Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైతులను లూటీ చేసిన కేంద్రం

రైతులను లూటీ చేసిన కేంద్రం

- Advertisement -

– కొత్తగూడెంలో మార్చి 16 నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు : భారత కిసాన్‌ సభ జాతీయ కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– 150 మందితో ఆహ్వానసంఘం ఏర్పాటు
నవతెలంగాణ-కొత్తగూడెం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని లూటీ చేసిందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను దివాలా తీయించి రోడ్డున పడేసిందనిఅఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కమిటీ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆదివారం కొత్తగూడెంలోని డాక్టర్‌ భూపతి రావు గ్రౌండ్‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎలమంచిలి వంశీ కృష్ణ అధ్యక్షతన జరిగింది. 150 మందితో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వాన సంఘానికి ఐలూ రాష్ట్ర నాయకులు జలసూత్రం శివరాం ప్రసాద్‌ అధ్యక్షులుగా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణను ప్రధాన కార్యదర్శిగా, ఎలమంచిలి వంశీకృష్ణను ఆహ్వాన సంఘం కోశాధికారిగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు మార్చి 16, 17, 18 తేదీలలో కొత్తగూడెం పట్టణంలో జరపబోతున్నట్టు ఆయన ప్రకటించారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేసినప్పటికీ వాటిని మరో రూపంలో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విత్తన చట్టం పేరుతో దేశీయ విత్తనాలకు రైతులకు నష్టం చేసే పద్ధతిలో కార్పొరేట్లకు అనుకూలంగా బిల్లును తీసుకొస్తున్నారన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఐక్యపరిచి ఉద్యమాలు నిర్మించి దేశంలో వ్యవసాయాన్ని రక్షిస్తామని రైతులకు భరోసా కల్పించే విధంగా ఉద్యమాలు రూపకల్పన చేస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌ తెలిపారు. మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరూ సహకరించి జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడింది కమ్యూనిస్టులే : డీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ నాగ సీతారాములు
పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షక, రైతు కూలీల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కచ్చితంగా పోరాటాలు చేస్తున్న వారు కమ్యూనిస్టులు మాత్రమేనని డీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ నాగసీతారాములు అన్నారు. దేశంలో బిజేపి ప్రభుత్వం తీసుకు వస్తున్న కార్మిక, కర్షక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కమ్యూనిస్టేలేనని చెప్పారు. కాంగ్రేస్‌ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ సైతం కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాపై పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్స్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు, సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -