Sunday, December 28, 2025
E-PAPER
Homeజోష్సంగీతమే సుమంత్‌ శ్వాస

సంగీతమే సుమంత్‌ శ్వాస

- Advertisement -

పాటతోనే తన జీవితమంటున్నాడు ఈ యువ సంగీత దర్శకుడు. సంగీతమంటే చిన్నప్పటి నుంచి వల్లమాలిన అభిమానం అతనికి. సంగీత సాధనతోనే పెరిగాడు. ఇప్పుడు గాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇండిపెండెంట్‌ సాంగ్స్‌తో అందరి హదయాలను కొల్లగొడుతున్నాడు. ఒకవైపు సాఫ్ట్‌ వేరు ఉద్యోగం, మరోవైపు పౌరోహిత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడ కూడా గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన అతని కొన్ని స్వతంత్ర గీతాలు యూట్యూబ్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌లలో మంచి స్పందన వస్తుంది. సంగీత దర్శకుడు వెంకటేష్‌ వుప్పలతో కలిసి ఆయన రూపొందిస్తున్న గీతాలు, స్వతంత్ర తెలుగు సంగీత విభాగంలో ఒక స్థిరమైన స్థానం ఏర్పరచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. సంగీతమే తన శ్వాస అంటున్న యువ సంగీత కెరటం సుమంత్‌ బోర్రా పరిచయం ఈ వారం జోష్‌….

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన సుమంత్‌ బొర్రా తండ్రి శ్రీనివాస్‌ కొత్తగూడెం ఎన్‌ఎండీసీలో ఉద్యోగం చేయడంతో ఆయన బాల్యం ఎక్కువగా అక్కడే గడిచింది. తల్లి వాణి, సోదరి చందనల ప్రోత్సాహంతో చిన్న వయస్సులోనే సంగీతంపై ఆసక్తి పెరిగింది. పాఠశాల, కాలేజీలలో పాటల పోటీల్లో పాల్గొగే వారు. తరువాత బి.టెక్‌ చదువుకోడానికి పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(LPU) లో చేరారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి చదువుకుంటూనే… సంగీత కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలకు చక్కగా వినియోగించుకునే వారు. అక్కడే సంగీత దర్శకుడు వెంకటేష్‌ వుప్పలతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌ను ఏర్పాటు చేసి యూనివర్సిటీ కార్యక్రమాల్లో స్టేజ్‌ ప్రదర్శనలు నిర్వహించేవారు. అలా సంగీతంపై ఆసక్తిని మరింతగా బలపడింది. ఇంజనీరింగ్‌ పూర్తైన తరువాత సుమంత్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన తరువాత కూడా సంగీత అభిరుచిని సమాంతరంగా కొనసాగించారు.



స్వతంత్ర సంగీత దిశగా ప్రయాణం
తెలుగు సంగీత రంగంలో ఎక్కువగా సినిమా పాటలే ప్రాముఖ్యం పొందుతున్న పరిస్థితిలో, స్వతంత్ర గీతాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుమంత్‌ మరియు వెంకటేష్‌ నిర్ణయించారు. స్వతంత్ర గీతాల ద్వారా కొత్త ప్రయోగాలు చేయడానికి వీలు ఉంటుందని భావించారు. కోవిడ్‌ కాలంలో ఇంటి వద్ద గడిపిన సమయంలో ”ఏలా మరి ఇక రావా” అనే గీతాన్ని రూపొందించారు. ఆదిత్య మ్యూజిక్‌ ఈ పాటను విడుదల చేయడంతో అది విస్తత శ్రోతలకు చేరింది. యూట్యూబ్‌లో మంచి వీక్షణలు రావడంతో స్వతంత్ర సంగీతం కూడా ప్రేక్షకుల నుంచి స్వీకరణ పొందగలదన్న నమ్మకం ఆయనకు పెరిగింది. ఈ అనుభవం తరువాత మరిన్ని స్వతంత్ర గీతాలపై పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

‘పడిపోయా’ పాటకు వచ్చిన స్పందన
తాజాగా విడుదలైన ”పడిపోయా” పాట సుమంత్‌ సంగీత ప్రయాణంలో ఒక ముఖ్య దశగా నిలిచింది. మల్లిక వల్లభ ఈ గీతానికి సాహిత్యం అందించగా, నవీన్‌ కుమార్‌ కమతం దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని శివారెడ్డి నిర్వహించారు. వెడ్డింగ్‌ మ్యూజిక్‌ శైలిలో రూపొందించిన ఈ గీతానికి ప్రేక్షకులు, సంగీతాభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. సినీ, సంగీత రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఈ గీతాన్ని అభినందించారు. ఈ పాటతో స్వతంత్ర సంగీత నిర్మాణం కూడా సాంకేతిక ప్రమాణాలు, క్రమబద్ధమైన తయారీతో ముందుకు వెళ్తే మంచి గుర్తింపు పొందగలదని సుమంత్‌ భావిస్తున్నారు.

వృత్తి- సంప్రదాయం- సంగీతం
సుమంత్‌ బొర్రా ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పూర్తి సమయ ఉద్యోగం చేస్తూ, మరోవైపు పురోహితునిగా సంప్రదాయ విధుల్లో పాల్గొంటున్నారు. కుటుంబ సంప్రదాయం, బాధ్యతల దష్ట్యా ఈ పాత్రను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గాయకుడు, నిర్మాతగా స్వతంత్ర సంగీత గీతాల తయారీలో పాల్గొనడం ఆయన వ్యక్తిత్వంలో మరో ముఖ్య అంశంగా నిలుస్తోంది. ఉద్యోగం ఆర్థిక స్థిరత్వం అందిస్తే, సంగీతం వ్యక్తిగత సంతప్తిని ఇస్తుందని ఆయన భావిస్తున్నారు. వృత్తి అభిరుచుల మధ్య సమతుల్యం సాధించడం తనకు ముఖ్యమని సుమంత్‌ స్పష్టంగా చెబుతారు.

సంగీత శైలి, గీతాలు – గుర్తింపు
తెలుగు మెలోడీలకు ఆధునిక సంగీత శైలిని జోడిస్తూ, వినడానికి సులభంగా ఉండే కూర్పులను రూపొందించడం తమ కృషిలో లక్ష్యంగా పెట్టుకున్నామని సుమంత్‌, వెంకటేష్‌ చెబుతారు. గణనాయక, విశ్వం, అధర్వ మోరియా, మళ్లీ రావా, ఏలా మరి ఇక రావా, పడిపోయా వంటి గీతాలు వారి సంగీత ప్రయాణంలో ప్రాధాన్యం పొందాయి. సుమంత్‌ సంగీత కషికి గుర్తింపుగా ఇండియన్‌ ఫిల్మ్‌ ప్రాజెక్ట్‌ లో ప్లాటినం అవార్డు లభించింది. అంతేకాకుండా పలు దినపత్రికలు మరియు మీడియా సంస్థలు ఆయన సంగీత ప్రయాణంపై కథనాలను ప్రచురించాయి. స్వతంత్ర సంగీతంలో ఆయన చేస్తున్న కృషి యువ కళాకారులకు ప్రోత్సాహకరంగా మారిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

భవిష్యత్‌ ప్రణాళికలు
భవిష్యత్తులో మరిన్ని స్వతంత్ర సింగిల్స్‌ విడుదల చేయాలని సుమంత్‌, వెంకటేష్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వెడ్డింగ్‌ మ్యూజిక్‌, ఆధునిక సంగీత శైలుల్లో కొత్త కూర్పులను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు. అవసరమైతే చిత్రసంగీత రంగంలో అవకాశాలను కూడా పరిశీలించాలని వారు భావిస్తున్నారు. సమకాలీన పరిస్థితుల్లో వృత్తి, సంప్రదాయం, సంగీతం అనే మూడు రంగాలను సమన్వయంతో కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న సుమంత్‌ బొర్రా ప్రయాణం, అనేక రంగాల్లో అవకాశాలను అన్వేషిస్తున్న యువతకు ఒక ప్రేరణాత్మక నమూనాగా నిలుస్తోంది.
సమాజం గీసిన గీతలు దాటితేనే కలలకు దారి దొరుకుతుంది.

ఆ దారినే ధైర్యంగా నడిచిన యువ స్వరం సుమంత్‌ బోర్రా అని అతని మిత్రులు ఉవాచ. ”నీ అభిరుచిని నీ లక్ష్యంగా మార్చుకో” అన్న మాట ఆయనకు కేవలం కోట్‌ కాదు, జీవన విధానం. సాధారణంగా కెరీర్‌ అంటే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ప్రభుత్వ ఉద్యోగాలే భవిష్యత్తు అని నమ్మే ఆలోచనల మధ్య సంగీతాన్ని నమ్ముకోవడం సవాలే. అయినా సుమంత్‌ ఆ సవాలును స్వీకరించాడు.

హైదరాబాద్‌లో పెరిగిన ఈ యువ సంగీతకారుడు చిన్ననాటి నుంచే స్వరాలతో స్నేహం చేశాడు. ”డబ్బుకన్నా గుర్తింపే ముఖ్యం” అనే కుటుంబ విలువలు ఆయనలో ప్రత్యేకతను నింపాయి. పాటలు రాయడం, పాడటం మాత్రమే కాదు. సమాజపు ఒత్తిడితో ఇంజినీరింగ్‌ చదివినా, సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. కళాశాల వేదికలపై మొదలైన ప్రయాణం వందల పోటీల దాకా చేరింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనూ వీకెండ్లలో పాటలు కంపోజ్‌ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ఆ శ్రమే ఆదిత్య మ్యూజిక్‌ వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే సంగీతాన్ని హదయంలో పదిలపరచుకున్నాడు. సంగీత ప్రయాణంలో ముందుకు సాగుతున్న సుమంత్‌ బోర్రాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -