రెండు ఏసీ బోగీలు అగ్నికి ఆహుతి
మంటల్లో చిక్కుకుని ఒకరు మృతి
యలమంచిలి: టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించి రెండు ఏసీ బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. బయటకు రాలేక ఒకరు మృతి చెందారు.సౌత్ సెంట్రల్ డిఆర్ఎం మోహిత్ సోనాకియా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు (18189)లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో యల మంచిలి రైల్వే స్టేషన్‌కు సమీపంలోకి వచ్చేసరికి బీ1, ఎం2 బోగీల్లో మంటలు వ్యాపించాయి. దీంతో, అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగారు. అదే సమయంలో పొగలు రావడం గమనించిన లోకో పైలెట్, గార్డ్ యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. మంటలు వ్యాపించిన రైలు బోగీలను లోకో పైలెట్లు రైలు నుంచి విడదీసి రైలును దూరం చేశారు. రైలులోని బి1 బోగీలో 76 మంది, ఎం2 బోగీలో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరు క్షేమంగా దిగిపోగా, బి1లో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సుందర్ చంద్రశేఖర్ (70) రైలు దిగలేక బోగీలో ఉండిపోయి మంటల్లో కాలిపోయి మృతి చెందారు.
రైలు బోగీలకు వ్యాపించిన మంటలను యలమంచిలి, నక్కపల్లి, అనకాపల్లి నుంచి నాలుగు అగ్నిమాపక వాహనాలు సుమారు నాలుగు గంటల పాటు కష్టపడి అదుపులోకి తీసుకొచ్చాయి. అనంతరం సుమారు తెల్లవారుజామున 5.30 గంటలు సమయంలో బి1, ఎం2 బోగీలను, వాటిలో ప్రయాణికులను అక్కడే వదిలేసి రైలు బయలుదేరి వెళ్లింది. ఆ కాలిన బోగీలను యలమంచిలి రైల్వే యార్డ్‌కు తరలించారు. ఈ రెండు బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో సామర్లకోట వరకు తరలించి, అక్కడ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌కు రెండు అదనపు బోగీలను అమర్చి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాట్లు చేసినట్లు డిఆర్ఎం తెలిపారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని డిఆర్ఎం తెలిపారు. రైల్వే క్లూస్ టీం, ఫొరెన్సిక్ టీం వారు రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కారణాలను వెల్లడిస్తామని డిఆర్ఎం తెలిపారు.
కదిలిన అనకాపల్లి జిల్లా యంత్రాంగం
రైలు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పి తుహిన్ సిన్హా తమ పరివారంతో అక్కడకు వచ్చి పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రయాణికులకు అల్పాహారం అందించి, వారిని బస్సుల్లో పంపించే ఏర్పాట్లు చేశారు. రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, అనకాపల్లి ఆర్‌డిఒ షేక్ అయేషా, యలమంచిలి తహశీల్దార్ వరహాలరావు యలమంచిలి సీఐ ధనుజయరావు, ఎస్ఐ సావిత్రి, రైల్వే అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.



