Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతమిళ సూపర్‌స్టార్ విజయ్ సంచలన ప్రకటన

తమిళ సూపర్‌స్టార్ విజయ్ సంచలన ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ సూపర్‌స్టార్, ‘దళపతి’ విజయ్ తన సినీ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు నటన నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో, దాదాపు 90,000 మంది అభిమానుల మధ్య జరిగిన ‘జన నాయగన్’ చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, ప్రజాసేవ కోసమే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. “నా కోసం థియేటర్లలో నిలబడిన అభిమానుల కోసం, రాబోయే 30-33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్ ఫ్యాన్స్ కోసమే నేను సినిమాను వదిలేస్తున్నాను” అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో అభిమానులు అండగా నిలిచారని, వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. “నేను ఇసుకతో చిన్న ఇల్లు కట్టుకుందామని సినిమాలోకి వస్తే, మీరంతా నాకు ఒక రాజమహల్ ఇచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు” అని విజయ్ పేర్కొన్నారు.

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ తన 69వ మరియు చివరి చిత్రమని విజయ్ ఈ వేదికగా తేల్చిచెప్పారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ ప్రకటనతో ఆయన పూర్తి సమయం రాజకీయ నేతగా మారనుండటం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -