హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
‘ప్రజా సేవకుడు’ అనే పదానికి హైకోర్టు ఇచ్చిన వివరణ తప్పు
హర్షం వ్యక్తం చేసిన బాధితురాలు
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందంటూ వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉన్నావ్ లైంగికదాడి కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీర్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ యువతిని ఉద్యోగం ఇస్తానని ఇంటికి పిలిచి నాటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీర్ సింగ్ సెంగార్ లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదీ శిక్షను విధించిన విషయం విదితమే. అయితే ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మరోవైపు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఇద్దరు న్యాయవాదులు అంజలే పటేల్, పూజా శిల్ప్కర్, సీబీఐ వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
సోమవారం ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జెకె.మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అంశాలను ధర్మాసనం పరిశీలించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను నిలిపివేయడంతో పాటు నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌ను ఆదేశించింది. అలాగే డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీర్ సింగ్ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దని సూచించింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు.
సెంగార్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, ఎన్. హరిహరన్ వాదనలు వినిపిస్తూ సీబీఐ పిటిషన్‌ను వ్యతిరేకించారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) సెక్షన్ 5 కింద ‘ప్రజా సేవకుడు (పబ్లిక్ సర్వెంట్)’ అనే పదానికి హైకోర్టు ఇచ్చిన వివరణ తప్పుగా ఉందని, చివరికి చట్టాన్ని రూపొందించే వారిని మినహాయింపునకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ”చట్టపరమైన సమస్యను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఉత్తర్వును జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు అత్యుత్తమ న్యాయమూర్తులు. కానీ మనమందరం తప్పులు చేసే అవకాశం ఉంది. దయచేసి పోక్సో కింద ”పబ్లిక్ సర్వెంట్” అనే దానికి ఈ నిర్వచనాన్ని చూడండి. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ప్రభుత్వ సేవకుడిగా ఉంటాడని, కానీ శాసనసభ సభ్యుడు మినహాయించబడతారని మేము ఆందోళన చెందుతున్నాం” అని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది : బాధితురాలు
ఉన్నావ్ లైంగికదాడి కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ”ఈ నిర్ణయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుప్రీంకోర్టు నుంచి నాకు న్యాయం లభించింది. నేను మొదటి నుంచీ న్యాయం కోసం నా గొంతును వినిపిస్తున్నా. నేను ఏ కోర్టుపైనా ఆరోపణలు చేయను. నాకు అన్ని కోర్టులపై నమ్మకం ఉంది. కానీ సుప్రీంకోర్టు నాకు న్యాయం చేసింది. అలానే కొనసాగుతుంది” అని బాధితురాలు అన్నారు.



