– మొత్తం జనాభా 20,040
– ఓటర్లు 16,724
– ఓటర్ల జాబితా తయారీ పనిలో ఎన్నికల సిబ్బంది
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాల్టీ ఎన్నికలకు పచ్చజెండా ఊపడం తో ఎన్నికల సంఘం ఏర్పాట్లలో వేగం పెంచింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో మండల కేంద్రంగా ఉన్న అశ్వారావుపేట మున్సిపాల్టీ కి తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
విశ్వసనీయ ప్రాథమిక సమాచారం మేరకు అశ్వారావుపేట,గుర్రాల చెరువు,పేరాయి గూడెం పంచాయితీలను కలుపుతూ 2025 జనవరిలో అశ్వారావుపేట ను నూతన మున్సిపాల్టీ గా ప్రకటించారు.
2011 జనగణన ప్రకారం ఇక్కడ మొత్తం జనాభా 20,040 మంది. వీటిని 22 వార్డులు గా డీలిమిటేషన్ చేశారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే గిరిజనులు 2,457, దళితులు 3,310, ఇతరులు 14,273 మంది ఉన్నారు. 22 వార్డులకు గాను మొత్తం 16,724 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా తుది రూపుదిద్దే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఓటర్ల జాబితా ఖరారైన అనంతరం వార్డు స్థాయి, అలాగే చైర్మన్ పదవికి రిజర్వేషన్లు కేటాయించనుండటంతో ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందన్న అంశంపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తొలి ఎన్నిక కావడంతో అశ్వారావుపేట మున్సిపాల్టీ రాజకీయంగా కీలకంగా మారనుంది.



