హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన ఫలితాన్ని రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సోమవారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళికి తిలోదకాలు ఇచ్చారని తెలిపారు. ఏడు క్రిమినల్ కేసులున్నాయంటూ ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పారేగాని వాటి వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల నిబంధనల ప్రకారం నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు. నేర చరిత్ర వివరాలను అసమగ్రంగా వెల్లడించారని తెలిపారు. నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించకపోవడం చట్ట వ్యతిరేకమని వివరించారు. ఎన్నికల ప్రచార ఖర్చులను రోజువారీ వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తుతో పెయిడ్ న్యూస్ ఖర్చు రూ.2.30 లక్షలను ఎన్నికల ఖర్చులో చూపలేదని తెలిపారు. కొండాపూర్‌లో మున్నూరుకాపు కుల సంఘం సమావేశంలో నవీన్ యాదవ్ ఫొటోలు, పార్టీ జెండాలను ప్రదర్శించారని వివరించారు. కాబట్టి ఈ సభకు అయిన ఖర్చును ఎన్నికల ఖర్చులో జమ చూపాలని తెలిపారు. సీఎం సినీ కార్మికులకు హామీ ఇవ్వడం ఎన్నికల నిబంధన ఉల్లంఘనేనని పేర్కొన్నారు. సినీ కార్మికులకు భూమి కేటాయిస్తామన్న సీఎం హామీ ఎన్నికల నిబంధనలను కాలరాయడమేనని తెలిపారు. మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారనీ, నవీన్ యాదవ్ కత్తితో ఊరేగారని వివరించారు. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలంటూ మాగంటి సునీత వేసిన పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
యావజ్జీవ శిక్ష రద్దు
వరకట్న వేధింపుల కారణంగా మహిళ ఆత్మహత్య చేసుకుందంటూ వికారాబాద్ కోర్టు 2018లో ఐదుగురికి విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. మెదక్ జిల్లా మునిపల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ 2011లో రూ.రెండు లక్షలు అదనపు కట్నం చెల్లించాలని భర్త, అత్తమామ, ఆడపడచు వేధించారంటూ పోలీసు కేసు నమోదైంది. వికారాబాద్ కోర్టు లక్ష్మి భర్త, అత్త మామలు, అడపడుచులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ వి రామకృష్ణారెడ్డి డివిజన్ బెంచ్ విచారించి పై విధంగా తీర్పు చెప్పింది. ఆత్మహత్యకు ముందు కట్న వేధింపుల అభియోగాలకు ఆధారాలు లేవని చెప్పింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా అందలేదని తెలిపింది.
ప్రయివేట్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోండి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారంలోని భూదాన్ భూమి అక్రమ బదిలీపై ప్రయివేట్ ఫిర్యాదును చట్ట ప్రకారం పరిష్కరించాలని మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. నాగారంలోని సర్వే నెంబర్ 181లో 50 ఎకరాల భూదాన్ భూమిని అక్రమంగా బదిలీ చేశారని అసద్ హుస్సేన్ చేసిన ప్రయివేట్ ఫిర్యాదును కింది కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ అసద్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ కె సుజన సోమవారం విచారించారు. అప్పుడు రెవెన్యూ ముఖ్యకార్యదర్శిగా, భూదాన్ యజ్ఞబోర్డు అధికారిగా చేసిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ఇతర అధికారులపై ప్రయివేట్ ఫిర్యాదును తిరిగి పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం వెలువరించాలని మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



