నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రధాన సమస్య పర్యావరణం. జీవం పుట్టి పెరిగి, మనుగడ సాగించాలి అంటే అనుకూలంగా ఉండే పర్యావరణ వాతావరణం ఉండాలి. భూమి మీద పర్యావరణమేప్రధానమైనది. ఒకప్పుడు ప్రకృతిదే పై చేయిగా ఉండి, తొలి మానవులకు పర్యావరణంతో ఎక్కువ సంబంధం ఉండేది. పెట్టుబడి సమాజం ఏర్పడిన తర్వాత దాని వికాసం ప్రకృతి విధ్వంసంతోనే మొదలైంది. అది నేడు జీవ,మానవ మనుగడకే పెను ప్రమాదంగా తయారైంది. మునుముందు కనీసం పీల్చుకోవటానికి ఆక్సిజన్ లభించని పరిస్థితి నేడు పొంచి ఉంది. ఢిల్లీ వాసులు ఈ పరిస్థితిని నేడు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆరావళి పర్వతాలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై ప్రజలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై తమ నిరసనను తెలుపుతున్నారు. భూమి ఉపరితలం నుంచి వందమీటర్లు లేదా అంతకుమించి ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్నవి ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
దీంతో బడా బాబులైన ఆదాని, అంబానీ సాగించే మైనింగ్ ప్రక్రియకు చట్టబద్ధత లభించింది. ఆరావళి పర్వత శ్రేణులలో తొంభై శాతం గుట్టలు వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. దీంతో తొంభై శాతం పర్వతశ్రేణులు మైనింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే ఉత్తర భారతం ఎడారిగా మారిపోతుంది. పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. దీన్ని అడ్డుకో వాల్సిన బాధ్యత నేడు ఈ దేశ ప్రజలపై ఉంది. ఆరావళి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ముడత పర్వతాలలో ఒకటిగా భూగోళశాస్త్రం గుర్తించింది. ఇవి పశ్చిమ భారతంలోని రాజస్థాన్ నుంచి హర్యానా, ఢిల్లీ, గుజరాత్ వరకు సుమారు ఏడువందల కిలోమీటర్లు పొడవునా వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాలలో కొన్ని ఉత్తర భారత నదులైన బనస్, లూనీ, సబర్మతి, సాహిబి, చరచ్, చంబల్, అహర్ లాంటి నదులు పుట్టి రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించి, ఎడారి, చిత్తడి నేలలకు నీటిని అందిస్తాయి. తాగునీరు, సాగునీరు కూడా అందిస్తూ ఇక్కడి ప్రజలకు జీవాధారంగా ఉన్నాయి.
చారిత్రకంగా ధార్ ఎడారి విస్తరించకుండా, ఇసుక తుఫానులను కూడా అడ్డుకుంటూ, గోడగా నిలుస్తున్నాయి. ప్రకృతి పరంగా ఎన్నో జీవ, జంతు, పక్షి జాతులకు ఆవాసంగా ఉంటూ, జీవవైవిద్యం కలిగి పర్యావరణాన్ని సంరక్షిస్తున్నాయి. అలాగే ఉత్తర భారతావనికి సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదపడుతూ వేల సంవత్సరాలుగా ఈ పర్వతాలు ఉత్తర భారతంలో వాతావరణం, నీటి లభ్యత, నేల స్వభావం మీద ప్రభావం చూపుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నాయి ఈ ప్రాంతంలోని రాళ్లు, మట్టి, అడవులు, వర్షపు నీటిని నేలలోకి చొరబడి, నిలువ ఉండేలా చేస్తూ, భూగర్భ జలాల పునరుత్పత్తికి సహాయపడుతూ, ఇక్కడి సహజ జీవ ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తున్నాయి. నేడు ఢిల్లీ, ఉత్తర భారతంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది.ఈ తరుణంలో ఆరావళి పర్వతాలలో మైనింగ్ జరిగితే, ఢిల్లీ వాసులకు పీల్చుకోవటానికి గాలి కూడా దొరకదు. ఈ ప్రాంతంలో పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ఢిల్లీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఆరావళి ఉత్తర భారతావనికి ప్రకృతి ప్రసాదించిన ‘ఊపిరితిత్తులు’ఈ పర్వతాలు లేకుంటే ఏం జరుగుతుందో ఊహించ డానికే కష్టంగా ఉంది.
అభివృద్ధి జరగాలి, ఎవరూ కాదనరు. కానీ అభివృద్ధి పేరుతో పర్యావరణ హననం జరగకూడదు. అభివృద్ధి అనేది పర్యావరణ పరిమితులకు లోబడి జరగాలి. అడవులు నరికి వేస్తూ, కొండలు, కోనలు తవ్వి వేస్తూ, గాలిని విషయంగా మారుస్తూ…’వికసిత్ భారత్’ అంటూ ఆకర్షణీయ నినాదాలిస్తే సరిపో తుందా? 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్పొరేట్ల సేవలో మునిగిపోయాడు. ఆదానీని ప్రపంచ కుబేరుడిని చేశాడు. మొత్తం దేశాన్ని ఆయనకు తాకట్టు పెట్టాడు. నేడు ఆరావళి పర్వత ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను తవ్వుకోవడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది మోడీ సర్కార్. ఇలా మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు తలొగ్గింది. ఇలా జాతి సంపదను బడా బాబులకు దోచిపెట్టేందుకు పనిచేయడం ఆందోళన కరం. ఇప్పటికే 2011-17ల మధ్య ఆరావళి పర్వతాల నుంచి 9.80 లక్షల టన్నుల ఖనిజ సంపద అక్రమంగా తరలించారని కాగ్ నివేదిక వెల్లడించింది.
పర్వతాల స్వరూపం మార్చకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న అమలు జరగటం లేదు. ‘ఒక చెట్టు అమ్మ పేరు మీద’ అంటూ నాటుతూ, మరోవైపు లక్షల చెట్లు నరికి వేస్తూ, పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నారు. ఈ చర్యకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. అడవులు, సరస్సులు ,నదులు, వన్య ప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించటం, అభివృద్ధి చేయటం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం ప్రతి పౌరుని ప్రాథమిక విధి… అని రాజ్యాంగంలోని 51 ( ఏ)(జి) ఆర్టికల్ చెబుతుంది. దీని ప్రకారం దేశంలో పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ఈ రాజ్యాంగ కర్తవ్యాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ఉత్తరాదిన ప్రారంభమైన ‘సేవ్ ఆరావళి’ఉద్యమం దక్షిణాదిలో కూడా విస్తరించాలి.
హర్యానాలోని గురు గ్రామ్ నుంచి రాజస్థాన్‌లోని ఉదయపూర్ వరకు పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ”ఆరావళి లేకపోతే జీవం లేదు”అంటూ ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఈ దేశం ఆదానిదో లేక మోడీదో కాదు. ఆరావళి పర్వతాలను నాశనం చేసే వినాశనకర విధానాలను ప్రజలు వ్యతిరేకించాలి. ఈ పర్వతాలు ఈ దేశ సహజ సిద్ధమైన వారసత్వ సంపద. రెండు బిలియన్ సంవత్సరాలుగా పర్యావరణానికి పెట్టని కోటగా ఉన్న ఆరావళిని కాపాడుకోవడం, భవిష్యత్ తరాలకు భద్రంగా అప్పగించటం, ‘సేవ్ ఆరావళి’ ఉద్యమానికి మద్దతు పలకటం మనందరి బాధ్యత. పర్యావరణం పరిరక్షణ ఒక ప్రజా ఉద్యమస్థాయికి చేరుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
షేక్.కరీముల్లా
9705450705



