Monday, December 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుశాసనసభను కాంగ్రెస్‌ భ్రష్టు పట్టిస్తోంది

శాసనసభను కాంగ్రెస్‌ భ్రష్టు పట్టిస్తోంది

- Advertisement -

సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోంది
అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాసనసభను కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం శాసనసభలోని బీఆర్‌ఎస్‌ ఎల్‌పీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. సభలో మొత్తం 18 కమిటీలకు ఏ ఒక్క కమిటీని వేయలేదని ఎద్దేవా చేశారు. ఎస్టిమెట్‌ కమిటీకి ఎంపికైన పద్మావతి ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. సభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ లేవనెత్తిన ఏ అంశాన్ని కూడా చర్చించడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపితే..కాంగ్రెస్‌ సగటున 20 రోజులే సమావేశాలు నిర్వహించిందన్నారు. ”సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోంది. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని డాంబికాలు పలికి.. చివరికి ఒక్క రోజుతో ముగిస్తున్నారు. ఈసారి కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు విఫలమయ్యారు” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ప్రతిపక్షం బాధ్యత అని స్పష్టం చేశారు.

అధికార బలంతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. మందబలం ప్రదర్శించి సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్‌ మాట్లాడిన అంశాలను.. బీఆర్‌ఎస్‌పై మళ్లీ బురద జల్లడానికి అసెంబ్లీని నడుపుతున్నారని విమర్శించారు. 45 టీఎంసీలకు మీరు సంతకం పెట్టారా లేదా సూటిగా చెప్పండని ప్రశ్నించారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 45 టీఎంసీలతో రంగారెడ్డిని ఎండబెడుతారా అని నిలదీశారు. డీపీఆర్‌ వాపస్‌ వచ్చిందా లేదా? ఆ సంతకం మీదా కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎరువుల కొరత, రుణమాఫీ, రైతుబంధు, హిల్ట్‌ పాలసీపై 5 లక్షల కోట్ల కుంభకోణం, గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌, ట్రిపుల్‌ఆర్‌, జాబ్‌ క్యాలెండర్‌, ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, ఫ్యూచర్‌ సిటీ, ఫార్మా సిటీ, హైడ్రా బుల్డోజర్‌పై చర్చ జరగాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -