ఫెడరలిజం స్ఫూర్తికి విఘాతం
అసమానతల పెరుగుదలకు దారి తీసే ప్రమాదం
కేంద్రం గుప్పెట్లో ఉన్నత విద్య
వీబీఎస్‌ఏ బిల్లుతో సమూల మార్పులు
మోడీ సర్కారు యోచన
మేధావులు, విద్యావేత్తల హెచ్చరిక
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంఘ్ సిద్ధాంతాన్ని భారత్‌పై బలవంతంగా రుద్దుతోంది. తమ సిద్ధాంతానికి అనుకూలంగా ఉండే విధానాలు, చట్టాలు తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా తీసుకొచ్చిందే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ (వీబీఎస్‌ఏ) బిల్లు-2025. ఈనెల 15న దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలిస్తున్నది. అయితే ఈ బిల్లు ద్వారా భారత ఉన్నత విద్యావ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకునే విధంగా సమూల మార్పులకు కేంద్రం సిద్ధమైందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) వంటి సంస్థలను రద్దు చేసి ఒకే అపెక్స్ సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఈ బిల్లు ద్వారా తీసుకొస్తున్నది. ఇది ఒక సరళీకరణ విధానం, స్వయం ప్రతిపత్తి అంటూ కేంద్రం ప్రచారం చేస్తున్నప్పటికీ.. మేధావులు మాత్రం మోడీ సర్కారు వేస్తున్న అడుగులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని కేంద్రీకరణ, నిధుల ఉపసంహరణ, అసమానతల పెరుగుదలకు దారి తీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. వీబీఎస్‌ఏ బిల్లు భారత ఉన్నత విద్యపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని అంటున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విశ్వ విద్యాలయాలు ప్రజాస్వామ్య, జాతీయ అభివృద్ధి దృక్కోణంతో నిర్మితమయ్యాయి. రాధాకృష్ణన్ కమిషన్, కొఠారి కమిషన్‌లు విద్యను ప్రజా బాధ్య తగా చూశాయి. యూజీసీ (1956) ద్వారా నియంత్రణతో పాటు నిధుల బాధ్యతను కూడా ప్రభుత్వం భరించింది. ఇదే విధానం దశాబ్దాలపాటు ఉన్న విద్యకు ఆధారంగా నిలిచింది. కానీ 1980ల తర్వాత క్రమంగా ఆ విధానం మారిపోయింది. సామర్థ్యం, పనితీరు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ప్రయివేటీకరణ వంటి భావనలు బలపడ్డాయి. న్యాక్ వంటి అంచనా వ్యవస్థలు ముందుకొచ్చాయి. 2000లో బిర్లా- అంబానీ నివేదిక విద్యను ‘ఇండ స్ట్రీ’గా చూడాలన్న ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. ఆ నివేదిక అమలు కాకపోయినా.. దాని తత్వం విధానాల్లో కొనసాగిందని మేధావులు గుర్తు చేస్తున్నారు.
ఎన్‌ఈపీ తర్వాత వీబీఎస్‌ఏతో…
మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)-2020 ఈ ధోరణిని మరింత బలోపేతం చేసింది. ఒకే నియంత్రణ వ్యవస్థ, ఫలితాల ఆధారిత మూల్యాంకనం, పరిమిత ప్రభుత్వ పాత్ర, నాలుగేండ్ల డిగ్రీ, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్, ర్యాంకింగ్స్.. ఇవన్నీ ఇదే దిశలోని చర్యలుగా మేధావులు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వీబీఎస్‌ఏ బిల్లు వచ్చింది. ఈ బిల్లు ద్వారా యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈలను రద్దు చేసి ఒకే అపెక్స్ సంస్థ వీబీఎస్‌ఏను ఏర్పాటు చేయడం, నియంత్రణ, అక్రిడిటేషన్, అకడమిక్ ప్రమాణాలను వేర్వేరు కౌన్సిళ్లకు అప్పగించడం, నిధుల బాధ్యతను పూర్తిగా చట్టబద్ధ వ్యవస్థ నుంచి తొలగించడం వంటి కీలక మార్పులు జరగనున్నాయి. యూజీసీలా నిధులు ఇవ్వాల్సిన చట్టబద్ధ బాధ్యత వీబీఎస్‌ఏకు ఉండదు. నిధులు ప్రభుత్వ పథకాల ద్వారా, వార్షిక బడ్జెట్ ప్రాధాన్యతలపై ఆధారపడి వస్తాయి. దీంతో విశ్వ విద్యాలయాలు ఫీజులు, రుణాలు, ప్రయివేటు భాగస్వామ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తీవ్రంగా నష్టపోతాయని విమర్శకులు వాదిస్తున్నారు.
బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలి : విద్యావేత్తలు
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. వీబీఎస్‌ఏ అనే కొత్త ఉన్నత విద్యా కమిషన్‌పై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త కమిషన్ ద్వారా ప్రభుత్వం ఉన్నత విద్యా వ్యవస్థపై మరింత నియంత్రణను సాధిస్తుందని అంటున్నారు. యూజీసీని భర్తీ చేసే ఈ కమిషన్‌లో విద్యావేత్తలు తక్కువగా, బ్యూరోక్రాట్లు (ప్రభుత్వ ఉన్నతాధికారులు) ఎక్కువ సంఖ్యలో ఉంటారనీ, వారి ఆధిపత్యమే అధికంగా ఉంటుందని చెప్తున్నారు. కమిషన్ పనితీరు సరిగ్గా లేదని ప్రభుత్వం భావిస్తే దాని ఆదేశాలను రద్దు చేయగలదనీ, చైర్మెన్, సభ్యులను తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికే ఉంటుందని విద్యావేత్తలు వివరిస్తున్నారు. ఇక నిధుల పంపిణీ విద్యా శాఖ చేతుల్లో ఉంటుందనీ, ఇలాంటి విధానాలతో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బ తింటుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
”ప్రతి విషయం పైనా ప్రభుత్వంతో సంప్రదించాల్సి వస్తే కమిషన్ స్వతంత్ర సంస్థగా పనిచేయలేదు” అని యూజీసీ మాజీ సెక్రెటరీ ఆర్.కె చౌహాన్ అభిప్రాయపడ్డారు. యూజీసీతో పోలిస్తే ఈ బిల్లులో ప్రభుత్వానికి ఎక్కువ ప్రాతినిథ్యం, ఎక్కువ నియంత్రణ ఉన్నదని ఎస్‌ఆర్‌సీసీ ప్రొఫెసర్ సంజరు బోహిదార్ తెలిపారు. బ్యూరోక్రాట్లు అకడమిక్ సమస్యలను నిర్లక్ష్యంగా చూస్తారనీ, నిధులపై ప్రభుత్వ నియంత్రణ పెరగడం వల్ల విద్యాసంస్థల స్వతంత్రత ప్రమాదంలో పడుతుందని విద్యావేత్తలు రాజేశ్ ఝా, అభా దేవ్ హబీబ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విద్యాలోకం ఏకమవ్వాలని అంటున్నారు. లేకపోతే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసినట్టే.. ఉన్నత విద్యను కూడా మోడీ సర్కారు తన చేతుల్లో పెట్టుకుంటుందని హెచ్చరిస్తున్నారు.
అసమానతలు పెరిగే ప్రమాదం
ఇక ప్రభుత్వం చెప్తున్న ‘స్వయం ప్రతిపత్తి’ కూడా షరతులతో కూడుకున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విధానంతో మంచి వనరులు ఉన్న నగరాల్లోని కళాశాలలు లాభపడతాయి. కానీ సామాజికంగా కీలకమైన, వెనుకబడిన వర్గాలకు సేవలందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఈ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉన్నదని మేధావులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పే ఈ స్వయం ప్రతిపత్తి సమానత్వాన్ని కాకుండా.. అసమానతలను పెంచే సాధనంగా మారవచ్చని అంటున్నారు. అయితే ప్రస్తుత రూపంలో ఉన్న వీబీఎస్‌ఏ బిల్లు ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన, న్యాయమైన సమాధానాలను కలిగి లేదని చెప్తున్నారు.
కేంద్రానికి విస్తృత అధికారాలు
ఇక మరొక ముఖ్యమైన విషయం విద్య కేంద్రీకరణ. వాస్తవానికి విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. అయితే వీబీఎస్‌ఏ బిల్లు కేంద్రానికి విస్తృత అధికారాలు ఇస్తుంది. ఇక రాష్ట్రాల పాత్ర సలహా స్థాయికి పరిమితం అవుతుంది. ఇది ఫెడరలిజాన్ని బలహీనపరుస్తుందని విద్యావేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు జాతీయ ప్రమాణాలను చేరుకోలేక మరింత వెనుకబడతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.



