నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయాలు జరిపినందుకు గాను మర్రిగూడలోని ”మన గ్రోమోర్ సెంటర్” ఫెర్టిలైజర్ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ మునుగోడు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు డీలర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారా స్లాట్ బుక్ చేసుకొనని రైతులకు నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయించినట్లు గుర్తించడం జరిగిందని, ఏ డి ఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 24న మర్రిగూడా మన గ్రోమర్ డీలర్ 19.98 మెట్రిక్ టన్నుల (444 బస్తాలు) యూరియాను పొందడం జరిగిందని, దానిని ఈ నెల 25 ,26 తేదీలలో అనధికారికంగా స్లాట్ బుక్ చేసుకోనని రైతులకు విక్రయించారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
యూరియా కై ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఈ నెల 27 న ఎరువుల దుకాణానికి రాగా, అక్కడ స్టాక్ లేకపోవడంతో మండల కేంద్రంలో తీవ్ర గందరగోళం నెలకొందని,
దీనిని దృష్టిలో ఉంచుకొని ‘ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్-1985’ లోని క్లాజ్ 31 ప్రకారం, సదరు డీలర్ లైసెన్స్ ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ఏ డి ఏ పేర్కొన్నారు. ఎరువుల విషయంలో
నిబంధనలు అతిక్రమించే ఏ ఎరువుల డీలర్ పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



