నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. డ్రైవింగ్ అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్‌లో నివాసం ఉంటూ.. 21 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని సజ్జనార్ సూచించారు. జనవరి 3వ తేదీన (శుక్రవారం) ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంబర్‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డుతో పాటు ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెంట తీసుకురావాలని సూచించారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ జాబ్ మేళా ద్వారా మహిళలను బైక్, స్కూటర్ , ఈ-ఆటో ట్యాక్సీ డ్రైవర్లుగా తయారు చేయనున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు మాత్రమే సేవలు అందించే విధంగా ఈ ఉద్యోగాలు ఉండటం విశేషం. దీని వల్ల మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా.. నగరంలో ప్రయాణించే మహిళలకు మరింత భద్రత కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.



