ఆశాలకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాల్సిందే..: ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆశాల ధర్నాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
రాష్ట్రంలో డిసెంబర్ నెలలో నిర్వహించే లెప్రసీ సర్వేకు ఆశా కార్యకర్తలకు అదనంగా డబ్బులు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. అందులో భాగంగా ఆశా వర్కర్లు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలకిë మాట్లాడుతూ.. డిసెంబర్‌లో చేపట్టే లెప్రసీ సర్వేకు సంబంధించి ఆశాలకు చెల్లించే అదనపు పారితోషికంపై స్పష్టత ఇవ్వాలన్నారు. గత ఏడాది పోరాటం చేస్తేనే డబ్బులు వచ్చాయని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం ఆశాలను ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న సర్వే డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలన్నారు. కేంద్రం పెంచిన పారితోషికాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని, 2021 జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు.
ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. పారితోషికం లేని పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆశా వర్కర్ల ప్రతినిధి బృందం అదనపు కలెక్టర్ పి.కదిరవన్‌ను కలిసి అందజేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సౌత్ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎం.మీనా, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు ఎం.దశరథ్, కార్యదర్శి జె.కుమారస్వామి, ఆశా యూనియన్, సీఐటీయూ సౌత్ సిటీ నాయకులు జి.విఠల్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షురాలు టి.యాదమ్మ, ప్రధాన కార్యదర్శి ఎ.కృష్ణవేణి, కోశాధికారి ఎస్.సారాబాబు, సౌత్ సిటీ నాయకులు రాధిక, సఫియా ఉన్నిస్సా పాల్గొన్నారు.
జిల్లాల్లో..
వికారాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆశావర్కర్లు ధర్నా చేశారు. పెండింగ్‌లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు తక్షణమే ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పెద్దఎత్తున హాజరయ్యారు. అంతకుముందు సీఐటీయూ నాయకులు కలెక్టరేట్ ముందున్న భారీకేడ్లను తొలగించి గేటు ముందు బైటాయించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుంట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ముందర ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు.



