నేపాల్‌, ఓమన్‌ అర్హత

నేపాల్‌, ఓమన్‌ అర్హత– 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌
దుబాయ్ : నేపాల్‌, ఓమన్‌ ధనాధన్‌ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. ఆసియా రీజియన్‌ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన నేపాల్‌, ఓమన్‌ 2024 ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌లో పోటీపడనున్నాయి. ఐసీసీ ఆసియా రీజియన్‌ క్వాలిఫయర్స్‌ సెమీస్‌లో బహ్రెయిన్‌ పై ఓమన్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా, యుఏఈపై నేపాల్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత యుఏఈ 134/9 పరుగులు చేయగా.. నేపాల్‌ 135/2తో ఛేదించి ఫైనల్లోకి చేరుకుంది. మరో సెమీస్‌లో బహ్రెయిన్‌ 106/9 స్కోరు చేయగా.. ఓమన్‌ 109/0తో లాంఛనం ముగించింది. ఆసియా రీజియన్‌ క్వాలిఫయర్స్‌ ఫైనల్లో నేపాల్‌, ఓమన్‌ తలపడనున్నాయి. 2014లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన నేపాల్‌ పదేండ్ల తర్వాత మళ్లీ మెగా టోర్నీలో ఆడనుంది. నేపాల్‌, ఓమన్‌ అర్హతతో.. 2024 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడనున్న జట్ల సంఖ్య 18కి చేరుకుంది. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ నుంచి మరో రెండు జట్లు సైతం అర్హత సాధించాల్సి ఉంది. ఓవరాల్‌గా 20 జట్లు పోటీపడనున్న టోర్నీకి ఆతిథ్య దేశాలు అమెరికా, వెస్టిండీస్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్‌-8లో నిలిచి అర్హత సాధించాయి. ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో నిలిచి అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించాయి. యూరోప్‌ క్వాలిఫయర్స్‌ నుంచి ఐర్లాండ్స్‌, స్కాట్లాండ్‌.. ఈస్ట్‌ ఆసియా పసిఫిక్‌ నుంచి న్యూ గునియా, అమెరికా రీజియన్‌ నుంచి కెనడా అర్హత సాధించాయి.

Spread the love