉత్సవం అని చెప్పక తప్పదు.
ఇది కేవలం వినోదానికే పరిమితం కాదు. వినోదాన్ని మించిన విజ్ఞానం. వివేచన. అన్నింటికీ మించి ప్రేక్షకుల ఆలోచనకు పదును పెట్టే ఓ ప్రహేళిక (ఫజిల్‌).
దర్శకుని సహానుభూతి (ఎంపథీ) ముద్ర ప్రతి చిత్రంలో కన్పిస్తుంది. చిత్రంలో షాట్‌, లొకేషన్‌, టేకింగ్‌, రీ రికార్డింగ్‌, డ్రామా, అన్నీ భిన్న ఆలోచనలు రేకెత్తించే విధంగా వుంటాయి. ఫిల్మ్‌కు ఫిల్మ్‌కు మధ్య ప్రేక్షకుడు కచ్ఛితంగా వుంటున్నాడనే స్పృహ కూడా కన్పిస్తుంది. కథ అల్లుకునే తీరు, స్క్రీన్‌ ప్లే రాసుకోవడం, షాట్స్‌ తీయడం, ఎమోషన్స్‌ చూపే పద్ధతి ప్రతిదీ ప్రత్యేకమే. ఆయా స్థల కాలాదులతో పాటు, ఆయా దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒడిసి పట్టాయి.

దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడు? మనకు అది క్యారీ అయిందా? లేక మన ఆలోచన స్థాయే అంతగా ఎదగలేదా? అన్న ఆత్మ విమర్శకూ చోటిస్తాయి. ఇలా ఎన్నో అంశాలను మనలో మనం తర్కించుకుంటాం. ఇతరులతో చర్చిస్తాం. తద్వారా మన వివేచనా స్థాయి పెరగడానికి దారి దీపం అవుతాయి. కనువిప్పు కల్గించడం అంటే ఇదే కదా! సత్యజిత్‌రే చిత్రాలు మన భారతదేశ సామాజిక, సాంస్కృతిక స్థితిని ఆ విధంగానే ప్రపంచానికి చూపాయి కదా!
అందుకే యువ చిత్రకారులకు ఈ ఉత్సవం ఎన్నో పాఠాలు నేర్పింది. చిత్ర నిర్మాణంలో కొత్త పుంతలు తొక్కాలని వారిప్పుడు ఆరాటపడ్తున్నారు.
భారీ బడ్జెట్‌ అవసరం లేని మినీ కళాఖండాలు కావున అభిరుచి కలిగిన నిర్మాతలు కూడా దొరుకుతారనే ధైర్యం కూడా వారికి వచ్చింది.
దారులు లేని చోట దారులు వెతుక్కోవడం, కనుగొన్న దారిలో స్వైర విహారం చేయడం లఘుచిత్రలకే సాధ్యం అన్న విషయం రుజువైంది. అద్భుతమైన కళాత్మక ప్రతిభా విలువలతో సామాజిక వాస్తవికతకు పట్టం కట్టడం వలన డాక్యుమెంటరీకి – ఫిల్మ్‌ మేకింగ్‌కు మధ్య గల సన్నని పొర కూడా అదృశ్యమవుతున్నది.
తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ, సాంస్కృతిక, యువజన పర్యాటక శాఖ, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది.

మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సినీ ప్రముఖులు సి.ఉమామహేశ్వరారావు, బి.నర్సింగరావు, నాజర్‌, దిల్‌రాజు, నగేష్‌ కుకునూర్‌, ఉత్పల్‌ జారీ, మైథిలీరావ్‌, ఆర్తీ శ్రీవాస్తవ, వారాల ఆనంద్‌, ఐకా బాలాజీలతో పాటు విదేశీ దర్శకులు కూడా పాల్గొనడం విశేషం. దివిజిల్‌ (ఇరాన్‌), నైంగ్మా (ఇండియా), ఎ నైట్‌ ఇన్‌ ఫుట్‌పాత్‌ (ఇండియా), స్వీట్‌ మూన్‌ (ఇండియా), హోలీవాటర్‌ (ఇరాన్‌), కొల్లెజ్‌ (స్పెయిన్‌), తునై (ఇండియా), బాడి ద బాడి (ఇండియా) చిత్రాలు విజేతలుగా ఎంపికయ్యాయి.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -