Monday, December 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలో అతి పెద్ద నూమాయిష్‌

దేశంలో అతి పెద్ద నూమాయిష్‌

- Advertisement -

జనవరి ఒకటిన ప్రారంభం : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు

నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
దేశంలోనే ప్రతిష్టాత్మక 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2026 నూమాయిష్‌ వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించనున్నట్టు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్‌, వ్యాపారం, వినోదం, విజ్ఞానం వంటివి వేదికగా నిలుస్తున్న నూమాయిష్‌ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రారంభిస్తారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ఆదివారం ఎగ్జిబిషన్‌ మైదానం గాంధీ సెంటనేరీ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. జాతీయస్థాయిలో బహుళ ప్రాచుర్యం కల్గిన నుమాయిష్‌ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు తెరిచి ఉంటుందని, శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవుల్లో రాత్రి 11 గంటల వరకు నూమాయిష్‌ ఉంటుందన్నారు. నూమాయిష్‌ను సందర్శించేందుకు విదేశాల నుంచి వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

దీనికోసం 34 సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశామని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రత్యేకంగా 320 మంది వాలంటీర్లను నియమించినట్టు 24 గంటలు అంబులెన్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉన్న 20 ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. 2024-25లో జీఎస్ట్టీ, ట్రేడ్‌ లైసెన్సు ఫీజ్‌, ప్రాపర్టీ యుటిలిటీ ఛార్జీల కింద రూ.10 కోట్లుప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని, అలానే 2023-24లో వివిధ పన్నుల రూపంలో చెల్లించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి, బి.ఎన్‌, రాజేశ్వర్‌, జాయింట్‌ సెక్రెటరీ, టి. చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షులు, ఆర్‌ సుఖేష్‌ రెడ్డి, కోశాధికారి డాక్టర్‌ ఎన్‌. సంజీవ్‌ కుమార్‌, ఆదిత్య మార్గం, బి. హనుమంతరావు, ఎన్‌.వినయ్ కుమార్‌, పి.నరోత్తం రెడ్డి, అశ్విని మార్గం, డాక్టర్‌ బి. ప్రభాస్‌ శంకర్‌, ఎం. చంద్రశేఖర్‌, పీఆర్‌ఓ రవి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -