Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంజనవరి 5 నుంచి ఉపాధి బచావో అభియాన్‌

జనవరి 5 నుంచి ఉపాధి బచావో అభియాన్‌

- Advertisement -

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం
మోడీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం
రాష్ట్రాలు, పేదలపై విధ్వంసకర దాడి
విలేకరుల సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గ్రామీణ ప్రజల జీవనోపాధిలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) రద్దుకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం నాడిక్కడ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్‌)లో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎ.రేవంత్‌ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖ్‌, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. తొలుత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు నివాళులర్పించారు.

ఇటీవల మరణించిన కాంగ్రెస్‌ నేతలు శివరాజ్‌ పాటిల్‌, శ్రీప్రకాష్‌ జైస్వాల్‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దాని పరిణామాలను మోడీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ”ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బచావో అభియాన్‌”ను నిర్వహిస్తామన్నారు. వీబీ-జీ రామ్‌ జీ చట్టంతో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని, రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. పేదలను అణచివేయడానికి తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా వీధుల్లో, పార్లమెంట్‌లో పోరాడుతామని హెచ్చరించారు. 2015లో భూ సేకరణ చట్ట సవరణలు, 2020-21లో రైతులు చారిత్రాత్మక పోరాటంతో మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న మూడు వ్యవసాయ చట్టాల వలే, దీన్ని ఉపసంహరించుకోవాల్సి వస్తుందన్నారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) తీవ్రమైన సమస్య అని, దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి మోడీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి పన్నిన కుట్ర అని ధ్వజమెత్తారు.

అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనలు, మైనారిటీ పేర్లను ఓటర్‌ జాబితా నుంచి తొలగించకుండా, ఇతర బూత్‌లకు బదిలీ చేయకుండా చూసుకోవాలని సూచించారు. దీనికి కోసం బూత్‌ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ ‘సంస్థా సృజన అభియాన్‌’ను కొనసాగిస్తామని తెలిపారు. 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిందని, బూత్‌ స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. 2026లో రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధమని స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐల దుర్వినియోగం జరుగుతోందని, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులను ఆయన ఖండించారు. ఈ ఘటనపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న సంస్థలు క్రిస్మస్‌ వేడుకలపై చేసిన దాడులు మత సామరస్యాన్ని దెబ్బతీశాయని, ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టకు కళంకం తీసుకువచ్చాయని విమర్శించారు.

రాష్ట్రాలు, పేదలపై విధ్వంసకర దాడి
మోడీ సర్కార్‌ రాష్ట్రాలు, పేద ప్రజలపై నోట్ల రద్దు మాదిరిగానే విధ్వంసకర దాడికి పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ చర్యను కాంగ్రెస్‌ ప్రతిఘటిస్తోందని, ఇందుకు ప్రతిపక్షాలన్నీ మద్దతిస్తున్నాయని స్పష్టం చేశారు. 2006లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మార్చిందని, దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిందని, పేదరికం నుంచి బయటపడ్డ తరాన్ని సృష్టించిందని వివరించారు. ‘పేదల కడుపుపై తన్నిన మోడీ ప్రభుత్వం,పేదల కంటే కార్పొరేట్ల లాభాలే ముఖ్యం’ అని విమర్శించారు. ఎంజీఎన్‌ ఆర్‌ఈజీఏ కేవలం ఒక చట్టం కాదని, రాజ్యాంగం ఇచ్చిన పని హక్కు అని వెల్లడించారు.

ఉపాధి హామీ చట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయని, దాన్ని రద్దు చేయడమంటే మహాత్మా గాంధీని అవమానించడ మేనని దుయ్యబట్టారు. ప్రధాని మంత్రివర్గాన్ని సంప్రదించకుండా, అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలో పాలన వన్‌ మ్యాన్‌ షోగా మారిపోయిందనడానికి ఇదే ఉదాహరణ అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్‌ను నాశనం చేసిన మోడీ ప్రభుత్వం, ఇప్పుడు గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఎన్నో ఏండ్లుగా ఆర్థిక భరోసానిస్తున్న పథకాన్ని ఆపితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -