Monday, December 29, 2025
E-PAPER
Homeఆటలుమంధాన, షెఫాలీ దంచికొట్టారు

మంధాన, షెఫాలీ దంచికొట్టారు

- Advertisement -

అర్థ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు
నాల్గో టీ20లో భారత్‌ ఘన విజయం
భారత్‌ 221/2, శ్రీలంక 191/6

నవతెలంగాణ-తిరువనంతపురం
భారత ఓపెనర్లు స్మృతి మంధాన (80, 48 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (79, 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ దంచికొట్టుడుతో తిరువనంతపురంలో శ్రీలంక అమ్మాయిల భరతం పట్టారు. ఓపెనర్ల వీరంగానికి తోడు రిచా ఘోష్‌ (40 నాటౌట్‌, 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (16 నాటౌట్‌, 10 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. బ్యాటర్ల సూపర్‌ షోతో శ్రీలంకతో నాల్గో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది.

రికార్డు ఛేదనలో శ్రీలంక మహిళలు 191/6 పరుగులకే పరిమితం కావటంతో భారత్‌ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో క్లీన్‌స్వీప్‌ విజయం ముంగిట నిలిచింది. శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు (52, 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాసిని పెరీరా (33, 20 బంతుల్లో 7 ఫోర్లు), నీలాక్షిక సిల్వ (23 నాటౌట్‌, 11 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినా ఆ జట్టు విజయానికి చేరువ కాలేకపోయింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (2/42), వైష్టవి శర్మ (2/24) రాణించారు. భారత్‌, శ్రీలంక మహిళల ఆఖరు టీ20 మంగళవారం తిరువనంతపురంలోనే జరుగుతుంది.

ఓపెనర్ల విశ్వరూపం
టాస్‌ ఓడిన భారత్‌ సిరీస్‌లో తొలిసారి తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (79), స్మృతి మంధాన (80) పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు రికార్డు భాగస్వామ్యం అందించారు. షెఫాలీ వర్మ, మంధానలు పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ బౌండరీలతో దండెత్తారు. దీంతో ఆరు ఓవర్లలోనే భారత్‌ 61 పరుగులు పిండుకుంది. పవర్‌ప్లే ముగిసినా.. ఓపెనర్లు జోరు తగ్గలేదు. తొలి ఆరు ఓవర్లలో ఓవర్‌కు 10.2 పరుగులు పిండుకున్న భారత్‌.. మిడిల్‌ ఓవర్లలో దూకుడుకు మరింత పదును పెట్టి ఓవర్‌కు 10.7 చొప్పున పరుగులు రాబట్టింది. 9 ఫోర్లతో షెఫాలీ వర్మ 30 బంతుల్లో అర్థ సెంచరీ బాదగా.. మంధాన 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించింది. ఈ సిరీస్‌లో షెఫాలీ వర్మకు ఇది వరుసగా మూడో అర్థ సెంచరీ కావటం విశేషం.

వికెట్‌కు ఇరువైపులా ఎడాపెడా బౌండరీలు బాదిన షెఫాలీ, మంధాన తొలి వికెట్‌కు రికార్డు 162 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఇద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించినా.. రిచా ఘోష్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భారత్‌కు భారీ స్కోరు అందించారు. స్లాగ్‌ ఓవర్లలో రిచా ఘోష్‌ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరువగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌తో ఆకట్టుకుంది. టాప్‌-4 బ్యాటర్లు కదం తొక్కటంతో భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 221 పరుగుల రికార్డు చేసింది. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. స్మృతి మంధాన అంతర్జాతీయ కెరీర్‌లో పది వేల పరుగుల మైలురాయి సైతం ఈ మ్యాచ్‌లోనే అందుకుంది. చివరి నాలుగు ఓవర్లలో భారత్‌ ఓవర్‌కు 13.3 పరుగుల చొప్పున పిండుకోవటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -