మృదుల… ఓ సాధారణ కుటుంబంలో పుట్టారు. తండ్రి ప్రోత్సాహంతో సాహిత్య అధ్యయనం ప్రారంభించారు. తల్లి పెంపకంలో సామాజిక విలువలు అలవర్చుకున్నారు. స్వశక్తితో అధ్యాపకురాలిగా ఎదిగారు. యువత, మహిళలను పట్టి పీడుస్తున్న సామాజిక రుగ్మతలపై తన కలాన్ని ఎక్కుపెట్టారు. ఇటీవలె ‘రుధిరం నుండి క్షీరం దాకా’ అంటూ సమాజంలో నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో మన ముందుకు వచ్చిన ఆమె పరిచయం నేటి మానవిలో…
సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల గ్రామంలో పుట్టిన పోరెడ్డి (సిరికొండ) మృదుల వ్యవసాయం చేసుకొనే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, అనుభవజ్ఞులైన గురువుల మార్గదర్శకత్వంలో సాంప్రదాయం, ఆధునికత రెండూ కలగలిసిన భావజాలంతో ఆమె బాల్యం గడిచింది.
అధ్యాపకురాలిగా…
డిగ్రీలో సైన్స్ స్టూడెంట్ అయిన మృదుల బీఈడీ, ఎంఈడి, ఎంఏ సోషియాలజీ, ఎంఏ తెలుగు పూర్తి చేశారు. మధ్యలో ఎంఈడి పూర్తయిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా తన ప్రతిభతో అరడజను ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు.
సాహిత్యంతో పరిచయం
మృదుల తన తండ్రి ప్రభావంతో సాహిత్యంపై ఆసక్తిని పెంచుకున్నారు. చిన్నతనంలో మంచి మంచి సినిమాలు చూసేవారు. అలాగే తండ్రి ప్రోత్సాహంతో బాలభారతం, భక్తతుకారాం, తేనె మనసులు, మూగమనసులు వంటి సినిమాలు చూసి వాటిలోని పాటలు బాగా పాడేవారు. అప్పటి కవులు, రచయితలు రాసినటువంటి పాటలు, మాటలు, ఊరి గ్రంథాలయంలో చదివిన సాహిత్యం తెలియకుండానే ఆమెను సాహిత్యం వైపు అడుగులు వేయించింది. ఇక ఎంఏ తెలుగు చేయడంతో పూర్తిగా సాహితీ లోకంలోకి వచ్చేశారు. పోటీ పరీక్షల కోసం చలం, కొడవటి గంటి కుటుంబరావు , శ్రీశ్రీ, దాశరధి, వట్టికోట మొదలగు వారి పుస్తకాలను బాగా చదివేవారు. అధ్యాపకురాలిగా విద్యార్థులకు బోధించే క్రమంలో స్త్రీవాద పుస్తకాలైన నీలిమేఘాలు, విముక్త, స్త్రీ, స్వీట్ హౌమ్…. వంటి పుస్తకాలతో నిత్య సహచర్యం ఆమె సాహిత్యానికి మరింత పదును పెట్టింది.
మహిళా సమస్యలపై
మృదుల ఇప్పటి వరకు ‘మధుకవనం’ కవితా సంపుటి , రుధిరం నుండి క్షీరం దాకా, అవిభాజ్యం అనే స్త్రీవాద కవితా సంపుటాలు ముద్రించారు. ఇంకా వివిధ రకాల పరిశోధనా వ్యాసాలు, కథలు రాస్తూ వివిధ సాహితీ సమూహాలలో నిరంతరం చైతన్యంగా ఉంటున్నారు. సమాజంపై సాహిత్యం ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ప్రభావమే చూపుతుందని మృదుల బలంగా నమ్ముతారు. పుస్తకంలో ఉండే విజ్ఞానం ఎన్నో తరాలకు చేరవేసే సంపద అంటారు. బట్టలు శరీరాన్ని మాత్రమే కప్పుతాయి. చిరిగిపోయిన తర్వాత ఉపయోగపడవు. కానీ పుస్తకం కప్పి ఉన్న మన మెదడుని తరిగిపోని జ్ఞానంతో విచ్చుకునేలా చేస్తుందంటారు.
కవిత్వమే నేస్తంగా…
అధ్యాపకురాలిగా పని చేస్తూనే నిత్య విద్యార్ధినిగా నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలకు పూర్తి న్యాయం చేస్తున్నారు మృదుల. గురుకుల ఉద్యోగిగా కొన్నిసార్లు 36 గంటలు పని ఒత్తిడితో ఉన్నా కూడా ఎన్నోసార్లు రాత్రిళ్లలో కవితలు రాస్తూ పని ఒత్తిడి నుంచి బయటపడతారు. భర్త సహకారంతో ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేసుకుంటున్నారు.
చైతన్యం నింపుతూ…
లోతైన పరిశోధనా వ్యాసాలను రాయాలని, ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలుగా తయారైన డ్రగ్స్, మోసం, దోపిడీ , కుల వివక్ష, వరకట్నం, లైంగిక దాడులను నిరసించే రచనలు చేస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నారు. అలాగే అధ్యాపక వృత్తిలో మంచి సంతృప్తిని పొందుతూ భవిష్యత్ తరానికి అవసరమయ్యే యువతను తయారు చేస్తున్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే పదజాలంతో కథలు, వ్యాసాలు, వచన కవిత్వం వంటివి రాసేలా తన భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకున్నారు.
అమ్మ నుండే నేర్చుకున్నా..
మా కుటుంబంలో రచనలు చేసే వారు ఎవరూ లేరు. పుస్తకాలు చదివే క్రమంలోనే భావోద్వేగాలకులోనై మా అమ్మను, ఆవిడలో ఉన్న కష్టపడే తత్వాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నాకెంతో హార్డ్ వర్క్ చేయాలనిపించింది. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. సమాజం కోసం ఏదైనా ఉపయోగపడే పని చేయాలి అనేది అమ్మ నుండే నేర్చుకున్నాను.
- సలీమ



