ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ నిర్ణయం
న్యూఢిల్లీ : మాస్టర్ రైట్స్ అగ్రీమెంట్ (ఎంఆర్‌ఏ) గడువు ముగియటం, లీగ్ బిజినెస్ మోడల్‌పై స్పష్టత లేమి ఫలితంగా ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరంభం కాలేదు. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో ఐఎస్‌ఎల్ సీజన్ షురూ అవుతుంది. కానీ ఈ ఏడాది అది సాధ్యపడలేదు. లీగ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానించినా.. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ఎటువంటి కమర్షియల్ భాగస్వాములను ఆకర్షించలేదు. అయితే, ఫుట్‌బాల్ స్పోర్ట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌డీఎల్) ముందుకు రాకపోయినా.. ఈ సీజన్‌ను సొంతంగా నిర్వహించేందుకు ఏఐఎఫ్‌ఎఫ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ఇండియన్ సాకర్ లీగ్ షురూ కానుందని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కానీ పూర్తి షెడ్యూల్‌పై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో మాదిరి ప్రతి క్లబ్ ఇంట, బయట ఫార్మాట్‌లో ఆడే వెసులుబాటు ఈ సీజన్‌లో ఉండబోదు.
కమర్షియల్ భాగస్వాములు లేకపోవటంతో సీజన్ మొత్తాన్ని మూడు వేదికల్లోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు లీగ్ దశలో మ్యాచ్‌ల సంఖ్యను సైతం గణనీయంగా కుదించేందుకు ఏఐఎఫ్‌ఎఫ్ యంత్రాంగం పని చేస్తోంది. ఆ మూడు వేదికలు ఏవనే అంశంపై ఈ వారంలో జరిగే సమావేశంలో స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్వయంగా ఐఎస్‌ఎల్ సీజన్ నిర్వహణకు నడుం బిగించగా.. క్లబ్‌లు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కమర్షియల్ పార్ట్‌నర్ లేకపోవటంతో సీజన్ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులు, క్లబ్‌ల చెల్లింపులకు హామీ ఎవరనే అంశాలను లేవనెత్తాలనే ఆలోచనలో క్లబ్‌లో ఉన్నాయి. దీంతో పాటు ఎఫ్‌ఏసీ చాంపియన్స్ లీగ్‌కు ఐఎస్‌ఎల్ నుంచి రెండు క్లబ్‌లు అర్హత సాధిస్తాయి. ఈ ఏడాది ఐఎస్‌ఎల్ లీగ్ లేకపోవటంతో ఈ రెండు జట్లను ఎలా ఖరారు చేస్తారనే విషయంలోనూ క్లబ్‌లు స్పష్టత కోరుకుంటున్నాయి.



