న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలంటే కేక్ ఉండాల్సింది. అందుకే ఆ రోజు కేకులకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. సాధారంగా కేక్ కావాలంటే బేకరికి పరుగులుపెట్టాల్సిందే. అయితే బేకరీలలోనే కాకుండా రుచికరమైన కేకులను సులభంగా మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి కేకులను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
రాగి పిండితో
కావాల్సిన పదార్ధాలు: రాగి పిండి- ముప్పావు కప్పు, గోధుమ పిండి – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – ముప్పావు కప్పు, బేకింగ్ పౌడర్ – టీ స్పూను, బేకింగ్ సోడా – అర టీ స్పూను, బెల్లం పొడి – కప్పు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు, కోకోపౌడర్ – మూడు టేబుల్ స్పూన్లు, వెన్న – 150 మి.లీ. (కరిగించినది), వెనిలా ఎసెన్స్ – టేబుల్ స్పూను, కొబ్బరి పాలు – కప్పు, ఉప్పు – చిటికెడు, పెరుగు – పావు కప్పు.
తయారీవిధానం: ముందుగా కేక్ ప్యాన్‌కి కొంచెం నెయ్యి రాసి.. దాన్ని మైక్రో ఒవేన్‌లో 170 డిగ్రీల వద్ద ఒక పావు గంట సేపు వేడి చేయాలి. ఒక గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడిని వేసుకుని మిక్స్ చేయాలి. తర్వాత ఈ పౌడర్‌ను రెండు సార్లు జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కప్పు బెల్లం పొడి, ముప్పావు కప్పు కొబ్బరి పాలు వేసి కలపాలి. తర్వాత అందులో కరిగించిన బటర్, పెరుగు వేసి.. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి.. వేడి చేసుకున్న ప్యాన్‌లో వేసుకుని.. సమానంగా చేసి.. మళ్ళీ అవెన్‌లో పెట్టి.. అరగంట ఉడికించాలి. తర్వాత పావుగంట చల్లారనిచ్చి ఒవేన్ నుంచి కేక్‌ను బయటకు తీయాలి. ఇప్పుడు ఒక పాత్రలో కొబ్బరి పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. మంట బాగా తగ్గించి మరిగించాలి. అనంతరం అందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలపాలి. తర్వాత దింపి చల్లారబెట్టాలి. అప్పుడు ఇది చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ.
డ్రై ఫ్రూట్‌తో
కావలసిన పదార్థాలు: మైదా- రెండు కప్పులు, చక్కెర – ఒకటిన్నర కప్పు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, బ్లాక్ కిస్‌మిస్, పచ్చి ఖర్జూర, టూటిఫ్రూటీ, అంజీర్, ఆప్రికాట్, చెర్రీ ముక్కలు – పావు కప్పు చొప్పున, ఆరెంజ్ జ్యూస్ – కప్పు, పాలు – అరకప్పు, నూనె – అరకప్పు, బేకింగ్ పౌడర్ – టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా – టీస్పూన్, ఉప్పు – చిటికెడు.
తయారీ విధానం: ఒక గిన్నెలో ఆరెంజ్ జ్యూస్ పోసి డ్రైఫ్రూట్స్‌ని గంటపాటు నానపెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు, నూనె, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత డ్రైఫ్రూట్ మిశ్రమం వేసి మరో రెండు నిమిషాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ మౌల్డ్‌లో వేసి పైనుంచి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి. ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద నలభై నిమిషాలపాటు బేక్ చేసుకుంటే డ్రైఫ్రూట్ కేక్ సిద్ధం. ఓవెన్ లేనివాళ్లు కుక్కర్లో పెట్టి సన్నటి మంటపై 50 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.
రవ్వతో
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ – కప్పు, పాలు – ఒకటిన్నర కప్పు, పెరుగు – కప్పు, చక్కెర – కప్పు, నూనె – అరకప్పు, బేకింగ్ పౌడర్ – టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీస్పూన్, టూటీఫ్రూటీ – పావుకప్పు.
తయారీ విధానం : ముందుగా రవ్వను మిక్సీలో వేసి పొడి చేసు కోవాలి. ఒక గిన్నెలో చక్కెర, పెరుగు వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత కప్పు పాలు, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రవ్వ పొడి వేసి బాగా కలిపి.. పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మిగతా పాలు, టూటీఫ్రూటీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలో వేసుకుని కుక్కర్ లేదా ఒవెన్‌లో నలభై నిమిషాలపాటు ఉడికించుకుంటే వేడివేడి రవ్వ కేక్ సిద్ధం.
సజ్జలతో
కావలసిన పదార్థాలు : సజ్జ పిండి – కప్పు, పంచదార: పావు కప్పు, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, పెరుగు: ముప్పావు కప్పు, పాలు: అర కప్పు, బేకింగ్ పౌడర్ – టీస్పూను, బేకింగ్ సోడా – అర టీస్పూను, యాలకల పొడి – అర టీస్పూను, నట్స్, చెర్రీస్ – అలంకరణకు.
తయారీ విధానం: ఒక గిన్నెలో సజ్జ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పెరుగు, పంచదార, నూనె వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమంలో జల్లించిన పొడి పదార్థాలను వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి. అవసరమైతే మరికొన్ని పాలు పోసి, మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. దీన్ని సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. లోతుగా ఉన్న ఫ్రైయింగ్ పాన్‌కు నూనె రాసి, దానిలో ఒక బేకింగ్ పేపర్ వేయాలి. పైన కొంచెం నూనె రాసి, కొన్ని నట్స్/ చెర్రీస్ వేసుకోవాలి. నానబెట్టిన కేక్ మిశ్రమాన్ని పాన్‌లో పోసి, మూత పెట్టి తక్కువ మంటపై 20-25 నిమిషాలు లేదా కేక్ ఉడికేంత వరకు ఉంచాలి. ఉడికిన తర్వాత తీసి, పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుని సర్వ్ చేసుకోవచ్చు..



