ములాఖాత్
నవతెలంగాణ : నయాఉదారవాద విధానాలు దేశానికి ఉపయోగమని చెబుతున్నారు. వాస్తవమెంత?
సాయిబాబు : 1991 నుంచి 2025 వరకు మూడున్నర దశాబ్దాల పాటు నయా ఉదారవాద విధానాలు అమలయ్యాయి. కేంద్రంలో ఏ కూటమి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ విధానాలు అమలు చేయటంలో పెద్దగా తేడా లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో దేశానికి బంధం ఏర్పడుద్దని చెప్పారు. ఎగుమతులు పెరుగుతాయనీ, వృద్ధిరేటు, పెట్టుబడులు, ఉద్యోగం, ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. అందుకే మన ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేశామని నమ్మబలికారు.
కార్మికులు, ప్రజలు, రైతులు తమ అనుభవంలో ఆ విధానాల ప్రతికూలతలను క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. పలు నివేదికలు అసమానతలు పెరుగుతున్నాయనే వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశం మనదని ఆక్స్ ఫామ్ నివేదిక చెప్పింది. ఒక్క శాతం అత్యంత ధనవంతుల దగ్గర 40 శాతం సంపద పోగుపడితే అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజల వద్ద ఆరు శాతమే సంపదుందని వెల్లడైతే.. ఆ విధానాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అదానీ, అంబానీలాంటి ఐదుగురి కుటుంబాల దగ్గర మొత్తం దేశ సంపదలు 22 శాతం ఉందనేది జగమెరిగిన సత్యం
అసమానతలు పెరిగాయని ఎలా చెబుతారు?
నయా ఉదారవాద విధానాల అమలుతో మౌలిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ఆత్మహత్యలు, ఆకలిచావులు తదితర సమస్యలను పరిష్కరించలేక పోయింది. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (డబ్ల్యూహెచ్‌ఐ) ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం ప్రపంచంలో 125 దేశాల్లో దిగువన 105వ స్థానంలో మనం ఉన్నాం. మనకంటే మెరుగ్గా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బర్మాలాంటి దేశాలున్నాయి. పాలకులు అమలు చేస్తున్న దివాళా కోరు ఆర్థిక విధానాలకు నిదర్శనమే ఇది. దేశంలో 50శాతానికిపైగా మహిళలు రక్తహీనతతో తదితర జబ్బులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.
22కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు నివేదికలు చెబుతుంటే ఆ విధానాలను సమర్థిస్తున్న వారికి ఈ సమాచారం దొరకకపోవటం విడ్డూరం. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా దెబ్బతిన్నది. 2003-24 లో 20 ఏండ్ల క్రితం కొత్తగా చేర్చబడిన విలువలు కార్మికుల వేతనాల వాటా 33శాతం ఉండేది. నేడు అది 22 శాతానికి దిగజారింది. అదే సమయంలో యజమాన్యాల లాభాల వాటా ఆ రోజు 15శాతం ఉంటే నేడు అది 51 శాతానికి పెరిగింది. వేతనాలు తగ్గి లాభాల వాటా పెరగటం అంటే కార్మికుల శ్రమదోపిడీ వేగంగా పెరిగిందని చెప్పక తప్పదు. ఉత్పత్తి ఉత్పాదకత లాభాలు ఒకవైపు పెరుగుతుంటే మరో ధృవంలో కార్మికుల కొనుగోలు శక్తి డిమాండ్ తగ్గి జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాల వేగం పెరిగిందనే విమర్శ ఉంది. నిజమేనా?
జ: నిజమే..మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నయా ఉదారవాద విధానాలను దూకుడుగా కొనసాగిస్తున్నారు. కార్పొరేట్, మతోన్మాదుల కూటమి ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు భారత ఆర్థిక వ్యవస్థను ధారాదత్తం చేస్తుంది. ఈ పుష్కర కాలంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు సుమారు రూ.ఐదు లక్షల కోట్ల విలువైన వాటాలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో పెట్టుబడిదారులకు అమ్మేసింది. నవరత్నాలు, మహారత్నాలు లాంటి ఆయిల్, విద్యుత్, స్టీల్, కోల్, ఖనిజాలు తదితర పరిశ్రమలన్నింటిలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో రూ. ఆరు లక్షల కోట్ల సేకరణ కోసం నేషనల్ హైవేస్, బొగ్గు గనులు, రైల్వే, కమ్యూనికేషన్, పవర్‌గిడ్లు, ఓడరేవులు, విమానాశ్ర యాలు కారుచౌకగా కార్పొరేట్లకు అప్పజెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కార్పొరేట్లు తీసుకున్న రుణాలను నిరర్ధక ఆస్తుల పేరుతో సుమారు రూ.16 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసింది. దేశంలో సహజ వనరులు, ప్రజాసంపదను లూటీ చేసేందుకు వీలుగా పార్లమెంట్‌లో మైన్స్ అడవులు, ఖనిజాలు తదితర చట్టాలన్నింటికీ సవరణలు చేసింది. ఈ విధానాలను వ్యతిరేకించే కార్మిక సంఘాలను అప్రజాస్వామికంగా అణిచేందుకు నియంతృత్వ పద్ధతులతో పరిపాలన కొనసాగిస్తుంది. కార్పొరేట్ల ఒత్తిడి మేరకు ఈ సంక్షోభ కాలంలో వాళ్ల లాభాలను రక్షించటానికి దేశ ప్రధాని మోడీ నడుం బిగించారు.
కార్మికుల ప్రయోజనం కోసమే లేబర్ కోడ్‌లు తెచ్చామంటుంది కదా?
అది పచ్చి అబద్ధం. తమకనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అది. ఉత్పత్తి ఖర్చును తగ్గించే పేరుతో కార్మికుల శ్రమను కొల్లగొట్టేందుకు 2019- 20 సంవత్సరాల్లో 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా చట్టాలు చేసింది. కాకపోతే కార్మికుల అసంతృప్తి ఆగ్రహంగా మారితే ప్రమాదమని భావించి కొంత వెనక్కి తగ్గినట్టు నటించింది. చివరకు 2025 నవంబర్ 21న నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటితో కార్మికులకు ఏ మాత్రం ప్రయోజనం లేదనీ, ప్రస్తుతం ఉన్న హక్కులను హరించి వేస్తాయనీ, కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లు మరిన్ని లాభాలు పోగేసుకునేందుకు కార్మికులను బానిసల్లా మార్చేందుకు ఈ లేబర్ కోడ్‌లు ఉద్దేశించబడ్డాయి.
వీటి అమలుతో ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కు, సమిష్టి బేరసారాలపై హక్కు, సమ్మె చేసే హక్కుపై తీవ్ర దాడి జరగనున్నది. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను హరించే అనేక నిబంధనలు ఈ లేబర్ కోడ్‌లో ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోనున్న కార్మిక శాఖ కార్మిక చట్టాలను ఏకపక్షంగా కేంద్రం లాగేసుకుంటుంది. ఈ లేబర్ కోడ్‌లు అమలైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించ బడుతుంది. అందువల్లనే కేరళ వామపక్ష ప్రభుత్వం పినరయ్ విజయన్ నాయకత్వంలో వీటిని అమలు చేయబోమని నిర్వద్వందంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను ఈ సమస్యపై కూడగట్టేందుకు డిసెంబర్ 19న కేరళ రాజధాని త్రివేండ్రంలో కార్మిక సదస్సును జరిపింది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వామపక్ష ఎంపీల చొరవతో ఇండియా బ్లాక్ పార్టీల ఎంపీలు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని నిరసన తెలిపారు.
అసమానతలు పెంచేలా మోడీ విధానాలు
ఐక్య సమరశీల పోరాటాలే కార్మికవర్గానికి శరణ్యం
సీఐటీయూ 18వ మహాసభలో పలు తీర్మానాలు
ఏ రాయి అయితేనేం పండ్లూడగొట్టేందుకు అన్నట్టు దేశంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా.. నయా ఉదారవాద విధానాలను అమలు చేయటంలో తేడా లేదు. కష్టజీవుల శ్రమను సంపన్నులకు దోచి పెట్టటంలో ఎవరికి వారే సాటి. సంపద పెంచేందుకు సరళీకృత ఆర్థిక విధానాలు తోడ్పడుతాయని నమ్మబలికిన పాలకులు…పెరిగిన అసమానతలకు కారణం చెప్పటం లేదు. దేశ సంపదంతా గుప్పెడు మందిగా ఉన్న పెట్టుబడిదారుల బొక్కసాల్లోకి ఎట్లా ప్రవహిస్తుందో వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ఒకటా, రెండా; వంద వేలు లక్షల కోట్ల పెట్టుబడి కొందరి దగ్గర పోగుపడుతుంటే..తినటానికి తిండి, ఉండటానికి ఇలు, కట్టుకోవటానికి బట్ట, రోగాలు రోప్పులొస్తే వైద్యం అందని వైనం, పిల్లలకు నాణ్యతగల విద్యనందించలేని ధైన్యం.. డిగ్రీలు పుచ్చుకునీ..చిప్పచేత పట్టుకుని, ఢిల్లీకి చేరినాము..దేహి దేహి అంటున్నామంటూ..నిరుద్యోగ యువత ఆవేదన..ఇవన్నీ..నాణానికి బొమ్మ బొరుసులా ఉన్నాయి.
కొందరికే సంపద.. మరెందరికో ఆకలి, దరిద్రం. ఇది భారత ముఖచిత్రం. ఈ చిత్రానికి మోడీ ప్రభుత్వం మతం ముసుగు తగిలించి, కులం కుళ్లును సెలేన్‌గా ఎక్కించి, భావోద్వేగాలతో చిచ్చు పెట్టి..పబ్బం గడుపుతున్నది. రక్తం రుచిమరిగిన మృగంలా పేదల కష్టాన్ని దోచుకునేందుకు అలవాటు పడ్డ బీజేపీ సర్కార్.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. వారి మెడకు ఉరేసింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పేదల గుండెలపై గునపం దింపింది. విద్యుత్ సంస్కరణ చట్టం, విత్తన బిల్లు ఇత్యాతి ప్రజావ్యతిరేక విధానాలతో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ సమయంలో ఈ నెల 31నుంచి 2026 జనవరి 4 వరకు సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్నతో ముఖాముఖి..
ప్రత్యామ్నాయం ఏటి?
నయా ఉదారవాద విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి స్థానంలో కార్మికులకు కనీస వేతనాలు, రైతాంగానికి మద్దతు ధరలు, వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ప్రజలందరికీ విద్యా, ఆరోగ్యం అందుబాటులోకి రావటం, ప్రతి కుటుంబానికి గృహవసతి, వలస కార్మికులకు ఆవాసం, భద్రత తదితర మౌలిక సమస్యలను పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానాలే సరైన పరిష్కారం. దీనికి నిరసనగా ఎలాంటి పిలుపులు లేకుండానే మరుసటి రోజే దేశ వ్యాప్తంగా వేలాది కేంద్రాల్లో కార్మికవర్గం ఫ్యాక్టరీల దగ్గర నోటిఫికేషన్ ప్రతులు దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
నవంబర్ 26న దేశంలో సుమారు 600 జిల్లాలు కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. డిసెంబర్ 8న దేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదికలే కోడ్‌ల రద్దు కోసం ఉద్యమించాయి. 2026 ఫిబ్రవరి 12 ప్రత్యక్ష సమ్మె పోరాటానికి సన్నద్ధమవుతున్నది. సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలు డిసెంబర్ 31నుంచి జనవరి 4వరకు విశాఖలో జరగనున్నాయి. రాబోయేకాలంలో కార్మిక ఐక్యతను నిర్మించేందుకు విశాల ఐక్య ఉద్యమాలు, కార్మిక, కర్షక సంఘీభావ మైత్రిని పెంపొందించటం లక్ష్యంగా సీఐటీయూ పోరాట పంథాను అవిష్కరించనున్నది.



