స్పెషల్ మెన్షన్‌లో పలు సమస్యల ప్రస్తావన
ఇద్దరు మాజీ సభ్యుల మృతికి సంతాపం
2026 జనవరి 2కు సభ వాయిదా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనమండలి శీతాకాల సమావేశాల మొదటి రోజు సభ 40 నిమిషాలే నడిచింది. సోమవారం ఉదయం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్‌లకు నివాళులు అర్పించింది. మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాప తీర్మానం చదివి వినిపించారు. అనంతరం స్పెషల్ మెన్షన్‌లో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. వివిధ సమస్యలపై పిటిషన్లను సమర్పించారు. ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఫార్మా కంపెనీలకు అనుకూలంగా మార్చుతున్నారనీ, వెంటనే అలైన్ మెంట్ మార్పుపై ఖచ్చితమైన విధివిధానాలు ఉండాలని నెల్లికంటి సత్యం విజ్ఞప్తి చేశారు. కొత్త మండలాలను రాజీకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రస్తావించారు. సీఎం ఇటీవల శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని కోరారు. సభ్యులు మధుసూధనాచారి మాట్లాడుతూ ఓడేడు వరంగల్ బ్రిడ్జి పనులు 70 శాతం పూర్తయ్యాయనీ, వెంటనే మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. క్రిఫ్టో కరెన్సీ మాయలో పడి కరీంనగర్ జిల్లాలో అనేక మంది రోడ్డున పడ్డారని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరాల అదుపుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని యూనివర్సీటీల్లో ఖాళీగా ఉన్న 1,120 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలనీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేరళ తరహా పాలసీ తీసుకురావాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విజ్ఞప్తి చేశారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి చేయాలని సభ్యులు బసవరాజు సారయ్య, పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆర్డీవో, సబ్ రిజిస్త్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అంజిరెడ్డి కోరారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకున్న. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్ధీన్, కొండా సురేఖ, గడ్డం వివేక్‌లు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మరణించిన రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి సభా పక్షాన సంతాపం తెలిపే అవకాశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కోరారు. సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం తెలిపే సంప్రదాయం ఉంటుందనీ, కానీ అందెశ్రీ తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావింతం చేశారన్నారు. ఆయన ఈ సభలో సభ్యులు కాకపోయినా విశేషమైన సందర్భంగా భావించి సభలో ఆయనకు సంతాపం తెలిపే అవకాశం పరిశీలించాలని సూచన చేశారు. ఇందుకు మండలి చైర్మెన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం సభను జనవరి 2కు వాయిదా వేశారు.
మండలి 40 నిమిషాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



