దానికి భిన్నంగా రాయపోల్ చెట్లు నరికివేత
నవతెలంగాణ – రాయపోల్
ప్రజా ప్రతినిధులే చెట్లను నరికివేస్తే.. ప్రకృతిని కాపాడాల్సింది ఎవరు..? రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టారు. రాయపోల్ మండల కేంద్రంలో ప్రజలను ఆదర్శంగా నడిపించాల్సిన ప్రజా ప్రతినిధులే చెట్లను నరికివేయడంపై ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. పచ్చని చెట్లను నేలమట్టం చేయడం ప్రకృతి సమతుల్యతకు తీవ్ర ప్రమాదంగా మారుతోంది.
ఒకవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా చెట్ల నరికి వేయడం వల్ల పర్యావరణం క్రమంగా నాశనం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజా ప్రతినిధులే ఈ విధంగా వ్యవహరిస్తే, సామాన్య ప్రజలు ఎవరి మాట వినాలి..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పచ్చదనం పెంపొందించాల్సిన నాయకులు ఏళ్ల చెట్లను తొలగించడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
ప్రకృతి మనకు ఇచ్చిన సంపదను కాపాడకపోతే రాబోయే తరాలకు ఏమి మిగులుతుంది..? ప్రజా ప్రతినిధులు తమ స్వార్థాన్ని పక్కనబెట్టి పర్యావరణ పరిరక్షణకు నిజమైన నిబద్ధత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ప్రకృతి ప్రతీకారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



