Tuesday, December 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఏమున్నది గర్వకారణం?

ఏమున్నది గర్వకారణం?

- Advertisement -

మహాకుంభమేళ తొక్కిసలాటలతో ప్రారంభమైన ఈ ఏడాది అనేక ప్రమాదాలకు ‘కేంద్రం’గా నిలిచింది. ఎయిర్‌ఇండియా ప్రమాదం, పహల్గామ్‌ ఉగ్రదాడులు, ఇండిగో సంక్షోభం, రూపాయి పతనం, కార్మికుల జీవితాలకు మరణశాసనం రాసే లేబర్‌కోడ్స్‌, ఉపాధికి తూట్లు…నెత్తురోడిన అరణ్యాలు…ఇలా ఎన్నో ఈ ఏడాది మాయని గాయాలు. అన్నదాతల ఆత్మహత్యలు, గవర్నర్ల వివాదాలు, పేర్ల మార్పులు…చివరకు యుద్ధ వాతావరణపు అలజడి… ఇది 2025. ఇవి తప్ప దేశంలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం. కానీ, డిసెంబర్‌ 28న ఈ ఏడాదికి వీడ్కొలు పలుకుతూ మన ప్రధాని మన్‌కీ బాత్‌లో ”2025లో దేశం ఎన్నో ఘనతలు సాధించింది. ఆటల్లో గెలిచాం.. అంతరిక్షంలో మెరిశాం. దేశ ప్రజల్లో వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి రగిలింది. దాన్ని కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలి” అని జాతికి పిలుపునిచ్చారు. భావోద్వేగ భాషకు, ఆవేశం ఉట్టిపడే హావభావాలకు పెట్టింది పేరు మన ప్రధాని… సహజంగా గొంతు చించుకుని మాట్లా డే మోడీ ‘మన్‌కీ బాత్‌’ ప్రసంగాలలో మాత్రం చాలా మంద్రంగా మాట్లాడుతూ నాటకాన్ని రక్తి కట్టిస్తారు.

తాజా మన్‌కీ బాత్‌లో ”భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని, ఆసియా కప్‌ను గెలిస్తే…మహిళలు తొలిసారి ప్రపంచకప్‌ సాధిం చారు. మహిళల అంధుల జట్టు టీ-20 ప్రపంచ కప్‌ను గెల్చుకోని చరిత్ర సృష్టించారన్న” సంగతిని మాత్రమే గుర్తుచేశారు. కానీ, న్యాయం కోసం రోడ్డెక్కిన ఉన్నావ్‌ బాధితు రాలికి అండగా ఒక్కమాటా మాట్లాడలేదు. ప్రజలకు నిలదీయాలని ఉన్నా.. వారికెక్కడ అవకాశమిస్తారు. మీదంతా ‘వన్‌ వే ట్రాఫిక్‌’ విన్యాసం కదా! ‘ఏడాది ఆరంభంలో ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని’ పేర్కొన్న ప్రధాని ఆ కుంభమేళా మిగిల్చిన విషాదాన్ని మాత్రం మాట వరుసకైనా ప్రస్తావించలేదు. దేశంలో రోడ్లన్నీ ‘రుధిరదారులు’గా మారుతూ వేలాది మందిని మృత్యుకుహరానికి చేస్తున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇవి కాక, ఈ ఏడాది తొక్కిసలాటలలో వందలాదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వాటి నివారణకు తీసుకున్న చర్యల గురించి మాట్లాడలేదు. సున్నితమైన విషయాలెన్నో మన్‌కీ బాత్‌లో ప్రస్తావించి భావోద్వేగం చెందే ప్రధాని క్రిస్మస్‌ పండుగ రోజు క్రైస్తవులపై జరిగిన దాడి పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. మత ఘర్షణలు, దేశంలో విచక్షణారహిత ఎన్‌కౌంటర్లు, ఫెడరలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం చివరకు రాజ్యాంగంపై కూడా దాడుల జరుగుతున్నా దేశాధినేత మౌనానికి కారణమేంటి? ‘ఆత్మనిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోందని… ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని’ చెబుతున్న ప్రధాని ‘అన్నమో రామచంద్ర’ అంటున్న వారి గురించి ఒక్కమాట మాట్లాడరు. యూరియా అందక రైతులు పడ్డ కష్టాల గురించి కానీ, పొట్ట చేతపట్టుకుని అమెరికా పోయిన బడుగు జీవులను కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లతో సైనిక విమానాల్లో మూటల్లా కుక్కేసి అవమానకరంగా, అమానుషంగా తిప్పి పంపిన తీరునూ ప్రశ్నించలేదు. ట్రంప్‌ టారిఫ్‌ టెర్రరిజాన్ని ప్రకటించినా ‘మేరా భారత్‌ మహాన్‌’ అని ఉపన్యాసాలు దంచే మోడీ గొంతు కనీసం పెగల్లేదు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తున్నామనే మోడీ ప్రచార రంగును ‘రూపాయి’ బయటపెట్టింది.

జాతీయ భద్రత, క్రీడలు, సాంకేతిక ఆవిష్కరణలతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఈ ఏడాది భారతదేశం ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చారు ప్రధాని. కానీ, అదే సందర్భంలో ‘జాతీయ భద్రత’ విషయంలో ట్రంప్‌ జోక్యాన్ని ఏ వేదికలపైనా ఆయన ఖండించలేదు. అంతే కాదు ప్రభుత్వ నియంత్రణ, జాతీయ భద్రత, ప్రజల జీవనహక్కు వంటి మౌలిక అంశాలను ప్రశ్నార్థకంగా మార్చే ‘అణుశక్తి ప్రయివేటీకరణ బిల్లు’ను తీసుకురావడమంటే దేశభద్రతను పెట్టుబడికి అప్పగించడమే. శాస్త్ర సాంకేతికత, అంతరిక్ష రంగాల్లో మన దేశం ఈ ఏడాది భారీ ముందడుగని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) చేరుకున్న శుభాంశు శుక్లా రికార్డ్‌ గుర్తుచేశారు ప్రధాని. కానీ, మన దేశంలో శాస్త్రీయ ఆలోచనలను మాత్రం ఆయనెందుకో సహించలేరు.

కానీ, ఈ దేశ ప్రజలు ‘సర్‌’ పేరుతో ఓటర్లను తొలగిస్తున్న దుర్మార్గాన్ని, ప్రజాస్వామ్యానికి మూలమైన ఎన్నికల కమిషన్‌ ను నిర్వీర్యం చేస్తున్న తీరును, ‘ఓటుచోరీ’ని, ‘ఆపరేషన్‌ సింధూర్‌’ చుట్టూ అలుముకున్న రాజకీయాలను, కార్మికుల మెడపై వేలాడుతున్న ‘4 లేబర్‌ కోడ్స్‌’ను, కార్మికులను పొట్టన పెట్టుకున్న ‘సిగాచి’ని తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు. నిరుద్యోగ సేన పెరిగిపోతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ స్వాతంత్య్రానికి గీటురాయి అన్న మాటెత్తితే దేశద్రోహులన్న ముద్ర పడిపోతోంది. ఎమర్జెన్సీ విధించకుండానే అంతకన్నా భయంకరమైన నిరంకుశత్వం కొనసాగుతోంది. మన రాజ్యాంగం సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని రాసింది. కానీ కాలదోషం పట్టిన భావజాలాన్ని పట్టుకు వేలాడుతున్న తిరోగాములు నిత్యం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూనే వున్నారు. ప్రజాస్వామ్య దేశంలో పాలకుల మనసులో మాటలు ప్రజలు వినడమే కాదు. ప్రజల మనసులో మాటలు కూడా పాలకులు వినగలగాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -