Tuesday, December 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసాంస్కృతికంపై నియంతృత్వం!

సాంస్కృతికంపై నియంతృత్వం!

- Advertisement -

దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ ప్రత్యక్ష యాజమాన్యం కింద పనిచేస్తే కొన్ని స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి. ఇదే విధంగా మానవ వనరులను అభివృద్ధి చేయటానికి దేశంలో కొన్ని స్వయంప్రతిపత్తి కలిగిన కేంద్రాలున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అందులో ఒకటి. ఇది జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1954 మార్చి 12లో ఏర్పాటయింది.భారత దేశంలో రాజ్యాంగం గుర్తించిన ఇరవైరెండు భాషలతోపాటు అనేక ఇతర భాషల్లో సాహిత్యం నిరంతర స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది. ఆ సాహిత్యాన్ని ప్రోత్సహించటం కోసం, సాహిత్యంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పటం కోసం చాలా ఉన్నతమైన ఆశయాలతో ఆనాటి పెద్దలు కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారు.అది ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు దాన్ని నియంత్రించాలని ఏనాడూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. ఎందుకంటే దానికి స్వయంప్రతిపత్తి ఉంది కనుక. అది అనివార్యం కనుక. ఇటీవల ప్రకటించవల్సిన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు, తమతో సంప్రదించకుండా అవార్డులను ప్రకటించవద్దంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఒక నోట్‌ పంపింది.

సాహిత్య అకాడమీతో పాటు సంగీత నాటక అకాడెమీ, లలిత కళా అకాడెమీ, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలకు కూడా నోట్‌ పంపింది ప్రభుత్వం. దీన్ని బట్టి ఆ నాలుగు సంస్థల స్వయంప్రతిపత్తి గంగలో కలిసిపోయినట్టే లెక్క.అంటే ఇక మీదట కళా సాంస్కృతిక రంగాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వాన్ని అమలు చేయబోతోంది. సాహిత్య అకాడెమీ అవార్డులిస్తున్న సరళి మీద కొందరికి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. పురస్కారాల ఎంపికలో కోటరీల జోక్యాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.అకాడెమీ తీరు మీద ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీన్ని సాకుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నాలుగు స్వయంప్రతిపత్తి కలిగిన సాంస్కృతిక కేంద్రాలను అదుపులోకి తీసుకోవాలని చూడడం అప్రజాస్వామికం. సాహిత్య అకాడమీ ప్రభుత్వం అదుపాజ్ఞలలో ఉండకూడదని రచయితలు ఎందుకు అంటున్నారంటే -ప్రభుత్వం అంటే దాన్ని చేజిక్కించున్న పార్టీ అని ఈ దేశంలో కొత్తగా చెప్పవలసిన పనిలేదు.

పార్టీ నమ్మకాలను, సిద్ధాంతాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పక్కన పెట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటం మీద దృష్టిని కేంద్రీకరించాలి. కానీ ఇప్పుడు మనదేశంలో అలా జరుగుతుందా? లేదు కాబట్టే రచయితలు ఆందోళన చెందుతున్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని సిద్ధాంతాలను బలవంతంగా రుద్దుతూ పోతే అకాడెమీ అస్తిత్వం దెబ్బ తింటుంది. సాహిత్య కళారంగాల స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడుతుంది. దాని వల్ల జరిగే నష్టం కేవలం వర్తమాన సమాజనికే కాదు భవిష్యత్తులో కూడా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అనాదిగా సాహిత్య కళారంగాలలో రెండు స్పష్టమైన వర్గాలు కొనసాగుతున్నాయి.ఒకటి ప్రజల వైపు నిలబడితే రెండోది పాలకుల వైపు నిలబడుతుంది. ఈ రెంటికీ నడుమ వైరుధ్యం ఉంటుంది. ఘర్షణ ఉంటుంది. వీటిని సాహిత్య కళారంగాలు సృజనాత్మకంగా వ్యక్తీకరిస్తాయి.

ప్రభుత్వ నియంత్రణలోకి పోయిన తరువాత అకాడెమీలో ప్రజాస్వామిక లక్షణం బతికే ఉంటుందా? ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో చేసే రచనలను వారు ఆదరిస్తారా?అకాడెమీ పనిచేసేదే భావజాల రంగం మీద.సాహిత్యం ద్వారా ప్రజల నైతికప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉన్నతమైన మానవ విలువలను స్థాపించటం కోసం కృషి చేయటం దాని కర్తవ్యం. అయితే సాహిత్యంలో అనేక రకాల భావ ధారలు వ్యక్తమవుతుంటాయి. భిన్నమైన ఆలోచనలు సంఘర్షిస్తాయి. ఎటువంటి ఆలోచన అయినా సమాజాన్ని ముందుకు నడిపించటానికే పనిచేయాలి కానీ వెనుకకు నడిపించటానికి కాదు. అలాంటి పురోగామి ఆలోచనలు వ్యక్తం చేసిన రచనను ప్రోత్సహించడం సామాజిక కోణంలో అత్యవసరం. హేతుబద్ధంగా ఆలోచించి ప్రోది చేసిన రచనలు సమాజానికి ఉపయోగపడతాయి. ఇప్పటిదాకా ప్రజల బతుకులను, విలువైన వారి అనుభవాలను,వారి చరిత్రను నమోదు చేసిన రచనలకు పురస్కారాలు దక్కేవి. ఇక మీదట ప్రభుత్వాన్ని పొగిడే వాళ్లకు, ప్రజలను నీచంగా చిత్రించేవాళ్లకు అవార్డులు వస్తాయి.

కులమత విద్వేషాలు రగిలించే రచనలకు సన్మానాలు లభిస్తాయి.విద్వేషాలను యథేచ్ఛగా రెచ్చ గొడుతున్న వాళ్లకు పిలిచి పదవులిస్తున్న సంగతి మనకళ్లముందున్న సత్యమే కదా!
ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలలో కేంద్రం తన భావజాలం కలిగిన వాళ్ళతో నింపేసింది.నెహ్రూ కాలం నుంచి నిన్నటివరకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడుస్తున్న సంస్థలలో తిరోగమన పోకడలను ప్రారంభించింది. ఒకవైపు పాఠ్యప్రణాళికలలో ఇప్పటి వరకు ఉన్న చరిత్ర పాఠాలను తీసివేస్తున్నారు. మరోవైపు అభూత కల్పనలతో కూడిన అవాస్తవాల్ని చరిత్రగా బోధించే ఏర్పాట్లు చకచకా ప్రారంభించారు. ప్రజాస్వామం లాంటి కీలకమైన పాఠాలనే సిలబస్‌ నుంచి తొలగించారంటే కొత్తగా వచ్చిన వాళ్ల భావజాలం ఏమిటో అర్థమవుతూనే ఉంది. వాటి విషఫలాలు భవిష్యత్తరాలను నిర్వీర్యం చేస్తాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ దురుద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలను ప్రజాస్వామికవాదులందరు ముక్తకంఠంతో ఖండించాలి.

తోకల రాజేశం, 9676761415

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -