నవతెలంగాణ హైదరాబాద్: జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. 2026 నుంచి క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ సంస్థలు అప్డేట్ చేస్తుండగా.. కొత్త ఏడాది నుంచి వారం రోజులకు ఒకసారి ఆ పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ విషయంలో మరింత పారదర్శకత ఉంటుందని, సులువుగా రుణాలు పొందేందుకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ చెబుతోంది. దీని వల్ల మోసపూరితంగా లోన్లు పొందేవారికి చెక్ పడుతుందని అంటోంది.
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం వాటిని అరికట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్‌లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. సిమ్ బైండింగ్, వెరిఫికేషన్ చేసాకే యాప్స్ వాడేలా మార్పులు చేయాలని వాట్సప్, టెలిగ్రాం, స్నాప్ చాట్ లాంటి యాప్స్‌ను కేంద్రం ఆదేశించింది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు.
న్యూఇయర్ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు జరిగే అవకాశముంది. 2026 నుంచి ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాలను పెంచడానికి సిద్దమవుతున్నాయి. కొత్త ఏడాదిలో పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి.



