Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంనైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉపాధికి బాటలు

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉపాధికి బాటలు

- Advertisement -

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సింగరేణిలో శిక్షణా కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-రామగిరి

వృత్తి నైపుణ్యాలను పెంపొందిం చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం-3లోని అడ్రియాల ప్రాజెక్ట్‌ ఏరియాలో గల ఎంవీటీసీలో సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. రామగుండం-3 ఏరియా జనరల్‌ మేనేజర్‌ నరేంద్ర సుధాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీయువకుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ వివిధ ఏరియాల్లో ఇలాంటి శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా సుమారు 38 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మంచి ఉపాధి పొందాలని సూచించారు. శిక్షణ పొందే అభ్యర్థులు కేవలం సర్టిఫికెట్‌ కోసం కాకుండా, పూర్తిస్థాయిలో శిక్షణ పొంది నైపుణ్యాన్ని సాధించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని, త్వరలో రాష్ట్రంలో నైపుణ్య సర్వే నిర్వహించి, నిరుద్యోగుల నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఒక కళాశాలగా అభివృద్ధి చేసి, ఇక్కడి నుంచే నియామకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ జె.అరుణశ్రీ, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకుర్‌, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -