Wednesday, May 21, 2025
Homeఆటలుఅహ్మదాబాద్‌లోఐపీఎల్‌ ఫైనల్‌

అహ్మదాబాద్‌లోఐపీఎల్‌ ఫైనల్‌

- Advertisement -

– ముల్లాన్‌పూర్‌లో క్వాలిఫయర్‌1, ఎలిమినేటర్‌
– సన్‌రైజర్స్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌ వేదిక మార్పు

ఊహించినదే జరిగింది. ఈడెన్‌ గార్డెన్స్‌, ఉప్పల్‌ స్టేడియం ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచులకు ఆతిథ్యం అందించే అవకాశం కోల్పోయాయి. వాతావరణ పరిస్థితుల కారణంతో ఐపీఎల్‌18 ప్లే ఆఫ్స్‌ను అహ్మదాబాద్‌, ముల్లాన్‌పూర్‌కు మార్పు చేశారు. జూన్‌ 3న అహ్మదాబాద్‌ ఐపీఎల్‌ టైటిల్‌ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్‌1, ఎలిమినేటర్‌కు ముల్లాన్‌పూర్‌ వేదిక కానుంది. ఈ మేరకు బీసీసీఐ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ వేదికలను ఖరారు చేసింది.
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌లో నాలుగు మ్యాచులకు వేదికలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండు వేదికలను ఖరారు చేసింది. అహ్మదాబాద్‌, ముల్లాన్‌పూర్‌ (న్యూ చంఢగీడ్‌)లు ప్లే ఆఫ్స్‌ మ్యాచులకు ఆతిథ్యం అందిస్తాయని బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్‌18వ ప్లే ఆఫ్స్‌కు వాస్తవంగా కోల్‌కత, హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వాలి. భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌కు వారం రోజుల వాయిదా అనివార్యం కాగా.. రీ షెడ్యూల్‌లో హైదరాబాద్‌, కోల్‌కతను పరిగణనలోకి తీసుకోలేదు. కోల్‌కత, హైదరాబాద్‌లో ఈ సమయంలో వర్షాలు కురిసే అవకాశం అధికంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది!. జూన్‌ 3న అహ్మదాబాద్‌లోని నరెంద్ర మోడీ స్టేడియంలో టైటిల్‌ పోరు జరుగనుండగా.. క్వాలిఫయర్‌2 సైతం జూన్‌ 1న అక్కడే జరుగనుంది. క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌ మ్యాచులు మే 29, 30న ముల్లాన్‌పూర్‌లో జరుగనున్నాయి. ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ‘వాతావరణ పరిస్థితులు సహా ఇతర కొలమానాలను పరిగణనలోకి ప్లే ఆఫ్స్‌ వేదికలను ఎంపిక చేశామని’ బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, గుజరాత్‌ టైటాన్స్‌లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాల్గో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ పోటీపడుతున్నాయి.
వేదిక మారింది
ఐపీఎల్‌లో మరో మ్యాచ్‌ వేదికను మార్పు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ పున ప్రారంభ మ్యాచ్‌ బెంగళూర్‌లో షెడ్యూల్‌ చేయగా.. భారీ వర్షంతో టాస్‌ కూడా సాధ్యపడలేదు. కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మ్యాచ్‌ రద్దుగా ముగిసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ ఈ శుక్రవారం బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలోనే షెడ్యూల్‌ చేశారు. కానీ బెంగళూర్‌లో నిలకడగా భారీ వర్షాలు కురుస్తుండగా.. వాతావరణ శాఖ ‘ఎల్లో’ అలర్ట్‌ సైతం జారీ చేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ మ్యాచ్‌ వేదికను బెంగళూర్‌ నుంచి లక్నోకు మార్చారు. వర్షాలతో ఇండర్‌ ప్రాక్టీస్‌కు పరిమితమైన ఆర్‌సీబికి.. ప్రాక్టీస్‌ సెషన్‌కు సన్నద్ధమవుతుండగా ఐపీఎల్‌ నిర్వాహకులు ఈ సమాచారం అందించగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌ను ముగించుకుని మంగళవారం సాయంత్రం బెంగళూర్‌కు బయల్దేరుతున్న ఆరెంజ్‌ ఆర్మీకి మధ్యాహ్న సమయంలో సమాచారం అందించారు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు లక్నోలో ఉండిపోయారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ గ్రూప్‌ దశలో చివరి రెండు మ్యాచులను లక్నోలోనే ఆడనుంది. 23న హైదారాబాద్‌తో, 27న సూపర్‌జెయింట్స్‌తో బెంగళూర్‌ ఆడనుంది. ఈ రెండు మ్యాచులు లక్నోలో జరుగనుండటంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-2 నిలిచే అవకాశాలకు గండి పడలేదు.
120 నిమిషాల అదనం
ఐపీఎల్‌ షెడ్యూల్‌, ప్లే ఆఫ్స్‌ వేదికలతో పాటు ప్లేయింగ్‌ కండిషన్స్‌లో సైతం బీసీసీఐ పలు మార్పులు చేసింది. ఐపీఎల్‌ 2025 వారం రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలవటం,దేశవ్యాప్తంగా వర్షాలు కురవటం ప్రారంభవటంతో గ్రూప్‌ దశ మ్యాచులను ముగించేందుకు అదనంగా 120 నిమిషాల సమయాన్ని కేటాయించారు. దీంతో మధ్యాహ్నం మ్యాచ్‌ వర్షం ప్రభావంతో సాయంత్రం 5.30 గంటలకు మొదలైనా.. సాయంత్రం మ్యాచ్‌ వర్షంతో రాత్రి 9.30 గంటలకు షురూ అయినా ఓవర్లను కుదించకుండా 20 ఓవర్ల మ్యాచ్‌ను ఆడిస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌కు మధ్యాహ్నం మ్యాచ్‌కు రాత్రి 7.56 గంటలు.. సాయంత్రం మ్యాచ్‌కు రాత్రి 11.56 గంటలకు తుది గడువు కానుంది. ఐపీఎల్‌18లో వర్షం కారణంగా ఇప్పటివరకు మూడు మ్యాచులు రద్దుగా ముగియగా, రెండు మ్యాచుల్లో ఓవర్లను కుదించారు. ఈడెన్‌గార్డెన్స్‌లో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌… బెంగళూర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ వర్షంతో తుడిచిపెట్టుకుపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -