నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు శిథిలావస్థకు చేరుతున్నాయని, 205 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్ చేశారు. బివై నగర్ లోని అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణంలోనీ ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ అందించాలని అన్నారు. ప్రభుత్వం సిరిసిల్ల పట్టణం శాంతినగర్లో 205 డబల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు కావస్తున్నా వాటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం హాయంలో రెండు సంవత్సరాలు గడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 105 మంది అర్హులను గుర్తించి, పేర్లు ప్రకటించి, ఇల్లు పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం వలన వారికి అన్యాయం పెద్ద ఎత్తున జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సంతోషపడ్డ వారికి చివరికి దుఃఖం మిగిల్చిన పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందనీ, ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు గడిచినా వాటిని పంపిణీ చేయకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కట్టిన డబల్ బెడ్ రూమ్ లు నిరుపయోగంగా ఉండడం వలన అవి పాడైపోయి, శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అన్నారు. గత సంవత్సరం నుంచి పంపిణీ చేస్తామని హడావుడి చేస్తున్నారే తప్ప.. పంపిణీ చేయడం లేదని తెలిపారు. మండపల్లి పెద్దూరు డబల్ బెడ్ రూమ్ లో అనర్హులను గుర్తించే విషయంలో సర్వే చేశారని, ఆ సర్వే ద్వారా ఎంతమంది అనర్హులుగా గుర్తించారో ఇప్పటికీ ప్రకటించలేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కట్టిన డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేయాలని, గతంలో గుర్తించిన 105 మందికి అందించాలని, మిగతా వాటిని అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కట్టిన డబల్ బెడ్ రూమ్ ల వద్ద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అన్నదాస్ గణేష్, జిందం కమలాకర్, సామల కవిత, సందుపట్ల పోచమలు తదితరులు పాల్గొన్నారు.



