వార్డెన్ కొత్త నాటకం!
ఒక్కడే… మూడు రూపాలు!
ప్రలోభాలు.. బెదిరింపులు.. ‘టూర్’ ప్లాన్!
మళ్లీ ప్రత్యక్షమైన ‘గుర్తుతెలియని’ వ్యక్తులు
విచారణ చేపట్టిన అధికారులు
నవతెలంగాణ – భూపాలపల్లి
హాస్టల్లో అగంతకుడు మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. అంతేకాకుండా అవార్డెన్ కూడా కొత్త నాటకానికి తెరలేపింది. విద్యార్థినులకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ వార్డెన్, తన బాధ్యతను గాలికి వదిలేసి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆడుతున్న నాటకాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అర్థరాత్రి వేళ హాస్టల్‌లోకి ప్రవేశించిన అగంతకుడిని కాపాడేందుకు ఆమె ఆడుతున్న ‘రిలేషన్ షిప్’ డ్రామాలు విస్తుగొలుపుతున్నాయి. నవతెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ప్రత్యేక కథనం సంచలనంగా మారింది.
ఒక్కడే..మూడు రూపాలు!
అసలు ఆ అగంతకుడు ఎవరు? అనే ప్రశ్నకు వార్డెన్ ఇచ్చే సమాధానాలు విడ్డూరంగా ఉన్నాయి. మొదట ఘటన జరిగిన రాత్రి విద్యార్థినులతో మాట్లాడుతూ.. అతను తన ‘మిత్రుడని’, తనకు అనారోగ్యంగా ఉంటే పాల ప్యాకెట్, టాబ్లెట్లు ఇవ్వడానికి వచ్చాడని చెప్పారు. తర్వాత సోమవారం విలేకరులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించగా వచ్చిన వ్యక్తి తన ‘భర్త’ అని ఒకసారి, ‘కొడుకు’ అని మరోసారి మాట మారుస్తూ బుకాయించే ప్రయత్నం చేశారు. ఒక్క వ్యక్తిని భర్తగా, కొడుకుగా, మిత్రుడిగా చిత్రీకరిస్తూ ఆమె ఆడుతున్న ఈ దోబూచులాట వెనుక అసలు రహస్యం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రలోభాలు.. బెదిరింపులు.. ‘టూర్’ ప్లాన్!
పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులను దారికి తెచ్చుకునేందుకు వార్డెన్ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. రాత్రంతా విద్యార్థినుల ముందు ఏడుస్తూ తనను కాపాడాలని బ్రతిమాలడం. మేము పొరపాటుపడి 100కు ఫోన్ చేశామని అధికారులకు చెప్పాలి అంటూ విద్యార్థినులను మందలించడం. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కొంతమంది విద్యార్థినులకు ఉచితంగా టూర్ తీసుకెళ్తానని ఆశ చూపడం, మరికొందరికి నగదు పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మళ్లీ ప్రత్యక్షమైన ‘గుర్తుతెలియని’ వ్యక్తులు
ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అగంతకుడి ఆచూకీ తెలవకుండా చేయడంతో పాటు కారులో తీసుకెళ్లాం అంతేకాకుండా “మేమే నిన్ను కూడా మీ ఉద్యోగానికి భద్రత కల్పించాం. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం” అంటూ వారు వార్డెన్‌ను బెదిరిస్తూనే, ఆర్థికంగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ అగంతకుల వెనుక ఏదో పెద్ద ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ చేపట్టిన అధికారులు…
నవతెలంగాణలో ప్రచురితమైన కథనం, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో (వార్డెన్ విద్యార్థినిని కొడుతున్న దృశ్యాలు) చూసిన విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థినుల భద్రతను పణంగా పెట్టిన వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. హాస్టల్ ప్రధాన రహదారి ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.



